Mohammed Siraj: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదవ టెస్టులో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) హీరోగా మారిపోయాడు. చివరి టెస్టులో 6 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించడం, సిరీస్ 2-2తో సమం కావడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం 9 వికెట్లు సాధించి భారత విజయానికి బాటలు వేశాడు. ఒక్క చివరి టెస్టులోనే కాదు, సిరీస్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడకపోయినప్పటికీ, ఆ లోటు తెలియకుండా చేశాడు. జూనియర్ బౌలర్లు ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లతో కలిసి బౌలింగ్ విభాగాన్ని పటిష్టంగా ముందుకు నడిపించాడు. మొత్తంగా బుమ్రా లేని మ్యాచ్‌ల్లో టీమిండియా వెనుకబడకుండా సిరాజ్ మ్యాజికల్ ప్రదర్శన చేశాడు. అంత గొప్పగా రాణించిన మహ్మద్ సిరాజ్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్ అసలు సిసలైన ప్రతిభను అభిమానులు గుర్తించలేకపోయారని వ్యాఖ్యానించాడు.
Read Also- Mass Jathara: ‘ఓలే ఓలే’.. రవితేజ-శ్రీలీల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవ్!
టైమ్ వచ్చింది..
‘‘మనమంతా మహ్మద్ సిరాజ్‌ను గుర్తించలేకపోయాం. ఇప్పుడు అతడిని గుర్తించే సమయం వచ్చింది. మరొకసారి అతడే చేయి పైకి లేపాడు. అందరూ గుర్తించాల్సిన కారణాన్ని చెప్పాడు. అతడి సంబరాలను ఒక్కసారి చూడండి. ఇది ట్రైలర్ కాదు, అసలైన సినిమా అని చెబుతున్నట్టు ఉంది. నన్ను మ్యాచ్ విన్నర్‌గా పరిగణించాలని అంటున్నాడు. అతడు ఎంత గొప్ప బౌలర్‌న్నది గుర్తు చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ యాక్షన్, టెక్నిక్, శ్రమించే తత్వం ఉండబట్టే అతడు ఒకే సిరీస్‌లో 5 టెస్టులు ఆడగలిగాడు’’ అని రవిచంద్రన్ అశ్విన్ మెచ్చుకున్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. సిరాజ్ వయసు పెరుగుతున్నందున అతడిపై శారీరక ఒత్తిడిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ అశ్విన్ సూచించాడు.
Read Also- Trump on India: భారత్‌పై మరోసారి విషం కక్కిన డొనాల్డ్ ట్రంప్.. 24 గంటల్లో..
అవసరంలేని మ్యాచ్‌ల్లో విశ్రాంతి ఇవ్వాలి
మహ్మద్ సిరాజ్‌కు కూడా వయసు పెరగుతోందని, కాబట్టి అవసరం లేని మ్యాచ్‌లలో అతడికి విశ్రాంతి ఇవ్వడం జట్టు మేనేజ్‌మెంట్ బాధ్యత అని అశ్విన్ సూచించాడు. ‘‘సిరాజ్ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ కావొచ్చు. టెస్టుల్లో అత్యంత నమ్మకమైన బౌలర్ కావొచ్చు. జట్టులోని మిగతా ఆటగాళ్లతో బౌలింగ్ అటాక్‌ను పున:నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆకాశ్ దీప్, ప్రసిద్ క్రిష్ణ, అర్షదీప్ సింగ్ జట్టులోనే ఉన్నారు. మహ్మద్ సిరాజ్ అనుభవాన్ని ఉపయోగించుకొని బౌలింగ్ లైనప్‌ను మెరుగుపరచాలి’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, ఐదో టెస్ట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మొత్తం 5 మ్యాచ్‌లలో 23 వికెట్లతో సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
Read Also- TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!