Zara Ads: బ్రిటన్‌కు చెందిన ప్రకటన ప్రమాణాల సంస్థ ఏఎస్ఏ (Advertising Standards Authority-ASA) స్పెయిన్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా (ZARA)పై చర్యలు తీసుకుంది. జారాలో ప్రచురించిన రెండు ప్రకటనల్లో ఉన్న మోడల్స్.. అనారోగ్యకరంగా బలహీనంగా కనిపించారని ఏఎస్ఏ పేర్కొంది. ఈ ప్రకటనలు సన్నగా ఉన్న వారినే ప్రోత్సహించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. దీనిని బాధ్యతారాహిత్యంగా పరిగణిస్తూ ఆ రెండు ప్రకటనలపై నిషేధం విధించింది.
అసలేం జరిగిందంటే?
ఏఎస్ఏ తెలిపిన వివరాల ప్రకారం ఒక ప్రకటనలో మోడల్.. పాలిపోయిన ముఖం, వాలిపోయిన కురులు, చిక్కిపోయిన శరీరంతో ఉంది. మరో ప్రకటనలో మోడల్ మెడ ఎముకలు స్పష్టంగా కనిపించడంతో ఆమె శరీరం బలహీనంగా.. మరీ సన్నగా ఉందనే భావన కలుగుతోందని ఏఎస్ఏ స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ప్రకటనలు ప్రజలపై తప్పుడు అందాల ప్రమాణాలను రుద్దేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఆరోగ్యకరం కానీ శరీర నిర్మాణాలను అందమైనవిగా ప్రోత్సహించే ప్రయత్నం చేశారని ఏఎస్ఏ పేర్కొంది.
జారా రియాక్షన్ ఇదే..
ఈ వివాదాస్పద రెండు ప్రకటన తాలుకూ చిత్రాలు.. జారా యాప్, వెబ్‌సైట్‌లో ప్రచురించబడ్డాయి. ఒక ప్రకటనలో చిన్న డ్రస్ ప్రమోషన్ చేయగా.. మరొకటి కాలర్ షర్ట్‌కు సంబంధించినది. అయితే వినియోగదారుల నుంచి ప్రత్యక్షంగా ఫిర్యాదులు రాకపోయినా ఏఎస్ఏ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం గమనార్హం. ఆ రెండు ప్రకటనలపై ఏఎస్ఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ జారా కూడా దీనిపై స్పందించింది. వెంటనే రెండు ప్రకటనలను యాప్, వెబ్ సైట్ నుంచి తొలగించింది. ఆయా ప్రకటనల్లో చేసిన మోడల్స్.. పూర్తి ఆరోగ్యవంతులని సదరు కంపెనీ ప్రకటించింది. ఫొటో ఎడిటింగ్ లో లోపాల వల్లే ఈ తప్పిదం జరిగిందని పేర్కొంది.
ఇదేం కొత్త కాదు..
అయితే ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ రిటైల్ బ్రాండ్ మార్క్స్ & స్పెన్సర్ (Marks & Spencer)కు కూడా ఎదురైంది. అక్కడ కూడా మోడల్స్ అనారోగ్యంగా సన్నబడినట్లు ఉన్నారనే ఆరోపణలపై ఏఎస్ఏకు నాలుగు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా ఒక మోడల్ పింక్ పొల్కా డాట్ డ్రస్‌లో కనిపించగా మరో మోడల్ తక్కువ పరిమాణం ఉన్న ప్యాంట్‌లు, వైట్ టాప్‌లో కనిపించింది. మోడల్స్ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఎంపికయ్యారని వారు సైజ్ 8 ఉన్నారని M&S చెప్పినప్పటికీ ఏఎస్ఏ ఒక ప్రకటనను బాధ్యతారాహిత్యంగా పరిగణించి వెనక్కి తీసేయమని ఆదేశించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్యాషన్ బ్రాండ్ నెక్స్ట్ (Next) కూడా ఇలాంటి సమస్యే ఎదురుకావడం గమనార్హం.
Also Read: Anchor Ravi: ఆ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. ప్రత్యేక్షంగా చూశా.. యాంకర్ రవి
చర్యలపై ప్రశంసలు..
జారా ఫ్యాషన్ బ్రాండ్ ప్రకటనపై ఏఎస్ఏ తీసుకున్న చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు. మనిషి ఆకారం విషయంలో పెరుగుతున్న చైతన్యానికి దీనిని నిదర్శనంగా చెబుతున్నారు. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికల్లో ‘స్కిన్ని టోక్’ (SkinnyTok) లాంటి ట్రెండ్లు యువతపై చెడు ప్రభావం చూపుతున్నాయని.. మితిమీరిన సన్నదనాన్ని ఆహార నియంత్రణను ప్రోత్సహిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విధంగా ప్రకటనలపై ఆంక్షలు పెట్టడం ద్వారా.. నిజంగానే మార్పు వస్తుందా? అన్న ప్రశ్నలు సైతం పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి.