PM Modi Record: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సాధించారు. జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) తర్వాత నిరంతరాయంగా (విరామం లేకుండా) దేశాన్ని పరిపాలించిన రెండో ప్రధానిగా నిలిచారు. ఇప్పటివరకూ ఈ జాబితాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) పేరు ఉండగా.. శుక్రవారం (25 జులై, 2025) ఆమెను వెనక్కి నెట్టి మోదీ రెండో స్థానంలోకి దూసుకొచ్చారు. దీంతో బీజేపీ వర్గాలు సంబురాలు చేసుకుంటున్నాయి.
ఎలా సాధ్యమైందంటే?
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా నరేంద్ర మోదీ (Narendra Modi) అవతరించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని అయిన మోదీ.. శుక్రవారంతో 4,078 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. దివంగత ఇందిరాగాంధీ జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు 4,077 రోజులు నిరంతరాయంగా ఆ పదవిలో ఉన్నారు. దానిని నేటితో అధిగమించి మోదీ.. ఇందిరా గాంధీ స్థానంలోకి దూసుకొచ్చారు. కాగా మూడు పర్యాయాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి.. జవహర్ లాల్ నెహ్రూ.. నిరంతరాయంగా దేశాన్ని పాలించిన వారిలో టాప్ లో ఉన్నారు.
ఆ రికార్డులు సైతం
నరేంద్ర మోదీ.. 2001 నుంచి ఇప్పటివరకూ తొలుత సీఎంగా, ప్రస్తుతం ప్రధానిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే వస్తున్నారు. 2001లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM) అయిన మోదీ.. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకూ ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అంతేకాదు స్వాతంత్రం తర్వాత జన్మించిన తొలి ప్రధానిగానూ మోదీ తన పేరిట రికార్డును లిఖించుకున్నారు. గుజరాత్ లో పుట్టి.. కేంద్ర ప్రభుత్వ అధిపతిగా రెండు పర్యాయాలు పదవికాలాలను పూర్తి చేసుకున్న ఏకైక కాంగ్రెసేతర నాయకుడిగానూ మోదీ అరుదైన ఘనతను సాధించారు.
Also Read: Rahul Gandhi: తెలంగాణ దేశానికే మైలు రాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలు
ఈ ఘనత మోదీదే!
భారత దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులుగా చేసినవారందరిలో వరుసగా 6 ఎన్నికల్లో ఒకే పార్టీకి చెందిన నాయకుడిగా గెలిచిన ఏకైక వ్యక్తి కూడా ప్రధాని మోదీనే. 2002, 2007, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2014, 2019, 2024 కేంద్ర సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన విషయాన్ని ఓ అధికారి గుర్తు చేశారు.