Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సుంకాల బాంబు పేల్చాడు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచుతూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇందులో కనీస సుంకం 10 శాతం కాగా.. గరిష్టం 41 శాతంగా ఉంది. వాణిజ్య ఒప్పందానికి గల గడువు శుక్రవారం (ఆగస్టు 1)తో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ అధిక సుంకాల విధింపునకు నిర్ణయించినట్లు అర్థమవుతోంది.
భారత్‌పై పెంపు.. పాక్‌కు తగ్గింపు
డొనాల్డ్ ట్రంప్ తన కార్యానిర్వహక ఉత్తర్వులో గ్లోబల్ కనీస సుంకం 10%గా ఉంది. అమెరికాతో వాణిజ్య మిగులు ఉన్న దేశాలపై 15% లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను ట్రంప్ విధించారు. సిరియా నుంచి వచ్చే దిగుమతులపై గరిష్టంగా 41 శాతం టారిఫ్స్ విధించడం గమనార్హం. అలాగే కెనడా వస్తువులపై ఉన్న సుంకాన్ని 25% నుంచి 35%కి పెంచారు. బ్రెజిల్‌పై ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాలకు అదనంగా 40శాతం జత చేశారు. ఇక, భారత్‌పై 25శాతం టారిఫ్ విధించారు. అయితే, పాకిస్థాన్ దిగుమతులపై 29 శాతంగా ఉన్న టారిఫ్‌లను 19 శాతానికి తగ్గించడం గమనార్హం. తైవాన్ వస్తువులపై 20%, స్విట్జర్లాండ్ వస్తువులపై 39% సుంకాలు విధిస్తూ ట్రంప్ సంతకం చేశారు. తాజా ఉత్తర్వులో లేని ఏ దేశంపైనైనా డిఫాల్ట్ సుంకం 10%గా విధించబడింది.
ఆ దేశాలు విఫలమయ్యాయి: ట్రంప్
ట్రంప్ తాజా ఉత్తర్వులో పేర్కొంటూ ‘కొన్ని దేశాలు వాణిజ్య ఒప్పందానికి చర్చలు జరిపాయి. అయితే అమెరికాతో ఉన్న అసమానతలను పరిష్కరించడానికి సరైన ప్రతిపాదనలు ఇవ్వలేకపోయాయి. అమెరికాతో ఆర్థిక, జాతీయ భద్రతా అంశాలలో సరైన స్థాయిలో సర్దుబాటు కాలేకపోయాయి’ అని అన్నారు. మరోవైపు శ్వేతసౌధం అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రతీకార సుంకాలు అమల్లోకి రానందున వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలతో కుదిరిన వాణిజ్య ఒప్పందాలని ప్రకటించాల్సి ఉందని చెప్పారు.
అధిక సుంకాలు ఎదుర్కొంటున్న టాప్ – 10 దేశాలు
❄️ సిరియా – 41%
❄️ లావోస్ – 40%
❄️ మయన్మార్ (బర్మా) – 40%
❄️ స్విట్జర్లాండ్ – 39%
❄️ ఇరాక్ – 35%
❄️ సెర్బియా – 35%
❄️ అల్‌జీరియా – 30%
❄️ బోస్నియా అండ్ హెర్జెగోవినా – 30%
❄️ లిబియా – 30%
❄️ దక్షిణ ఆఫ్రికా – 30%
🇺🇸 NOW: President Trump signed an Executive Order to further modify reciprocal tariff rates. pic.twitter.com/e9rtOcf5Kq
— Cointelegraph (@Cointelegraph) July 31, 2025
Also Read: Microsoft On AI: ఏఐ దెబ్బకు ఈ 40 రకాల ఉద్యోగాలు ఫసక్.. ఇందులో మీ జాబ్ ఉందా?
కెనడాపై భారం – మెక్సికోకు ఉపశమనం
ట్రంప్ తన తాజా ఉత్తర్వులో పన్నుల నుంచి మెక్సికోకు ఉపశమనం కలిగించారు. అదే సమయంలో కెనడాపై సుంకాలను భారీగా పెంచారు. దీనిపై శ్వేతసౌధం అధికారి స్పందిస్తూ.. ‘మెక్సికో తర్వాత అమెరికాకు రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కెనడా. అయితే కెనడా ప్రతినిధులు మెక్సికో చూపిన స్థాయిలో నిర్మాణాత్మక వైఖరిని చూపలేదు’ అని ఆ అధికారి చెప్పారు. మరోవైపు మెక్సికో అమెరికాకు ఎగుమతి చేసే ఆటోమెుబైల్ తదితర ఉత్పత్తులపై 30 శాతం సుంకం నుంచి మినహాయింపు పొందింది. ఈ నిర్ణయం గురువారం ఉదయం ట్రంప్, మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్‌బామ్ మధ్య జరిగిన ఫోన్ కాల్ తర్వాత జరగడం గమనార్హం.