Tsunami Alert: రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో 8.7 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ పరిణామాలను అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)లోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాలోని పలు ప్రాంతాలకు సైతం సునామీ హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో అక్కడ నివసించే ప్రజలకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. అమెరికాలోని తీర ప్రాంత రాష్ట్రాల్లో జీవించే భారతీయులు.. స్థానిక అధికారులు ఇచ్చే మార్గదర్శకాలను పాటించాలని కోరింది.
దేనికైనా సిద్ధంగా ఉండండి!
అత్యవసర నిర్వహణ సంస్థలు, అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రాలు ఇచ్చే సందేశాలను అనుసరించాలని దేశ పౌరులను భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. ‘యూఎస్ అధికారులు చేస్తున్న హెచ్చరికలను పాటించండి. సునామీ హెచ్చరిక జారీ చేయబడితే వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లండి. తీర ప్రాంతాలకు వెళ్లడాన్ని నియంత్రించుకోండి. అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంటూ మెుబైల్ వంటి పరికరాలను ఛార్జ్ చేసి ఉంచుకోండి’ అంటూ శానిఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం సూచించింది.
హెల్ప్ లైన్ నెంబర్
సహాయం అవసరమైన భారతీయ పౌరుల కోసం శానిఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం.. ఓ హెల్ప్ లైన్ ను నెంబర్ ను సైతం విడుదల చేసింది. అత్యవసరముంటే +1-415-483-6629 కు కాల్ చేయాలని సూచించింది. ఇదిలా ఉంటే రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.7 తీవ్రతతో వచ్చిన ప్రకంపనల ధాటికి రష్యా తీరంలో సునామీ ఏర్పడింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల వెంబడి రాకాసి అలలు సంభవించని హెచ్చరించింది.
Also Read: Tsunami Hits Russia: భారీ భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ.. పరిస్థితులు అల్లకల్లోలం!
పరుగులు పెట్టిన జనం
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం విషయానికి వస్తే భూకంప కేంద్రం 19.3 కిలోమీటర్ల (12 మైళ్లు) లోతులో కేంద్రీకృతమైనట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు 125 కి.మీ (80 మైళ్ళు) దూరంలో అవాచా బే తీరం వెంబడి భూకంప కేంద్రం ఉన్నట్లు స్పష్టం చేసింది. తొలుత ప్రకంపనల తీవ్రతను 8.0 గా యూఎస్‌జీఎస్ భావించింది. అయితే ఆ తర్వాత దానిని 8.7 గా నిర్ధారించింది. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్‌ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది.