Rahul Gandhi: భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధింపు ప్రకటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నిష్క్రియాత్మకమైన ఇండియా, రష్యా ఆర్థిక వ్యవస్థలను (Dead Economy) తాను లెక్కచేయబోనంటూ వ్యాఖ్యానించారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమర్థించారు. భారత ఆర్థిక వ్యవస్థ మరణావస్థలో ఉన్న ఎకానమీగా అభివర్ణించడాన్ని అభినందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి తప్ప, ఈ వాస్తవాన్ని అందరూ గుర్తిస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
‘‘ప్రపంచం మొత్తం గుర్తించిన ఒక సత్యాన్ని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చచ్చిపోయింది. బీజేపీ పాలనే ఇందుకు కారణం. గౌతమ్ అదానీకి లాభదాయకంగా మార్చేందుకు ఆర్థిక వ్యవస్థను మోదీ సర్వనాశనం చేశారు’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ నిష్క్రియాత్మకం. చంపిన వ్యక్తి మోదీ’’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అదానీ–మోదీ పార్ట్‌నర్‌షిప్, నోట్ల రద్దు, లోపభూయిష్టమైన జీఎస్టీ విధానం, మేకిన్ ఇండియా యోజనలో వైఫల్యం, ఎంఎస్‌ఎంఈలు (చిన్న మధ్యతరహా పరిశ్రమలు) పూర్తిగా నశించిపోవడం, రైతులను అణిచివేయడం ఇందుకు కారణాలు అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశ యువత భవిష్యత్తు నాశనమైందని, ఎందుకంటే దేశంలో అసలు ఉద్యోగాలే లేవని రాహుల్ గాంధీ విమర్శించారు.
Read Also- Dharmasthala: 6వ స్థలంలో మానవ అవశేషాలు గుర్తింపు.. ఆ వ్యక్తివేనా?
అసలు ట్రంప్ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించిన సందర్భంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై విమర్శలు గుప్పించారు. భారత్-రష్యా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ రష్యాతో కలిసి భారత్ ఏం చేసినా నేను లెక్కచేయను. ఈ రెండు ‘డెడ్ ఎకానమీలు’ (నిష్ర్కియాత్మక ఆర్థిక వ్యవస్థలు) కలిసిపోవాలంటే ఒక్కటవ్వొచ్చు. నాకు సంబంధం లేదు” అని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టారు. భారత్ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ టారీఫ్‌లు విధించడంతో సరిగ్గా వాణిజ్యం నిర్వహించలేకపోయామని అని ట్రంప్ విమర్శించారు. ఇక రష్యా గురించి స్పందిస్తూ.. ‘‘రష్యా-అమెరికా మధ్య వాణిజ్యం దాదాపుగా లేదు. అలాగే ఉండటం మంచిది. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదెవ్ ఇప్పటికీ తాను అధ్యక్షుడినని అనుకుంటున్నాడు. ఆయన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదకరమైన మార్గంలోకి అడుగుపెడుతున్నాడు!” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను మాత్రమే కాక, భారత ఆర్థిక పరిస్థితిపై కూడా ఆంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసేలా కనిపిస్తున్నాయి.
Read Also – Oval Test: భారత్-ఇంగ్లండ్ మధ్య మొదలైన 5వ టెస్ట్.. టీమ్‌లో 3 మార్పులు
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అంశాల్లో కాంగ్రెస్ ధోరణికి విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ శశి థరూర్… ట్రంప్ వ్యాఖ్యల విషయంలో మాత్రం రాహుల్ గాంధీకి విరుద్ధ వైఖరిని వినిపించారు. ట్రంప్ చేసిన ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యపై థరూర్ కొంత మితంగా స్పందించారు. ‘‘అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చలు సవాలుతో కూడుకున్నవి. అయితే, మనకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. యూకేతో ఇప్పటికే ఒప్పందం పూర్తయింది. ఇతర దేశాలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. అమెరికాతో పోటీ పడలేకపోతే, వేరే మార్కెట్లలో అవకాశాలను మనం అన్వేషించాలి. మనకేం ఆప్షన్లు లేకుండా పోలేదు కదా’’ అని అన్నారు. థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య వ్యూహాలకు కొంత మద్దతులా కనిపిస్తున్నాయి.
THE INDIAN ECONOMY IS DEAD.
Modi killed it.
1. Adani-Modi partnership
2. Demonetisation and a flawed GST
3. Failed “Assemble in India”
4. MSMEs wiped out
5. Farmers crushedModi has destroyed the future of India’s youth because there are no jobs.
— Rahul Gandhi (@RahulGandhi) July 31, 2025