Minimum balance: మనదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) ఇటీవలే కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ చేసే ఖాతాదారులకు మినిమమ్ బ్యాలెన్స్‌ను రూ.50 వేలకు పెంచింది. మెట్రో, అర్బన్ బ్రాంచ్‌లలో అమలయ్యే ఈ నిబంధన 2025 ఆగస్టు 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో ఈ పరిమితులు మారాయి.
మినిమమ్ బ్యాలెన్స్ రూల్ ఎందుకు?
మినిమమ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ నిబంధన ఒక కస్టమర్ తన సేవింగ్స్ అకౌంట్లో ఉంచాల్సిన కనీస డబ్బు మొత్తాన్ని సూచిస్తుంది. ఈ నిర్దిష్ట మొత్తాన్ని అకౌంట్లో ఉంచకపోతే, నిబంధనల ప్రకారం బ్యాంక్ జరిమానా విధిస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు ప్రతి బ్యాంక్‌కి వేర్వేరుగా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్స్‌కు ఒక విధంగా, బ్రాంచ్ స్థానం (లొకేషన్) ఆధారంగా మరోలా ఉంటాయి. బ్రాంచ్ లొకేషన్ మెట్రో లేదా అర్బన్ (పట్టణ ప్రాంతం) ప్రాంతంలో ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ పరిమితి ఎక్కువగా ఉంటుంది. సెమీ అర్బన్ (మధ్యస్థం) అంటే పట్టణ ప్రాంతాల్లో పరిమితి మధ్యస్థంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తక్కువగా ఉంటుంది. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ ఉంటే
అకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది. అదేవిధంగా జరిమానాలు లేదా పెనాల్టీలు పడవు.
ఏ బ్యాంక్ పరిమితి ఎంత?
1. హెచ్డీఎఫ్సీ
దేశ ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) పట్టణ (Urban) ప్రాంత శాఖల్లో కనీస నెలవారీ బ్యాలెన్స్ పరిమితి రూ.10,000గా ఉంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో అయితే రూ.1 లక్ష డిపాజిట్ (1 సంవత్సరం + 1 రోజు) ఉంచాలి. సెమీ అర్భన్ శాఖల్లో నెలకు రూ.5,000 బ్యాలెన్స్ లేదా రూ.50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే, గ్రామీణ ప్రాంతాల్లో శాఖల్లో అయితే మూడు నెలలకు సగటున రూ.2,500 బ్యాలెన్స్ లేదా రూ.25,000 ఫిక్స్డ్ డిపాజిట్ (1 సంవత్సరం + 1 రోజు) ఉండాలి.
2. ఎస్బీఐ
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐలో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. సేవింగ్స్ ఖాతాలు, సేవింగ్స్ ప్లస్ ఖాతాలకు రూ.0 బ్యాలెన్స్‌తో కూడా అకౌంట్‌ను కొనసాగించవచ్చు. ఇందుకుగానూ ఎలాంటి జరిమానా ఉండదు.
3. కోటక్ మహీంద్రా బ్యాంక్
ఐసీఐసీఐ తర్వాత మూడవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.10,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది. అకౌంట్ రకాన్ని బట్టి మారుతుంది. నెలకు ఉంచాల్సిన కనీస మొత్తాన్ని ఉంచకపోతే 6 శాతం ఛార్జీలు పడతాయి.
4. యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్‌కు అన్ని ప్రాంతాల్లో (పట్టణ, అర్ధ పట్టణ, గ్రామీణ) నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.10,000 లేదా కనీసం రూ.50,000 ఫిక్స్డ్ డిపాజిట్ (12 నెలల గడువు) చేయాల్సింది. ప్రైయారిటీ సేవింగ్స్ అకౌంట్‌కు కనీస బ్యాలెన్స్ నెలకు రూ.2 లక్షలుగా ఉంటుంది. అవసరమైన బ్యాలెన్స్ లేకపతే బ్యాలెన్స్ లోటుపై 6 శాతం చార్జీలను బ్యాంక్ వసూలు చేస్తుంది. గరిష్టంగా రూ.600 వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది.
Read Also- Hydrogen Train: త్వరలోనే సరికొత్త రైలు.. అమెరికా, రష్యాలో కూడా లేదు
5. బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (QAB) అవసరం ఉంటుంది. మెట్రో ప్రాంత బ్రాంచుల్లో రూ.2,000, సెమీ అర్భన్ ఏరియా బ్రాంచుల్లో రూ.1,000, గ్రామీణ బ్రాంచుల్లో రూ.500 ఉంటుంది.
6. పంజాబ్ నేషనల్ బ్యాంక్
ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో నెలవారీ మినిమమ్ బ్యాలెన్స్… మెట్రో బ్రాంచుల్లో రూ.10,000, పట్టణ బ్రాంచుల్లో రూ.5,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2,000, గ్రామీణ ప్రాంత బ్రాంచుల్లో రూ.1,000గా ఉంది.
7. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Minimum-balanceయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెట్రో, అర్బన్ బ్రాంచుల్లో త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (QAB) రూ.1,000గా ఉంటుంది. సెమీ-అర్బన్ బ్రాంచుల్లో రూ.500, గ్రామీణ బ్రాంచుల్లో రూ.250 (QAB)గా ఉంది.
8. కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్ 2025 జూన్ 1 నుంచి, అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలపై నెలవారీ సగటు బ్యాలెన్స్ (AMB) అవసరం లేదు. అకౌంట్ హోల్డర్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేయిన్ చేయకపోయినా జరిమానా ఉండు. ‘నో పెనాల్టీ ఆన్ మినిమమ్ బ్యాలెన్స్’ అనే విధానాన్ని కెనరా బ్యాంక్ కొనసాగిస్తోంది.
Read Also- Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు సీవీఐ వ్యాధి.. లక్షణాలు ఇవే
9. ఐడీబీఐ బ్యాంక్
ఐడీబీఐ బ్యాంక్ మెట్రో, అర్బన్ శాఖల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.10,000గా ఉంది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000గా, గ్రామీణ ప్రాంత బ్రాంచుల్లో రూ.2,500గా ఉంటుంది.
10. ఇండియన్ బ్యాంక్
ఇండియన్ బ్యాంకు మెట్రో, అర్బన్ ప్రాంత బ్రాంచులలో చెక్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్‌గా రూ.2,500గా నిర్ణయించింది. చెక్ ఫెసిలిటీ లేని అకౌంట్ హోల్డర్లకు రూ.1,000గా, సెమి-అర్బన్, గ్రామీణ బ్రాంచులకు (చెక్ ఫెసిలిటీతో) రూ.1,000గా, చెక్ ఫెసిలిటీ లేకుండా రూ.500గా కనీస బ్యాలెన్స్‌ను నిర్ణయించింది.
11. యస్ బ్యాంక్
యస్ బ్యాంక్ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలకు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. జీరో బ్యాలెన్స్ పాలసీ అమలులో ఉంది.