Complex Fertilizers: కాంప్లెక్స్ ఎరువుల ధరలు క్రమేపీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం వ్యవసాయ సీజన్లో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడుతోంది. యూరియా(Urea)తో పాటు కాంప్లెక్స్ ఎరువుల్లో డీఏపీ(DAP)కి కేంద్ర ప్రభుత్వం రాయితీ కొనసాగిస్తోంది. దీంతో ఈ రెండు ఎరువుల ధరలు మాత్రమే ప్రస్తుతం రైతులకు కొంతమేర అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ డీలర్లకు మార్కెఫెడ్ నుంచి యూరియా సక్రమంగా సరఫరా కావడం లేదు. పీఏసీఎస్(PACS), ఆగ్రో(Agro) సెంటర్లకు మాత్రమే యూరియా అందుబాటులో ఉంటోంది. ప్రస్తుతం రైతులు పత్తి(Cotton), మిరప(Chilli),ఉల్లి(Onion),వరి(Rice) పంటలకు యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నారు. అయితే ప్రైవేటు డీలర్ల వద్ద డీఏపీ కూడా రైతుల అవసరాల మేరకు అందుబాటులో ఉండడం లేదు. కొందరు డీలర్ల వద్ద ఉన్నా డీఏపీ కావాలంటే ఇతర ఎరువులు కొనాలంటూ లింక్ పెడుతున్నారు. ఐదు బస్తాల డీఏపీ కావాలంటే ఒక బస్తా క్యాల్షియం లేదా పొటాష్(Potash), లేదంటే నానో డీఏపీ(DAP), నానో యూరియా కొనాలంటూ షరతు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
అసలే వర్షాకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడుతుంటే బోర్లు, బావుల కింద సాగు చేస్తున్న పంటలకు సైతం ఎరువుల రూపంలో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమకు డీఏపీ సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్లే ఇలా నిబంధనలు పెడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం యూరియా, డీఏపీకి డిమాండ్ పెరగడంతో కొందరు ప్రైవేటు డీలర్లు డీఏపీ బస్తాపై రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాయితీ పోగా రూ.1,350కి విక్రయించాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1400 చొప్పున అమ్ముతున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 1.73 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు.
నానో పై అవగాహన కల్పించాలి
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, యూరియా కూడా సరిగా దొరకకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో వ్యవసాయ(Agriculture) అధికారులు నానో యూరియా, నానో డీఏపీ(Nano DAP) వినియోగించాలని రైతులకు సూచిస్తున్నారు. అయితే ద్రవరూప ఎరువుల వినియోగంపై పెద్దగా ఆసక్తి లేని రైతులు గుళికల ఎరువులకే ప్రాధాన్యత ఇస్తు న్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు(Scientists) క్షేత్రస్థాయిలో పర్యటించి నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరముందని రైతులు(Farmers) అంటున్నారు. జిల్లాలో పిఎసిఎస్, రైతు ఆగ్రో సెంటర్లకు 60 శాతం కేటాయిస్తుండగా ప్రైవేట్ డీలర్లకు 40 శాతం పంపిణీ చేస్తున్నారు. మార్కెట్‌లో అన్ని ఫర్టిలైజర్(Fertilizer) దుకాణాలలో ఎరువులు లభించినట్లయితే రైతులకు కావాల్సిన ఏరువులను పొందేందుకు సులువుగా ఉంటుందన్నారు.
Also Read: Ramchanadr Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం!
ప్రారంభమైన వరి, మిరప సాగు
ప్రస్తుతం వరి సాగుకు రైతులు సమయతమవుతున్నారు.వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆగస్టు(Augst) నెల నుంచి మిరప(Chilli) సాగుకు కొన్ని మండలాలలో వాణిజ్య పంట అయిన మిరప పంటను బోర్లు, బావుల కింద సాగుకు సిద్ధమవుతున్నారు. గత పది రోజులుగా జూరాల(Jurala), నెట్టెంపాడు(Netempadu), ఆర్డీఎస్(RDS) ఆయకట్టు కింద రైతులు వరి నాట్లు వేస్తున్నారు. నాట్లకు ముందే దుక్కిలో డీఏపీ వేస్తారు. పత్తిపంటకు కూడా తొలివిడత డీఏపీ, యూరియా కలిపి వేస్తున్నారు. ఈ తరుణంలో డీఏపీ, యూరియా ఎరువులు దొరకడం కొంత ఇబ్బందిగా మారింది. డీఏపీ(DAP)కి బదులుగా వేరే ఇతర కాంప్లెక్స్ ఎరువులు వేయాలంటే వాటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
పెరిగిన ఎరువుల ధరలు
గతేడాది రూ.1,300 ఉన్న 20:20:0:13 బస్తా ధర ఇప్పుడు రూ.1,400, 10:26:26 రూ.1,470 ఉండగా ఇప్పుడు రూ.1,800కు, 14:35:14, రకం రూ 1,700 నుంచి రూ.1,800కు పెరిగింది. గతేడాది రూ.1,535 ఉన్న పొటాష్ ధర ఇప్పుడు రూ.1,900కు చేరింది. 15:15:15 ఎరువుల బస్తా ధర రూ.1,450 నుంచి రూ.1,600కు పెరిగింది. సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూ. 580 నుంచి రూ.640కి చేరింది. ఇలా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో రైతులు తొలి విడతలో మొక్క ఎదుగుదలకు డీఏపీ వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో డీపీపీ(DPP) దొరకకపోవడం, దొరికినా ఇతర ఎరువులు అంటగడుతుండడంతో వారికి తలకు మించిన భారంగా మారింది.
ఇతర ఎరువులు అంటగడుతున్నారు కేశవ
ఐదు డీఏపీ(DAP) కొనాలంటే దాంతో పాటు ఇతర ఎరువులు కూడా అంటగడుతున్నారు. బస్తాల డీఏపీ కొనాలంటే ఒక బస్తా క్యాల్షియం(Calcium) కొనాల్సిందేనని వ్యాపారులు చెబుతున్నారు. అవసరం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కూడా కొనాల్సి వస్తోంది. మిగతా కాంప్లెక్స్ ఎరువుల(Complex Fertilizers) ధరలు బాగా పెరగడంతో డీఏపీనే వేస్తున్నాం అని కేశవ అనే రైతు తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం