Tourist Guide: ఖాళీ సమయం దొరికిందంటే చాలు.. కొందరు తుర్రున ఇష్టమైన ప్రదేశాలకు ఎగిరిపోతుంటారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. తమ ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి మోసాలకు గురవుతుంటారు. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసే వారు.. ముందుగా అక్కడ జరిగే మోసాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. లేదంటే ఊరు కాని ఊరులో జేబులు ఖాళీ చేసుకొని.. దిక్కుతోచని పరిస్థితులకు జారుకునే ప్రమాదం తలెత్తవచ్చు. విహారయాత్రలో తరుచూ జరుగుతుండే మోసాలను ఈ కథనంలో పరిశీలిద్దాం. ఆ సమస్యలకు చెక్ పెట్టే పరిష్కారాలపైనా ఓ లుక్కేద్దాం.
టాక్సీ మీటర్ ట్రిక్స్
టాక్సీ డ్రైవర్లు మీటర్ పాడైందని చెప్పి అధిక ఛార్జీ వసూలు చేయడం.. లేదా కొంచెం దూరానికి సైతం ఊరంతా తిప్పి అధిక ధరను వసూలు చేయడం చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఎల్లప్పుడు మీటర్ ఉపయోగించమని పట్టుబట్టండి. లేదంటే రైడ్-హైలింగ్ యాప్‌లను (ఉబెర్, ఓలా వంటివి) ఉపయోగించండి. విమానాశ్రయాలు లేదా టాక్సీ స్టాండ్‌లలో ప్రీపెయిడ్ టాక్సీ సేవలను ఎంచుకోండి. గూగుల్ మ్యాప్స్ లేదా ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఉపయోగించి రూట్‌ను ట్రాక్ చేయండి.
నకిలీ గైడ్‌లు
అధికారిక గైడ్‌లుగా నటించే వ్యక్తులు.. పర్యాటకులను దుకాణాలకు తీసుకెళ్లి వారి నుంచి అసలు దాని కంటే అదనంగా దోచేసే అవకాశముంది. హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాటిల్లో ముందుగానే కొంత కమిషన్ మాట్లాడుకొని.. పర్యాటకుల చేత అధికమెుత్తంలో చెల్లించేలా చేయవచ్చు. కాబట్టి హోటల్ ద్వారా లేదా ప్రసిద్ధ వెబ్‌సైట్‌ల ద్వారా గైడ్‌లను బుక్ చేయండి. అనధికార గైడ్‌లను నమ్మవద్దు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల వద్ద చాలా అప్రమత్తత అవసరం.
ఓవర్‌ప్రైస్డ్ సావనీర్స్
నకిలీ, తక్కువ నాణ్యత కలిగిన రత్నాలు లేదా స్మారక వస్తువులను కొనుగోలు చేయమని.. పర్యాటకులను పలువురు ఒత్తిడి చేయవచ్చు. ఆ మోసాల నుంచి బయటపడేందుకు.. తీసుకోవాలని భావిస్తున్న వస్తువు సాధారణ ధరపై ఒక అంచనాకు రండి. లేదంటే ప్రసిద్ధ దుకాణాలను ఎంచుకోండి. ఎవరు ఒత్తిళ్లలకు తలొగ్గవద్దు. కొనుగోలు చేసే ముందు వస్తువుల నాణ్యతను తనిఖీ చేయండి.
ఫేక్ పోలీస్/అధికారుల మోసం
పర్యాటక ప్రాంతాల్లో అధికారుల పేరుతో కొందరు తరుచూ మోసాలకు పాల్పడుతుంటారు. మీ వల్ల తప్పు జరిగిపోయిందని.. శిక్ష వేయకుండా ఉండాలంటే లంచం లేదా జరిమానా డిమాండ్ చేస్తుంటారు. అలాంటప్పుడు శాంతంగా ఉండి.. అధికారినని చెప్పుకుంటున్న వారి గుర్తింపు కార్డును అడగండి. జరిమానా చెల్లించమని పట్టుబడితే పోలీసు స్టేషన్ కు వెళ్దామని పట్టుబట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పాట్ లో డబ్బు ఇవ్వవద్దు.
ఫేక్ బుకింగ్ సైట్స్
పర్యాటకులు తరుచూ మోసాలకు గురవుతున్న వాటిలో ఫేక్ బుకింగ్ సైట్స్ ఒకటి. ఆయా సైట్స్ తక్కువ ధరలతో దాచిన ఫీజులను తిరిగి జోడిస్తాయి. అంతేకాదు వ్యక్తిగత సమాచారాన్ని సైతం థర్డ్ పార్టీకి చేరవేసి సొమ్ము చేసుకుంటాయి. ఈ మోసాల నుంచి బయటపడేందుకు URLలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. సైట్ పనితీరుకు సంబంధించి రివ్యూలు చదవండి.
కరెన్సీ ఎక్స్ఛేంజ్ స్కామ్
కొందరు అత్యవసరంగా డబ్బును మార్చుకునేందుకు వీధి వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. ఇది మోసాలకు దారితీయవచ్చు. కాబట్టి అధికారిక కరెన్సీ మార్పిడి కౌంటర్ల వద్ద మాత్రమే డబ్బును మార్చుకోండి. మార్పిడి సమయంలో డబ్బును మీ ముందే లెక్కించమని చెప్పండి. స్థానిక కరెన్సీకి మన దేశీయ కరెన్సీకి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో తప్పకుండా తెలుసుకోండి.
Also Read: WWII: 13 ఏళ్ల వయసులోని కోరిక.. 103 ఏళ్లకు తీరబోతోంది.. తాత మీరు సూపర్!
ఫేక్ ఫోటో స్కామ్
స్థానికులు మీ గ్రూప్ ఫోటో తీయడానికి ఆఫర్ చేయవచ్చు. అలా చెప్పడం ద్వారా మీ కెమెరాను దొంగిలిస్తారు లేదా ఫోటో కోసం అధిక ఫీజు డిమాండ్ చేస్తారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు తోటి పర్యాటకుల సాయం తీసుకోండి. ఒకవేళ ఫొటో దిగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. తోటి ప్రయాణికుడ్ని తీయమని చెప్పండి. బదులుగా మీరు కూడా వారిని గ్రూప్ ను ఫొటో తీయండి.