Hydrogen Train: ఎప్పటికప్పుడు అధునాతన మార్పులతో ప్రయాణికులకు విశిష్ట సేవలు అందిస్తున్న ఇండియన్ రైల్వేస్ (Indian Railways) త్వరలోనే భవిష్యత్‌కు సంబంధించిన నూతన మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు ప్రవేశపెట్టబోతోంది. ఇందుకోసం వేగంగా సన్నాహాలు పూర్తి చేస్తోంది. పర్యావరణ హితమైన, చక్కటి ప్రయాణ అనుభవాన్ని అందించే దిశగా కీలక ముందడుగు వేయబోతోంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రైలుకు సంబంధించిన తొలి వీడియోను ఆయన పంచుకున్నారు.
ప్రపంచంలో 5వ దేశం మనమే
హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాల్లో మాత్రమే ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తర్వాత.. హైడ్రోజన్‌తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకొస్తున్న 5వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఈ రైలు తొలి సర్వీసును హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడపనున్నారు. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ఎక్కువదూరం ప్రయాణించనున్న హైడ్రోజన్ రైలు ఇదే కానుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది. ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తరలించగలదని, ఇటీవలే చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో (ICF) ఈ హైడ్రోజన్ రైలు కోచ్ విజయవంతంగా పరీక్షలు పూర్తి చేసుకుందని వివరించింది. ట్రయల్ రన్ నిర్వహించినట్టుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జులైలోనే ప్రకటించారు. భారతదేశం భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే, సుస్థిరమైన దేశంగా మారేందుకు చేస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అంటూ ట్రయల్‌ను ఆయన అభివర్ణించారు. ఈ రైలు 1,200 హార్స్‌పవర్ సామర్థ్యంతో పనిచేస్తుందని, హైడ్రోజన్ ట్రైన్ టెక్నాలజీలో భారత్ ఒక లీడర్‌గా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also- Hyderabad Rains:హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. 4 రోజులపాటు అలర్ట్!
ఒక్కో రైలు ఖర్చు రూ.80 కోట్లు
‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ (Hydrogen for Heritage) పేరిట చేపట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెడుతోంది. మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఒక్కో రైలు ఖర్చు సుమారుగా రూ. 80 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. దేశ వారసత్వ సంపద ప్రాధాన్యత ఉన్న మార్గాలు, కొండ ప్రాంతాల రూట్లకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.70 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాగా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఒక డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్‌ను హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్స్‌తో మార్పులు చేయనున్నారు. హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రీఫ్యూయలింగ్ వంటి అవసరాలకు అనుగుణంగా ఒక ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీని కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది.
Read Also- Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు సీవీఐ వ్యాధి.. లక్షణాలు ఇవే
తొలి రైలు కోసం…
హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడిచే హైడ్రోజన్ రైలుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనం కోసం జింద్‌లో 1 మెగావాట్ సామర్థ్యంతో కూడిన పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ (PEM) ఏర్పాటు చేశారు. ఎలక్ట్రోలైజర్ ద్వారా హైడ్రోజన్ సరఫరా చేస్తారు. ఈ యూనిట్ రోజుకు సుమారుగా 430 కిలోల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగలుగుతుంది. రిఫ్యూయలింగ్ స్టేషన్‌లో 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం, కంప్రెసర్లు, వేగంగా ఇంధనం నింపేందుకు ప్రీ-కూలర్ సదుపాయాలు ఉన్న రెండు డిస్పెన్సర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు.