NALSA: ఎండనక, వాననక దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అవసరమైతే ప్రాణాలు సైతం ధారపోస్తున్న జవాన్లకు దేశం ఎంతగానో రుణపడి ఉంది. దేశభక్తితో సేవలు అందిస్తున్న జవాన్లకు మాటల్లో కాకుండా చేతల్లో సాయం చేయాలని సంకల్పించిన దేశ న్యాయవ్యవస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైనికులు, వారి కుటుంబాలకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు ‘వీర పరివార్ సహాయ యోజన’ పథకం కింద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీని (NALSA) శనివారం ఆవిష్కరించింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ స్కీమ్‌ను జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. కాగా, ఎన్‌ఏఎల్ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సూర్యకాంత్ వ్యవహరిస్తున్నారు.
Read Also- Asia Cup: భారత్-పాక్ మధ్య 3 మ్యాచ్‌లు!.. ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఈ పథకంలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న సైనిక్ వెల్ఫేర్ బోర్డులలో లీగల్ సర్వీస్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడిషనల్ చీఫ్, సెక్రటరీ కుల్దీప్ శర్మా వెల్లడించారు. ఈ క్లినిక్‌ల ద్వారా రిటైర్డ్, ప్రస్తుతం సర్వీసుల్లో ఉన్న జవాన్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయసహాయం అందించనున్నారు. లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లు కూడా అందుబాటులో ఉంటారని అధికారులు వివరించారు.
Read Also- Nitish Reddy: చిక్కుల్లో క్రికెటర్ నితీష్ రెడ్డి.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
దేశ చరిత్రలో తొలిసారి
జవాన్లు, వారి కుటుంబాలకు ప్రత్యేకంగా ఉచిత న్యాయసహాయం కల్పించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దేశ సేవలో భాగంగా కఠినమైన ప్రదేశాల్లో సైతం విధులు నిర్వహిస్తున్న సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు న్యాయపరమైన బాధ్యతల ఉపశమనం కల్పించడమే ఈ నిర్ణయం వెనుకు ముఖ్యోద్దేశంగా ఉంది. ‘మీరు సరిహద్దుల్లో దేశాన్ని రక్షిస్తున్నారు. మేము మీ కుటుంబాలను మేము జాగ్రత్తగా చూసుకుంటాం’ అనే సందేశాన్ని ఈ పథకం ద్వారా అందించినట్టు అయింది. సైనికులు తమ ఇంటికి సుదూరంలో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, భూమి వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు వంటి కేసుల్లో న్యాయపరంగా సరైన సాయం పొందలేక అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా కోర్టుల్లో సైనికులకు ఎన్ఏఎల్ఎస్ఏ న్యాయసాయం అందిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత సైనికుల త్యాగాలు జస్టిస్ సూర్యకాంత్‌ను ఎంతగానో ప్రేరేపించాయని, అందుకే వారి సంక్షేమానికి న్యాయవ్యవస్థ తరపున ఏం చేయగలమో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నవంబర్ 24న భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఈ పథకాన్ని జస్టిస్ సూర్యకాంత్ అమల్లోకి తీసుకురానున్నారు.
Read also- Viral News: అంబులెన్స్‌లో యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎంతమందంటే?