UPI Payments: యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులకు (UPI Payments) సంబంధించి 2025 ఆగస్టు 1 నుంచి కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. బ్యాలెన్స్ చెకింగ్, ట్రాన్సాక్షన్స్ స్టేటస్‌తో పాటు మరికొన్ని మార్పులు ఉండనున్నాయని తెలిపింది. యుపీఐ వ్యవస్థను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా తీర్చదిద్దడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు రెండు నెలల కిందట అంటే, 2025 ఏప్రిల్ 26న ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.
యుపీఐ లావాదేవీల రెస్పాన్స్ టైమ్‌ను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీసీఐ తెలిపింది. అంటే, ఫెర్మార్మెన్స్ మరింత మెరుగుపరచేందుకు ఈ మార్పు చేస్తున్నట్టు వివరించింది. ఈ నిర్ణయంతో చెల్లింపు బ్యాంకులు (Remitter Banks), పొందిన బ్యాంకులతో పాటు (Beneficiary Banks), ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు (PSPs) లాభదాయకంగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు 2025 మే 21న ఎన్‌పీసీఐ కీలక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రభుత్వరంగ బ్యాంకులు లేదా విలీనమైన బ్యాంకులు యుపీఐకి సంబంధించిన అన్ని ఏపీఐ అభ్యర్థనలను పర్యవేక్షించాలి. వేగం, టీపీఎస్ (సెకన్‌కు లావాదేవీల పరిమితి పరంగా) గణాంకాలను నమోదు చేయాలి.
ఆగస్టు 1 నుంచి యూపీఐ మార్పులివే
1. డైలీ బ్యాలెన్స్ చెక్ పరిమితి
ఒక్క యుపీఐ యాప్ ద్వారా రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి వేర్వేరు యాప్స్ ఉపయోగిస్తే, ప్రతి యాప్‌కూ ఈ పరిమితి 50 సార్లుగా ఉంటుంది.
2. స్టేటస్ చెక్‌పై పరిమితి
ఫెయిలైన లావాదేవీలకి సంబంధించిన స్టేటస్‌కు రోజుకు 3 సార్లకు మించి చెక్ చేయడానికి వీలుండదు. ప్రతి చెక్‌కు మధ్య కనీసం 90 సెకన్ల గ్యాప్ కూడా కచ్చితంగా ఉండాలి.
3. ఆటోపే లావాదేవీలకు టైమ్ పరిమితులు
ఆటోపేమెంట్ లావాదేవీలు కొన్ని ప్రత్యేక సమయాల్లోనే ప్రాసెస్ అవుతాయి. ఈ మేరకు పరిమితులు విధిస్తూ ఎన్‌పీసీఐ నిర్ణయించింది. ఉదయం 10 గంటలలోపు, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 గంటల సమయాల్లో మాత్రమే ఆటోపేమెంట్లు అవుతాయి.
4. లింక్డ్ బ్యాంక్ అకౌంట్లపై చెక్ పరిమితి
యూజర్లు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలను రోజుకు గరిష్టంగా 25 సార్లు మాత్రమే చూడొచ్చు. అంతకుమించి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.
Read Also- Lok Sabha: ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో విదేశాంగమంత్రి జైశంకర్ కీలక ప్రకటన
5. పేమెంట్ రివర్సల్ క్యాప్
ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన డబ్బు యూజర్ అకౌంట్‌లో పడకపోతే, 30 రోజుల వ్యవధిలో గరిష్ఠంగా 10 పేమెంట్ రివర్సల్ రిక్వెస్ట్‌లు చేసేందుకు అవకాశం ఉంటుంది. పంపిన వ్యక్తికి (Sender) 5 రిక్వెస్ట్‌లకు మాత్రమే పరిమితి ఉంటుంది.
6. లబ్దిదారుడి పేరు డిస్‌ప్లే
ట్రాన్సాక్షన్ చేయడానికి ముందే, డబ్బు రిసీవ్ చేసుకోబోయే వ్యక్తి బ్యాంకులో రిజిస్టర్డ్ అయిన పేరు కనిపిస్తుంది. అంటే, డిస్‌ప్లే అవుతుంది. ఈ నిర్ణయంతో పొరపాట్లు, మోసాలు తగ్గించే అవకాశం ఉంటుంది.
7. బ్యాంకులు, యుపీఐ యాప్‌లకు కఠిన రూల్స్
ఏపీఐ (Application Programming Interface) వినియోగంపై ఎన్‌పీసీఐ పకడ్బందీ పర్యవేక్షణ చేయబోతోంది. యాప్‌ల మధ్య సమాచారానికి అవసరమైన కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఈ నిబంధనలను పాటించని బ్యాంకులు లేదా యాప్‌లపై జరిమానా లేదా పరిమితులు విధించే అవకాశాలు ఉన్నాయి. భాగస్వాములంతూ ఈ మార్పులు 2025 జులై 31 లోపు అమలు చేయాలి. ఈ మేరకు సంబంధిత భాగస్వాములకు సమాచారం అందించాలని స్పష్టం చేసింది.
Read Also- US News: అమెరికాలో భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. ఏం చేశాడో తెలుసా?