Anil Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి (Anil Ambani) బిగ్ షాక్ తగిలింది. ఏకంగా రూ.3,000 కోట్ల రుణ మోసానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసిన శుక్రవారమే లుకౌట్ నోటీసుల విషయం వెలుగులోకి వచ్చింది. ఏదైనా నేరం లేదా ఆర్థిక కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దేశం విడిచి పారిపోకుండా అడ్డుకోవడానికి లుకౌట్ సర్క్యులర్ జారీ చేస్తారు. ఈ సర్క్యులర్ జారీ చేస్తే దేశంలోని అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లకు, ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాలకు సమాచారం వెళుతుంది. సదరు వ్యక్తి విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుంది. పట్టుకున్న వెంటనే అధికారులను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది.
కాగా, 2017, 2019 మధ్యకాలంలో యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న సుమారు రూ.3,000 కోట్ల రుణాల్లో జరిగిన అవకతవకల కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సమగ్ర దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో యస్ బ్యాంక్ ప్రమోటర్లు రుణాలు మంజూరు చేయడానికి ముందు కొన్ని లావాదేవీల రూపంలో డబ్బులు పొందినట్లు ఈడీ గుర్తించింది. కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. దీంతో, క్విడ్ ప్రో కో ఒప్పందం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 24న ఈడీ దాడులు మొదలు పెట్టింది. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 50కిపైగా కంపెనీలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దాడులు జరిగాయి.
Read Also- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక ప్రకటన
దాడులను నిర్దారించిన రిలయన్స్ గ్రూప్
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈడీ దాడులను నిర్ధారించాయి. ఈమేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం అందించాయి. ఈడీ సోదాలను ధ్రువీకరిస్తున్నామని, అయితే, ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలపై, ఆర్థిక స్థితిపై, షేర్ హోల్డర్లపై, ఉద్యోగులపై లేదా ఇతర వాటాదారులపై ఏలాంటి ప్రభావం చూపబోవని స్టాక్స్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో పేర్కొన్నాయి. ‘మీడియా కథనాలు అనుమానాస్పదంగా చెబుతున్న లావాదేవీలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM), లేదా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు సంబంధించినవేనని, అయితే, అవన్నీ పదేళ్లకు పైగా పాతవని కంపెనీలు వివరించాయి.
Read also- US Tariffs: ట్రంప్ టారిఫ్‌పై విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు
నకిలీ బ్యాంక్ గ్యారంటీ కేసు కూడా
రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన అవకతవకలపై దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విస్తరిస్తోంది. తాజాగా రూ.68.2 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీ కేసుపైనా విచారణ మొదలుపెట్టింది. బిస్వాల్ ట్రేడ్లింక్ (Biswal Tradelink) అనే సంస్థ, పలు షెల్ కంపెనీలతో కలిసి ఈ నకిలీ గ్యారంటీ వ్యవహారాన్ని నడిపిందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. సెకీకి (SECI) బిస్వాల్ ట్రేడ్‌లింక్ నకిలీ బ్యాంక్ గ్యారంటీని ఇష్యూ చేసిందని, ఇందుకోసం ‘s-bi.co.in’ అనే డొమెన్‌ను ఉపయోగించారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఎస్‌బీఐ అధికారిక డొమెన్ అయిన ‘sbi.co.in’కు ఇది చాలా దగ్గరగా ఉండేలా చూసుకున్నారని వివరించింది. ఈ నకిలీ డొమెన్ ద్వారా బ్యాంక్ తరఫున వచ్చినట్టుగా మోసపూరిత ఈ-మెయిళ్లను పంపి సెకీని మోసం చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టిసారించిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది.