Heart Disease Diet: ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే హృదయ సంబంధిత సమస్యలు.. ప్రస్తుతం యూత్ లోనూ కనిపిస్తోంది. చిన్నారులు సైతం గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి రోజు రోజుకు బలహీనమవుతున్న గుండెను బలోపేతం చేసుకొని.. హృదయ సమస్యలను నివారించుకునేందుకు నాన్-ఇన్వేసివ్ కార్డియాలజీ (Non-invasive cardiology)లో నిపుణుడైన డాక్టర్ బిమల్ ఛాజేర్ (Dr Bimal Chhajer) కీలక సూచనలు చేశారు. మాంసాహారాన్ని తగ్గించి వాటి స్థానంలో ప్రోటీన్ తో నిండిన ఆహారాన్ని తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇంతకీ గుండె సమస్యల నివారణకు ఆయన సూచించిన ఆహారం ఏంటీ? రోజూ వారి ఆహారంలో చేర్చుకోవాల్సిన పదార్థాలు ఏవి? ఈ కథనంలో పరిశీలిద్దాం.
1. పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినండి
డాక్టర్ బిమల్ ఛాజేర్ మాటల ప్రకారం.. ‘మీ చిన్నతనంలో తల్లిదండ్రులు పండ్లు, కూరగాయలు తినమని చెప్పడం సరైనదే. ఆ అలవాటును పెద్దయ్యాక కూడా కొనసాగించండి. పండ్లు, కూరగాయలతో మీ ప్లేట్ నింపండి. ఇది మీ హృదయానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ప్రతిరోజు ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ ఫలాలు, క్రూసిఫెరస్ కూరగాయలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని అన్నారు.
2. సంపూర్ణ ధాన్యాలు
డాక్టర్ ఛాజేర్ ప్రకారం.. ‘సంపూర్ణ ధాన్యాలు ఇప్పుడు హాట్ టాపిక్. ప్రాసెస్ చేసిన లేదా రిఫైన్‌డ్ ధాన్యాలను మానేయండి. బదులుగా క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి సంపూర్ణ ధాన్యాలను ఎంచుకోండి. ఇవి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండి హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి’ అని అన్నారు.
3. లీన్ ప్రోటీన్లు
‘శరీరానికి శక్తినిచ్చేది ప్రోటీన్ కాబట్టి వాటిని సమృద్ధిగా తీసుకోవాలి. పప్పులు, టోఫు వంటి లీన్ ప్రోటీన్ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానడం మంచిది. ఇలా చేయడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం కూడా తగ్గుతుంది’ అని ఛాజేర్ అన్నారు.
Also Read: Ayurvedic Tips: ఏం తిన్నా అరగట్లేదా? ఈ ఆయుర్వేదం టిప్స్ ఫాలో అయిపోండి!
4. ఉప్పు వినియోగం తగ్గించండి
ఆహారంలో ఉప్పును అధికంగా తీసుకునేవారికి హృదయ సంబంధిత సమస్యలు అధికమవుతున్నట్లు డాక్టర్ ఛాజేర్ అన్నారు. ‘తరుచూ దాహం వేయడం, గుండె వేగంగా కొట్టుకోవడం.. అధిక సోడియం ఆహారం వల్ల కావచ్చు. కాబట్టి ప్రాసెస్ చేసిన స్నాక్స్, టిన్ను సూప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తగ్గించాలి. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ హృదయానికి హానికరమైనవి మాత్రమే కాకుండా వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉండవు. ఒకవేళ ఉప్పు తగ్గించడం కష్టంగా అనిపిస్తే, వంటలో సుగంధ ద్రవ్యాలు, మసాలాలు ఎక్కువగా ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల భోజనం రుచికరంగా మారుతుంది. అదేవిధంగా ఉప్పుపై ఆధారపడటం కూడా తగ్గుతుంది’ అని కార్డియాలజిస్ట్ తెలిపారు.
Also Read This: German Content Creater: జర్మనీ నుంచి వచ్చి కుప్పిగంతులు.. తీసుకెళ్లి బొక్కలో వేసిన పోలీసులు!
గమనిక: ఈ సమాచారం మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.