Ponguleti srinivas reddy: తెలంగాణ మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమీషనర్లకు కీలక సూచనలు చేశారు. గడిచిన 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ మరికొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే రోజుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
రెడ్ అలర్ట్ జిల్లాలపై ఫోకస్..
తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావుతో మంత్రి పొంగులేటి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాయంలో జరిగిన ఈ భేటిలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు వర్చువల్ గా పాల్గొన్నారు. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో నెలకొన్న పరిస్ధితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలెర్ట్‌గా ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
ఒక్కో జిల్లాకు రూ.కోటి తక్షణ సాయం
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవలసిన సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయిలు విడుదల చేశాం. అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నాం’ అని తెలిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకు గాను ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కు పిలిపించాలని వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
Also Read: DMart Independence Sale: డీమార్ట్ పంద్రాగస్టు ఆఫర్.. సగం ధరకే వస్తువులు.. అస్సలు మిస్ కావొద్దు!
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
రాష్ట్రంలోని రైల్వే లైన్లు, లోలెవెల్ బ్రిడ్జీలు, కాజ్‌వేలు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వర్షం నీరు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు. ముఖ్యంగా లోలెవెల్ బ్రిడ్జీల దగ్గర పోలీసు సిబ్బందిని నియమించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న వర్షాలు 200 మిల్లీమీటర్లకే బ్యాక్ వాటర్ వల్ల అక్కడున్న ప్రజలను తరలించవలసి వస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం కోసం అక్కడున్నవారిని తరలించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
