Gujarat Crime: సాధారణంగా 70 ఏళ్ల వయసులో ఎవరైనా కృష్ణా, రామ అనుకుంటూ జీవిస్తుంటారు. కానీ గుజరాత్ కు చెందిన ఓ బామ్మ మాత్రం.. ఓ నేరం కింద అరెస్టై ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. 16 ఏళ్ల క్రితం జరిగిన దారి దోపిడి, హత్య కేసులో తాజాగా జంనా అర్జున్ చునారా (Jamna Arjun Chunara) అనే వృద్ధురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూతురు ఇంట్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్ గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
గుజరాత్ అహ్మదాబాద్ లోని ఘట్లొడియాలో 2009లో ఓ హత్య జరిగింది. మార్చి 18న రాత్రి 9 గంటల సమయంలో అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణమైన దంపతులపై.. కమోడ్ – ఇంద్రానగర్ మధ్య ఓ గుర్తు తెలియని గ్యాంగ్ దాడి చేసింది. దంపతులను విచక్షణా రహితంగా కొట్టి.. వారి నుంచి ఆభరణాలు, మెుబైల్ ఫోన్లు, ఇతర సామాగ్రిని దోచుకెళ్లింది.
గ్యాంగ్‌లో ఏడుగురు అరెస్ట్..
రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న దంపతులను చూసి స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త చనిపోవడంతో మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా 2009లోనే జంనా అర్జున్ చునారా సహా ఎనిమిది మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఆ గ్యాంగ్ లోని ఏడుగురిని గతంలోనే అరెస్ట్ చేయగా.. కోర్టు శిక్ష సైతం విధించింది. అయితే జంనా మాత్రం పోలీసుల కళ్లుకప్పి గత 16 ఏళ్లుగా తిరుగుతోంది.
Also Read: Heart Disease Diet: మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఇలా చేయండి.. లేదంటే ఢమాలే!
పోలీసుల కళ్లుగప్పి.. చివరికి
పోలీసుల నుంచి తప్పించుకొని ఒక గ్రామం నుండి మరొక గ్రామం, ఒక నగరం నుండి మరో నగరానికి మారుతూ జంనా.. పోలీసులను బురిడి కొట్టించింది. జంనా భర్త, కుమారుడు సైతం పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి శిక్ష కూడా అనుభవించారు. వారు జైలు నుంచి బయటకు వచ్చినా కూడా జంనా వారిని కలవలేదు. చివరకు మంగళవారం (జులై 29) కూతురిని కలవడానికి అస్లాలీకి వచ్చిన జంనాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.