TDP Wins In Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి ప్రతిపక్ష నేతకు షాకివ్వాలని టీడీపీ భావించింది. ఈ ప్రయత్నంలో అధికార పార్టీ తాజాగా విజయం సాధించింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి కేవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ మహిళా అభ్యర్థి లతా రెడ్డి 5,700కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
జగన్ కంచుకోట..
పులివెందుల జెడ్పీటీసీ స్థానం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్ కుటుంబం కంచుకోటగా ఉంటూ వస్తోంది. గత 46 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వైఎస్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. జగన్ స్వయంగా ఈ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక జరగడం అనివార్యంగా మారిపోయింది. దీంతో ఆగస్టు 12న పులివెందులతో పాటు ఒంటిమిట్టలో ఖాళీ ఏర్పడ్డ జెడ్పీటీసీ స్థానానికి ఉపఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందులలో 71.36%, ఒంటిమిట్టలో 66.39% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అయితే పోలింగ్ రోజున టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగడం రాష్ట్రస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ అధినేత సోమవారం ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
టీడీపీ అభ్యర్థి విజయం
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలకు ఆగస్టు 12న జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి గురివారం కౌంటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో పులివెందుల ఫలితాలు వెలువడ్డాయి. విపక్ష నేత జగన్ అడ్డాగా చెప్పుకునే పులివెందులు జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ మహిళా అభ్యర్థి లతారెడ్డి కైవసం చేసుకున్నారు. మెుత్తం 5,794 ఓట్ల మెజార్టీతో ఆమె వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో లతారెడ్డికి 6,833 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 682 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. సొంత నియోజకవర్గంలో జగన్ కు షాకివ్వడంతో టీడీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.
Also Read: Tsunami: విరుచుకుపడ్డ సునామీ.. 100 అడుగుల ఎత్తులో రాకాసి అలలు.. తెలిసేలోపే విధ్వంసం!
టీడీపీ వ్యూహాత్మక ప్రచారం
పులివెందుల జెడ్పీటీసీలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి విజయం కోసం.. అధికార పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించింది. టీడీపీ నాయకులు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జగన్ కంచుకోటలో విజయం సాధించడం ద్వారా వైఎస్ఆర్‌సీపీ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ నాయకులు గ్రామాల వారీగా ప్రజలను సమీకరించి అభివృద్ధి లోపాలను హైలైట్ చేస్తూ ప్రచారం చేశారు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేకపోవడం, అవినీతి, పాలనా వైఫల్యాలను ఎత్తి చూపారు. అటు మంత్రులు సైతం పులివెందులలో మకాం వేసి.. కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపారు.