Andaman: ఆర్థిక మోసాలు ఎక్కడ జరిగినా ఈడీ (Enforcement Directorate) వదిలిపెట్టదు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడికైనా వెళ్లి సోదాలు నిర్వహిస్తుంది. అయితే, దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈడీ.. చరిత్రలో తొలిసారి అండమాన్-నికోబార్ ద్వీపాలలో అడుగుటుపెట్టింది. బుధవారం అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ అధికారులు తొలిసారి అండమాన్-నికోబార్ ద్వీపాలలో సోదాలు నిర్వహించారు. రూ.200 కోట్ల లోన్ మోసానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ భారీ స్కామ్‌లో అండమాన్ నికోబార్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (ANSCB) ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
కేసు దర్యాప్తులో భాగంగా పోర్ట్ బ్లేయర్‌లోని 9 ప్రదేశాల్లో, కోల్‌కతాలోని 2 ప్రాంగణాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. రుణ మంజూరులో జరిగిన భారీ ఆర్థిక అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈ దర్యాప్తు జరుగుతోంది. సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల ప్రకారం, ఏఎన్ఎస్‌సీబీ బ్యాంకు రూల్స్‌ను ఉల్లంఘించి షెల్ కంపెనీలకు లోన్లు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాలు కల్పించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 15 నకిలీ షెల్ కంపెనీలను స్థాపించి, ఆర్థిక లావాదేవీలు జరిపారని, ఇవన్నీ అండమాన్ మాజీ ఎంపీ కుల్దీప్ రాయ్ శర్మ ప్రయోజనాల కోసం సాగించారని ఈడీ ఆరోపిస్తోంది.
Read Also- Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ!
నకిలీ షెల్ కంపెనీలు మోసపూరిత విధానాల్లో రూ.200 కోట్లకు పైగా రుణాలు పొందాయని ఈడీ అంచనా వేసింది. ఆ రుణాల్లో భారీ మొత్తం నగదుగా ఉపసంహరించి మాజీ ఎంపీ కుల్దీప్ రాయ్ శర్మకు మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుల్దీప్ శర్మ ఏఎన్ఎస్‌సీబీ (ANSCB) వైస్-చైర్మన్ పదవిని కూడా చేపట్టిన వ్యక్తి కావడంతో స్వలాభం కోసం పదవిని దుర్వినియోగం చేసిన సందేహాలపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి అండమాన్ – నికోబార్ పోలీస్ క్రైమ్ అండ్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిని ఆధారంగా తీసుకుని ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో ప్రైవేట్ వ్యక్తులతో పాటు కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలావుంచితే, ఈడీ సోదాలు అండమాన్ ద్వీపాల్లో జరిగిన తొలి ఈడీ దాడులుగా చరిత్రకెక్కాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని వివరాలు వెలుడయ్యే అవకాశాలు ఉన్నాయి.
Read Also- Dharmasthala: 6వ స్థలంలో మానవ అవశేషాలు గుర్తింపు.. ఆ వ్యక్తివేనా?
కాగా, ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఆర్థిక నేరాలను దర్యాప్తు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈడీ ప్రధానంగా రెండు చట్టాల కింద దర్యాప్తు చేపడుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద నకిలీ కంపెనీలు, అక్రమ డబ్బు తరలింపు, అప్రకటిత ఆదాయం లాంటి మనీ లాండరింగ్ కేసులపై దర్యాప్తు చేపడుతుంది. ఇక, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA), 1999 కింద విదేశీ మారక విధానాలకు విరుద్ధంగా జరిగిన నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటుంది. అక్రమ డబ్బుని అరికట్టడం, నకిలీ సంస్థలు, షెల్ కంపెనీల ద్వారా జరిగిన లావాదేవీలను వెలుగులోకి తేవడం, దేశంలో పెద్ద పెద్ద ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేపట్టడం, నేరాలతో సంబంధం ఉన్న ఆస్తులను జప్తు చేయడం ప్రధాన విధులుగా ఉన్నాయి. ఈడీకి అరెస్టు, ఆస్తులు సీజ్ చేసే అధికారం ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఈడీ పనిచేస్తుంది.