Rahul Gandhi: 2019లో మరణించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచలన ఆరోపణ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళనలు తీవ్రతరమైన సమయంలో నాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ తనను బెదిరించారని రాహుల్ గాంధీ అన్నారు. తనను బెదిరించేందుకు అరుణ్ జైట్లీని పంపించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘2025 వార్షిక లీగల్ కాన్‌క్లేవ్‌లో రాహుల్ గాంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ‘‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు అరుణ్ జైట్లీ నా వద్దకు వచ్చి బెదిరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు కొనసాగిస్తే, మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని జైట్లీ బెదిరించారు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘నేను జైట్లీ వైపు చూసి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకే తెలియదేమో అని చెప్పాను’’ అని రాహుల్ గాంధీ వివరించారు.
కౌంటర్ ఇచ్చిన రోహన్ జైట్లీ
రాహుల్ వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కొడుకు రోహన్ జైట్లీ శనివారం ఉదయం ఘాటుగా స్పందించారు. “2020లో కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఏడాదికి పైగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగించారు. దీంతో, ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. జైట్లీ మరణించిన తర్వాతే ఈ చట్టాలు వచ్చాయి’’ ఆయన గుర్తుచేశారు. తన తండ్రి మరణించిన తర్వాతే సాగు చట్టాలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను కాలం ప్రకారం గమనిస్తే అసంభవమని విమర్శించారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడిగా ఉన్న రోహన్ జైట్లీ ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ ద్వారా స్పందించారు. ‘‘నా తండ్రిది విపక్షాలను బెదిరించే నైజం కాదు. ఆయన ఎల్లప్పుడూ బహిరంగ చర్చలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు’’ అని పేర్కొన్నారు.
Read Also- Viral News: మొగుడి హత్యకు భార్య పక్కా ప్లాన్.. అడవిలో బిగ్ ట్విస్ట్
మా నాన్న స్వభావం అలాంటిది కాదు..
‘‘సాగు చట్టాల విషయంలో అరుణ్ జైట్లీ బెదిరించారని రాహుల్ గాంధీ ఇప్పుడు చెబుతున్నారు. కానీ, ఆయనకు నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. నా తండ్రి 2019లో మరణించారు. సాగు చట్టాలను 2020లో ప్రవేశపెట్టారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, భిన్నాభిప్రాయాల కారణంగా ఏ ఒక్కర్నీ బెదిరించడం నా తండ్రి స్వభావం కాదు. ఆయన నిజమైన ప్రజాస్వామికవాది. ఏ విషయంలోనైనా సమ్మతిని రాబట్టాలనే ధృఢ నమ్మకంతో ఉండేవారు. రాజకీయాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా, అందరికీ అనుకూలంగా ఉండే పరిష్కారం కోసం స్వేచ్ఛాయుతంగా, సంపూర్ణ చర్చలు జరిపేవారు. ఆయన వ్యక్తిత్వం అదే. ఆయన వారసత్వంగా మిగిలింది కూడా ఇదే’’ రోహన్ జైట్లీ పేర్కొన్నారు. చనిపోయిన వారి గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ లాంటి నాయకులు జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మనోహర్ పరికర్ విషయంలో కూడా రాహుల్ గాంధీ ఇదే విధంగా ప్రవర్తించారని, ఆయన చివరి రోజుల్ని రాజకీయం చేయాలని ప్రయత్నించడం కూడా అసహ్యంగా అనిపించిందని రోహన్ జైట్లీ ఘాటుగా విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై నాడు రక్షణ మంత్రి మనోహర్ పరికర్‌పై రాహుల్ గాంధీ ఆరోపణలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ కూడా ఖండించింది. ‘ఇది ఫేక్ న్యూస్ మాత్రమే. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు’’ అని అధికారి పార్టీ కొట్టిపారేసింది.