Bengaluru Constable: సాధారణంగా పోలీసులంటే దొంగలు ఆమడ దూరం పారిపోతారు. కర్మకాలి వారి చేతికి చిక్కామంటే ఇక తమ పని ఔట్ అని అభిప్రాయానికి వచ్చేస్తారు. అలాంటిది ఓ దొంగ పోలీసుల ముందే తన వృత్తి ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. కస్టడీలో ఉన్నానని తెలిసినా.. పోలీసు డ్రెస్ (Police Uniform) కొట్టేశాడు. అంతటితో ఆగకుండా భార్యకు వీడియో కాల్ చేసి ఆమెను సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ దొంగ ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది? కిలాడీ దొంగకు పోలీసులు ఏ విధంగా బుద్ధి చెప్పారు? ఇప్పుడు పరిశీలిద్దాం.
వివరాల్లోకి వెళ్తే..
కస్టడీలోని దొంగ పోలీసుల డ్రెస్ ను కొట్టేసిన విచిత్ర ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. గోవిందపుర పోలీస్ స్టేషన్ (Govindapura police station)కు చెందిన కానిస్టేబుల్ సోనారే హెచ్.ఆర్ (Sonare H R)ను 50కిపైగా దొంగతనం కేసులు ఎదుర్కొంటున్న సలీమ్ షేక్ అలియాస్ బాంబే సలీమ్ (Saleem Sheikh alias Bombay Saleem)కు తన పోలీస్ యూనిఫాం ధరించడానికి అనుమతించినందుకు సస్పెండ్ చేశారు. జూన్ 23న ఇంద్రానగర్ (Indra Nagar) పరిధిలో నమోదైన ఒక దొంగతన కేసును పోలీసులు విచారిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. సీసీటీవీ దృశ్యాలు, ఇతర వివరాలను పరిశీలించిన పోలీసులు.. సలీమ్ ఒక గ్యాంగ్‌లో భాగస్వామి అని గుర్తించారు.
పుణెలో పట్టివేత
ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ ‘సలీమ్ పాత నేరస్తుడు కావడంతో అతని ఫోటో, వేలిముద్రలు, ఇతర వివరాలు మా వద్ద ఉన్నాయి’ అని అన్నారు. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అతను పుణె సమీపంలో ఉన్నాడని బెంగళూరు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో బెంగళూరు పశ్చిమ విభాగ డీసీపీ దేవరాజ్ ఈ సమాచారాన్ని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు. దీంతో పుణె పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈసారి సలీమ్ బెంగళూరులో ఖరీదైన నగలు, చీరలు, ఇతర విలువైన సామాగ్రిని దొంగిలించాడు.
హోటల్లో బస చేసినప్పుడు..
సలీమ్ అరెస్ట్ అనంతరం డీసీపీ దేవరాజ్ మాట్లాడుతూ ‘ఇంద్రానగర్ పోలీసులు విచారణలో భాగంగా సలీమ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించాం. అతడి వాట్సాప్ వీడియో కాల్ స్క్రీన్‌షాట్ దొరికింది. అందులో సలీమ్ యూనిఫాం ధరించి కనిపించాడు. అతను ఆ ఫోటోలో ఉన్న మహిళ తన భార్య అని చెప్పాడు. తర్వాతి విచారణలో గత సంవత్సరం గోవిందపుర పోలీసులు సలీమ్‌ను ఇలాంటి దొంగతన కేసులో అరెస్టు చేశారని తెలిసింది. అప్పట్లో దొంగిలించిన వస్తువులను రికవర్ చేయడానికి పోలీసులు అతన్ని బెంగళూరు బయటకు తీసుకెళ్లి హోటల్‌లో బస చేశారు. అక్కడ సోనారే యూనిఫాం వేసుకుని తన భార్యకు వీడియో కాల్ చేశాడు. ఇది నిర్లక్ష్యానికి ఉదాహరణ. అందుకే సోనారేను సస్పెండ్ చేశాం’ అని దేవరాజ్ అన్నారు.
Also Read: KTR Vs Bandi Sanjay: బండి సంజయ్ 48 గంటల్లో క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ సీరియస్
పోలీసులపై విమర్శలు
మరొక పోలీసు అధికారి తెలిపిన ప్రకారం.. సోనారే మరో కానిస్టేబుల్ హోటల్ గదిలో సలీమ్‌ను లాక్ చేసి షాపింగ్‌కి వెళ్లారు. ‘ఆ సమయంలో సలీమ్, తన భార్య ముందు గొప్పగా కనిపించాలనే ఉద్దేశంతో గదిలో ఉన్న సోనారే యూనిఫాం వేసుకున్నాడు’ అని ఆ అధికారి వివరించారు. సలీమ్ చేసిన దొంగతనాలు ఆధారాలతో సహా రుజువు కావడంతో అతడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన బయటకు రావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక దొంగ ఇలా పోలీసుల కళ్లు కప్పి వారి డ్రెస్ వేసుకోవడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇది పోలీసుల నిర్లక్ష్యానికి పరాకష్ట అన్న అభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి.