Youtuber Armaan Malik: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ 3 సీజన్ తో పాపులర్ అయిన ఆర్మాన్ మాలిక్ (Armaan Malik)కు బిగ్ షాక్ తగిలింది. ఆర్మాన్ తో పాటు అతడి ఇద్దరు భార్యలు పాయల్, కృతిక మాలిక్ లకు ఢిల్లీలోని పటియాలా జిల్లా కోర్టు (Patiala district court) సమన్లు జారీ చేసింది. రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ఈ నోటీసులు వెళ్లడం గమనార్హం. సెప్టెంబర్ 2న ముగ్గురు కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇంతకీ ఆర్మాన్ అతడి ఇద్దరి భార్యలు చేసిన తప్పేంటి? వారిపై ఎవరు ఫిర్యాదు చేశారు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కోర్టు సమన్లు ఎందుకంటే?
అర్మాన్ మాలిక్, అతడి ఇద్దరు భార్యలకు వ్యతిరేకంగా దావిందర్ రాజ్ పుత్ Davinder Rajput) అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టానికి (Hindu Marriage Act) వ్యతిరేకంగా ఆర్మాన్ ద్వి వివాహం (bigamy)చేసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే భార్య పాయల్ తో కలిసి కాళీమాతను అవమానించేలా చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్ గురించి కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒకసారి ఒక్క వివాహమే అనుమతించబడుతుందని.. కానీ ఆర్మాన్ ఒకేసారి ఇద్దరు భార్యలను కలిగి ఉన్నాడని పిటిషనర్ కోర్టుకు తెలియజేశాడు. అంతేకాదు మెుత్తంగా అతడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపించాడు.
మత విశ్వాసాలు దెబ్బతీశారంటూ..
అంతేకాకుండా ఆర్మాన్, పాయల్ చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్ హిందువుల మతభావాలని దెబ్బతీశాయని దావిందర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. హిందూ దేవత కాళీమాత (Hindu goddess Kali) వేషధారణలో పాయల్ కనిపించడం చాలా మందికి ఆగ్రహం తెప్పించిందని.. ఇది మత విశ్వాసాలను అవమానించడమేనని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. దీనిని శిక్షార్హమైన నేరంగా అభివర్ణించారు. మరొకరు ఇలాంటి తప్పు పునరావృతం చేయకుండా వారిపై అర్మాన్, అతడి ఇద్దరు భార్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దావిందర్ రాజ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆర్మాన్ అతడి ఇద్దరు భార్యలకు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 2న కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని సూచించింది.
క్షమాపణలు కోరిన అర్మాన్ జంట
అయితే కాళీమాతపై చేసిన రీల్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అర్మాన్ జంట దానిని ప్రాయిశ్చితం చేసుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. జూలై 22న పటియాలలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించి ఆర్మాన్, పాయల్ పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి క్షమాపణలు చెప్పారు. మరుసటి రోజు జులై 23న మోహాలీ ఖరార్‌లోని మరో కాళీ ఆలయానికి వెళ్లి ఏడు రోజులపాటు ఆలయాన్ని శుభ్రచేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తర్వాత ఈ జంట హరిద్వార్ వెళ్లి నిరంజని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ కైలాషానంద్ గిరి (Acharya Mahamandaleshwar Kailashanand Giri) ని కలిసి క్షమాపణలు కోరారు. ఈ వరుస పరిణామాలతో పాయల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను మోహాలీలోని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది.
Also Read: TG Rains Today: బిగ్ అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షం.. స్కూళ్లు మూసివేత!
అర్మాన్ మాలిక్ ఎవరు?
అర్మాన్ మాలిక్ అసలు పేరు సందీప్ (Sandeep). ఆయన హరియాణా (Haryana) రాష్ట్రంలోని హిసార్‌కు చెందినవారు. ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి తర్వాత ఢిల్లీలో స్థిరపడి కంటెంట్ క్రియేటర్‌గా ప్రసిద్ధి పొందారు. 2024 జూన్ 21న ప్రారంభమైన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 (Bigg Boss OTT Season 3)లో ఇద్దరు భార్యలతో కలిసి ప్రవేశించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అప్పటి నుంచి తమ విభిన్నమైన వ్యక్తిగత జీవనశైలితో తరచూ ఆన్‌లైన్‌లో హాజరవుతూ వార్తల్లో నిలుస్తున్నారు.