Donald Trump: రష్యా నుంచి చమురు (Russian oil imports) కొనుగోలు చేస్తున్న భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్కసు వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం భారత్ దీటుగా బదులిస్తూ రష్యా (Russia)తో అమెరికా (America) చేస్తున్న వాణిజ్యం మాట ఏంటని సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ అంశం గురించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్న ఎదురైంది. అయితే అంతర్జాతీయ మీడియాకు ఆయన ఇచ్చిన సమాధానం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘నాకేం తెలియదు’
2028లో లాస్ ఏంజిల్స్ (Los Angeles Olympics – 2028) వేదికగా జరగబోయే ఒలింపిక్స్ గురించి శ్వేత సౌధం (White House) వేదికగా విలేకారల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న అధ్యక్షుడు ట్రంప్ కు.. భారత్ చెబుతున్నట్లుగా రష్యాతో అమెరికా వాణిజ్యం (US Russia Trade) చేస్తోందా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ట్రంప్ సమాధానం ఇస్తూ.. ‘దాని గురించి నాకు ఏమీ తెలియదు. నేను సరిచూసుకోవాలి’ అని సమాధానం ఇచ్చారు. అదే విధంగా భారత్ పై 25 శాతం సుంకాలు విధిస్తుండటంపై విలేకారులు ప్రశ్నించగా.. ట్రంప్ మాట మార్చారు. అలాంటి శాతాలేవి తాను చెప్పలేదని సమాధానం ఇచ్చారు. సుంకాల విధింపుపై కసరత్తు జరుగుతోందని అన్నారు. రేపు రష్యాతో సమావేశం ఉంటుందని.. ఏం జరుగుతుందో చూడాలని ట్రంప్ చెప్పుకొచ్చారు.
రష్యా – అమెరికా వాణిజ్యం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభించి మూడేళ్లు గడిచినా కూడా అమెరికా ఇప్పటికీ రష్యా నుంచి బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, ఇతర వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. 2022 జనవరి నుండి అమెరికా రష్యా నుంచి 24.51 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంది. 2024లో అమెరికా మాస్కో నుంచి 1.27 బిలియన్ డాలర్ల ఎరువులు, 624 మిలియన్ డాలర్ల విలువైన యూరేనియం, ప్లుటోనియం, సుమారు 878 మిలియన్ డాలర్ల పల్లాడియం దిగుమతి చేసుకుంది.
‘భారత్‌తో స్నేహం పాడు చేసుకోవద్దు’
ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ.. ట్రంప్ ప్రతీకార సుంకాలపై విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే సుంకాలను గణనీయంగా పెంచుతానన్న ట్రంప్ ప్రకటనను ఆమె ఎక్స్ (Twitter) వేదికగా తప్పుబట్టారు. హేలీ తన ఎక్స్ పోస్ట్‌లో ‘చైనా అమెరికాకు శత్రువు. కానీ ట్రంప్ ప్రభుత్వం చైనాకు 90 రోజుల సుంకాల సడలింపు ఇచ్చింది. అదే సమయంలో భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనకూడదా?. చైనాకు మినహాయింపు ఇస్తూ భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలు పాడు చేయకండి’ అంటూ ట్రంప్ ను హేలీ హెచ్చరించారు.
Also Read: SHOCKING VIDEO: వీధి కుక్కలపై అత్యాచారం.. ఛీ ఛీ వీడు అసలు మనిషేనా?
భారత్‌పై ట్రంప్ నయా బెదిరింపు!
భారత్ ను వరుసగా బెదిరిస్తూ వస్తున్న ట్రంప్.. మంగళవారం కూడా మరో స్టేట్ మెంట్ ను పాస్ చేశారు. రష్యాతో భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నందున ఆ దేశం దిగుమతులపై నిర్ణయించిన 25 శాతం సుంకాన్ని తదుపరి 24 గంటల్లో గణనీయంగా పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. ‘వాళ్లు యుద్ధ యంత్రానికి ఇంధనం అందిస్తున్నారు. అలాంటప్పుడు నేను సంతోషంగా ఉండను’ అని ట్రంప్ ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.