Guvvala Balaraju: ఓ వైపు అవినీతి కేసులు, మరోవైపు అన్న, చెల్లి నడుమ ఆధిపత్య పోరుతో సతమతమవుతున్న ‘కారు’ పార్టీలో మరో కుదుపు మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్(KCR) ఆణిముత్యాల్లో ఒకరైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో గువ్వల కీలకంగా ఉన్నారు. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి సైలెంట్‌గానే ఉన్నారు. తీరా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. కాగా, రెండ్రోజుల క్రితమే గులాబీ బాస్ కేసీఆర్(KCR)కు బాలరాజు(Guvvala Balaraju) లేఖ రాశారు. ప్రస్తుతం హస్తినలోనే ఆయన మకాం వేసినట్లు తెలుస్తోంది. అయితే మంచి సమయంలో చూసుకుని వీలైనంతన త్వరలోనే కాషాయతీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటే ఇంకొందరు సైతం కమలం పార్టీలో చేరే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం.
Also Read: CM Revanth Reddy: మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు..
కేసీఆర్‌కు ఝలక్
తెలంగాణ బీజేపీ(BJP)కి కొత్త అధ్యక్షుడిగా రాంచందర్ రావు(Ramchandra Rao)బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే కేసీఆర్‌కు గట్టి ఝలక్ ఇచ్చారు. కేసీఆర్(KCR) ఇలాక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి తన ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టి పలువురు నేతలను పార్టీలో చేర్చుకున్నారు. గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ను త్వరలో బీజేపీలో చేర్చుకుని మరో ఝలక్ ఇవ్వబోతున్నారు. గువ్వలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంకొందరు నేతలను సైతం పార్టీలో చేర్చుకుని గులాబీ పార్టీని లేకుండా చేయాలనే వ్యూహంతో కమలం పార్టీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కారు పార్టీలో కీలక నేతలను ఒక్కొక్కరుగా చేర్చుకుని బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలనే వ్యూహంతో కాషాయ పార్టీ వ్యూహరచన చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గువ్వల 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాలరాజు కొనసాగారు.
‘కారు’ నుంచి ఒక్కొక్కరిని దింపి..
త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారీగా స్థానాలను గెలుచుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని కమలదళం భావిస్తోంది. అందుకే రివర్స్ ది ట్రెండ్ నినాదంతో తొలుత స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని డిసైడ్ అయింది. గ్రామీణస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుని ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది. అందుకే స్థానికసంస్థల ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాషాయ పార్టీ వ్యూహాత్మకంగానే కారు పార్టీలో నుంచి ఒక్కొక్కరిని దించి, క్రమంగా వారికి కమలాన్ని అందించి చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు ముందే బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందకు భారీ స్కెచ్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: GHMC: గూగుల్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న జీహెచ్ఎంసీ
ఢిల్లీ నుంచే రాజీనామా
ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో భాగమైన నలుగురిలో గువ్వల బాలరాజు(Guvvala Balaraju )ఒకరు. ఆయన ఢిల్లీలోనే ఉండి రాజీనామా లేఖను కేసీఆర్(Kcr)కు పంపించినట్లు తెలుస్తోంది. కాగా, అక్కడే మకాం వేసి బీజేపీ జాతీయ పార్టీ పెద్దలను కలిసి చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొంతమంది కీలక నేతలను ఆయన కలిసే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ కుదిరితే ఈనెల 9 లేదా 10న గువ్వల బాలరాజు(Guvvala Balaraju) కాషాయతీర్థం పుచ్చుకునే అవకాశం సైతం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, కాషాయ పార్టీ సైతం ఆయన్ను చేర్చుకుని ఉమ్మడి మహబూబ్ నగర్(Mahabubnagar)జిల్లాలో కారును ఖాళీ చేయించాలనే ప్లాన్‌తో ఉన్నట్లుగా సమాచారం. గులాబీ పార్టీ నుంచి తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పలువురు నేతల పేర్లతో కూడిన జాబితాను సైతం కమలనాథులు సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
క్యూ కట్టే ఛాన్స్!
గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పడంతో ఉమ్మడి మహబూబ్ నగర్(Mahabubnagar)జిల్లా బీఆర్ఎస్‌కు చెందిన మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సైతం రాజీనామాకు క్యూ కట్టే అవకాశముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం పేరు సైతం వినిపిస్తోంది. అలాగే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గత కొన్ని నెలలుగా వీరంతా సైలెంట్ మోడ్‌లోనే ఉన్నారు.
ఇదిలా ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అబ్రహం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తనకు కాకుండా విజయుడికి అలంపూర్ టికెట్ ఇవ్వడంతో అబ్రహం అప్పట్లోనే బీఆర్ఎస్తో సంబంధాలు తెంచుకుంటారనే ప్రచారం జరిగింది. ఇకపోతే పార్టీ మార్పు అంటూ జరుగుతున్న ప్రచారంపై మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు దృష్ప్రచారం చేస్తున్నారని, తన చివరి శ్వాస వరకు కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని నోట్ రిలీజ్ చేశారు. మరి ఆయన దానికే కట్టుబడి ఉంటారా? లేక తూచ్ అంటూ బీజేపీలో చేరుతారా? అనేది త్వరలోనే తేలనుంది.
అన్నీ మైనస్‌లే!
బీఆర్ఎస్‌లో రాజీనామాల ప్రకంపనలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. అసంతృప్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వయంగా కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సైతం పరోక్షంగా పార్టీని విభేదించి బీసీ నినాదంపై పోరాడుతోంది. ఇప్పుడు తాజాగా బాలరాజు రాజీనామా చేయడం పార్టీకి మైనస్ అవ్వనుంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది.
ఎంతోమందిని తమ పార్టీలో చేర్చుకుంది. తీరా ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీ జాతీయ పార్టీ పెద్దలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. బీఆర్ఎస్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఈ అంశం సంచలనంగా మారడమే కాక బీజేపీకి దారుణమైన డ్యామేజ్‌ను మిగిల్చింది. దీంతో అదును చూసి బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టాలని పార్టీ అప్పుడే డిసైడ్ అయిందని చర్చించుకుంటున్నారు. తీరా ఆ టైం ఇప్పుడు రానే వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు. బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్న కాషాయ పార్టీ ఇంకెంత మందిని తమ పార్టీలో చేర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: King Nagarjuna: ‘కూలీ’ చివరిరోజు రజనీ సర్ అందరినీ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చారు