CM Revanth Reddy: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హైదరాబాద్ (Hyderabad) లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అదేశించారు.
Also Read: Rahul Gandhi: ఓట్ల దోపిడీపై ఆధారాలు ఇవిగో.. డేటా ప్రకటించిన రాహుల్ గాంధీ
అధికారులు తగిన చర్యలు చేపట్టాలి
జీహెచ్ఎంసీ(ghmc)తో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా( Hydra) విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షించాలని అదేశించారు.లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్(Hyderabad) సిటీ లో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. భారీ వర్ష సూచనలను ఎప్పటికప్పుడు రిపోర్టు ల ఆధారంగా అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్, హైడ్రా( hydra) కమిషనర్, విద్యుత్ విభాగం, విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధం గా ఉండాలని సూచించారు.
Also Read: Raja Singh: ఇంత బిల్డప్ అవసరమా? రాజా సింగ్ సంచలన కామెంట్స్!
అలసత్వం వహించొద్దని ఉన్నతాధికారులకు మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక
భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(Rangareddy District) వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత ఉన్నతాధికారులను జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) ఆదేశించారు. గురువారం రాత్రి వర్షాభావ పరిస్థితులు, వరద సహాయక చర్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(Rangareddy District) పరిధిలోని కలెక్టర్లు, జీహెచ్ఎంసీ,(Ghmc) జలమండలి, టీజీఎస్పీడీసీఎల్, సైబరాబాద్, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. శేరిలింగంపల్లి,(Serilingampally) హైటెక్ సిటీ పరిసరాలు, సరూర్ నగర్, ఉప్పల్, షేక్ పేట్, కూకట్ పల్లి, బాలానగర్, మల్కాజ్ గిరి, బండ్లగూడ, నాగోల్, మూసీ నది పరివాహాక ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని అడిగి తెలుసుకుని మార్గనిర్దేశం చేశారు.
కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అందుకు అనుగుణంగా సిబ్బందికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాత్రిపూట కూడా విధులు నిర్వర్తించి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ప్రజలు తమ ఇబ్బందులను తెలియజేసేందుకు వీలుగా తక్షణమే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి, వాటిపై ప్రసార, సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించాలన్నారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అక్కడ నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అక్కడ వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలన్నారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో ఏమాత్రం అలసత్వం వహించొద్దని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి సమస్యకూ తక్షణ పరిష్కారం చూపించాలన్నారు. ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ప్రభుత్వం మీ వెంట ఉందని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: CPM Protest: 8న జిల్లా మండల కేంద్రాల్లో నిరసన: జాన్ వెస్లీ