Rahul Gandhi:
తప్పిదం నాదే
పార్టీ పొరపాటేమీ లేదు
ఓబీసీల ప్రయోజనాల కోసం తగిన కృషి చేయలేదు
21 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే పెద్ద తప్పు
చేసిన తప్పు సరిదిద్దుకుంటున్నా
కులగణనపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కులగణన రాజకీయ భూకంపమంటూ ప్రశంసలు
న్యూఢిల్లీ, స్వేచ్ఛ: కులగణనపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే కుల గణన చేపట్టకపోవడం వెనుక పార్టీ తప్పేమీ కాదని, అది తాను చేసిన పొరపాటు అని అన్నారు. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నానని పేర్కొన్నారు. దేశంలోని ఓబీసీల ప్రయోజనాలను కాపాడేందుకు చేయాల్సినంత కృషి చేయలేకపోయానని, తన 21 ఏళ్ల రాజకీయ జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పిదం ఇదేనని ఆయన అభివర్ణించారు. న్యూఢిల్లీ టాక్లటోరా స్టేడియంలో శుక్రవారం జరిగిన ‘భాగీదారీ న్యాయ్ సమ్మేళన్’లో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో జరిగిన కుల గణన ఒక రాజకీయ భూకంపమని ఆయన అభివర్ణించారు. తెలంగాణ కులగణన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోందని వ్యాఖ్యానించారు.
Read also- Sunjay Kapur: బిజినెస్‌మాన్ మృతి.. అత్తను గదిలో బంధించిన కోడలు!
తాను 2004 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పటికి 21 ఏళ్ల రాజకీయ ప్రయాణం చేశానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘నా రాజకీయ జీవితంలో నేను చేసిన మంచి-చెడులపై నాకు నేను ఆత్మపరిశీలన చేసుకుంటే, ప్రధానంగా నాకు రెండు మూడు పెద్ద విషయాలు కనిపిస్తున్నాయి. భూసేకరణ బిల్లు, నరేగా (ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏ), ఫుడ్ బిల్లు, ఆదివాసీల కోసం పోరాటం వీటి విషయంలో బాగా పనిచేశాను. కానీ, ఓబీసీల విషయంలో మాత్రం తగినంతగా చేయలేకపోయాను. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల విషయంలో నాకు మంచి మార్కులు పడతాయి. మహిళల సమస్యలపై పోరాటంలో నాకు కచ్చితంగా మంచి మార్కులే వస్తాయి. కానీ, ఒక్క ఓబీసీల గళాన్ని తగినంతగా వినిపించలేకపోయాను. ఇది నా తప్పే’’ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఓబీసీ సమస్యలు పైకి కనిపించవు
‘‘నా రాజకీయ జీవితాన్ని వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఒక విషయం నాకు స్పష్టంగా కనిపించింది. నేనొక తప్పు చేశాను. అది, ఓబీసీల ప్రయోజనాలను తగినంతగా కాపాడలేకపోయాను. దళితుల సమస్యలు నాకు అర్థమయ్యాయి. అవి బహిరంగంగా కనిపిస్తున్నాయి. ఆదివాసీల సమస్యలు కూడా బహిరంగంగానే ఉంటాయి. కానీ, ఓబీసీల సమస్యలు మాత్రం పైకి కనిపించవు. ఓబీసీల చరిత్రను ఉద్దేశపూర్వకంగా చెరిపేశారు. మీ చరిత్ర, మీ సమస్యల గురించి నాకు ఎక్కువ తెలిసి ఉంటే, కుల గణన జరిపేవాడిని. అందుకే, అది కాంగ్రెస్ పార్టీ పొరపాటు కాదు, అది నా తప్పే. ఆ తప్పును నేను సరిదిద్దుకోబోతున్నాను’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒక కోణంలో చూస్తే, గతంలోనే కుల గణన జరగకపోవడం ఒక విధంగా మంచిదే అనిపిస్తోందని అన్నారు. ఎందుకంటే, ప్రస్తుతం తెలంగాణ తరహాలో జరుగుతున్న కుల గణన మరింత పటిష్టంగా, సమగ్రంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో జరిగిన కుల గణన రాజకీయ భూకంపం లాంటిదని, దేశ రాజకీయాన్ని రక్తికట్టిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ప్రకంపనలను అనుభవపూర్వకంగా గమనించలేకపోయినప్పటికీ, దాని ప్రభావం త్వరలో తెలుస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కుల గణన నిర్వహిస్తామని, జనాభాకు ఎక్స్‌రే మాదిరిగా ఉండేలా చేయబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
Read Also- Rupee Fall: ఆగని రూపాయి పతనం.. శుక్రవారం ఏకంగా..