Sapta Sindhu 2025: ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సప్తసింధు-2025 పేరిట హైదరాబాద్ టి-హబ్‌లో బుధవారం కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ‘ఆలయ నమూనాల రూపకల్పన పోటీలు- ప్రదర్శన’ (Inter college Temple model making competition) కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న బృహత్ ద్విసహస్రావధాని పద్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ ప్రసంగిస్తూ మన భారతీయ దేవాలయాలు, వాటిలోని శిల్పసంపద ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోందని పేర్కొన్నారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయం, జీవితానికి ఆటపట్టు దేవాలయమేనని, ఆధ్యాత్మికత్వం లేకుండా భారతీయ విద్యలేవీ లేవని స్పష్టంచేశారు. ఇంత విశేషమైన, విలక్షణమైన కార్యక్రమంలో యువతకు భాగస్వామ్యం కల్పించడం గొప్ప పనని కొనియాడారు.
సప్తసింధు ఆలయ నమూనాల రూపకల్పన పోటీలలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ (YTDA) సలహాదారు డాక్టర్ ఎస్ సుందరరాజన్, మంథా అసోసియేట్స్ ఎండీ రమేశ్ మంథా, సమతామూర్తి (ముచ్చింతల్) రామానుజుల విగ్రహ ప్రధాన స్థపతి డీఎన్వీ ప్రసాద్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. క్రింద తెలిపిన నమూనాలు మొదటి 3 బహుమతులను గెల్చుకున్నాయి.
Read Also- PM Modi: యూకేతో భారత్ కీలక ఒప్పందం.. మోదీ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ విద్యాశంకర ఆలయం నమూనాను రూపొందించిన జోగినపల్లి భాస్కర్ రావు (JBR) ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థి బృందం మొదటి బహుమతిగా రూ.50 వేలు గెల్చుకుంది. గుజరాత్ రాష్ట్రం మొతేరాలోని సూర్యదేవాలయం నమూనాను తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థి బృందం రెండవ బహుమతిగా రూ.30 వేలు గెల్చుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ రామప్ప ఆలయ నమూనాను ప్రదర్శించిన హైదరాబాద్ జేఎన్ఎఫ్ఏయూ (JNFAU) విద్యార్థి బృందం మూడవ బహుమతిగా రూ.20 వేలు గెల్చుకుంది.
బహుమతి ప్రదానం సందర్భంగా స్థపతి డీఎన్‌వి ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీల్లో బహుమతులు పొందినవారు మాత్రమే గాక ఇందులో పాల్గొన్న విద్యార్థులందరూ విజేతలేనంటూ అందరినీ అభినందించారు. కేవలం కొలమానాల మేరకు విజేతలను నిర్ణయించడం జరిగింది తప్ప నిజానికి ఆలయ నమునాల రూపకల్పనలో విద్యార్థులంతా అద్బుతమైన ప్రతిభను కనబరిచారని మెచ్చుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొనడమే విద్యార్థులందరి విజయమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుందరరాజన్ స్థపతి, శ్రీ రమేశ్ మంథాల ప్రత్యేకతలను సభకు తెలిపారు.
సప్తసింధు-2025లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ ఛైర్మన్ వకుళాభరణం మోహన్ రావు తమ ప్రసంగంలో పురాతన భారతీయ ఆలయ వైభవాన్ని, శిల్పకళా సంపదను టీ-హబ్‌కు తీసుకువచ్చారని ప్రశంసించారు. దేవాలయాల ద్వారా నాటి శిల్పులు ప్రదర్శించిన కళా నైపుణ్యాన్ని, భారతీయ కళలు, శాస్త్రాల విశిష్టతను తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఆర్కిటెక్చర్ విద్యార్థులను అభినందించారు. మరోవైపు.. ఆలయాల పునద్ధరణ ఉద్యమకారిణి, విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ మాట్లాడుతూ అద్భుతమైన కట్టడాలతో విలసిల్లుతున్న మన భాగ్యనగర (హైదరాబాద్) చరిత్రను కేవలం 400 సంవత్సరాలకు పరిమితం చెయ్యడం సరి కాదని, ఈ నగరానికి వేల ఏళ్ళ ఘన చరిత్ర ఉన్నదని, అందుకు నిదర్శనంగా ఎన్నో ఆనవాళ్ళు మనకు మిగిలి ఉన్నాయని చెప్పారు. సామాజిక కార్యకర్త, పర్వతారోహకురాలు, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ హైస్కూర్ ప్రిన్సిపాల్ రేఖారావు మాట్లాడుతూ దేశంలో తాను సందర్శించిన పలు ఆలయాల ప్రత్యేకతలను, ప్రత్యేకించి జమ్ము-కశ్మీర్ ప్రాంతంలోని మందిరాల సాంకేతిక విశేషాలు, ప్రత్యేకతలను తెలియజేశారు.
సోషల్ మీడియా కార్యకర్త సురేష్ కొచ్చాటిల్ ప్రసంగిస్తూ దేశంలోని వివిధ ఆలయాల సంప్రదాయాలు, ప్రత్యేకతలను వివరించారు. హైదరా అలీ, టిప్పు సుల్తాన్ హయాంలో జరిగిన ఆలయ విధ్వంసం, నేటి కాలంలో జరుగుతున్న ఆలయ భూముల కబ్జా గురించి అప్రమత్తం చేశారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ అనంతలక్ష్మి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునీతా రెడ్డి, వ్యాపారవేత్త-సామాజిక కార్యకర్త అవ్నికాంత్ పాండే, కాలమిస్ట్-టీవీ ప్యానలిస్ట్ పేకేటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ ఆలయాల వైభవంపై చరిత్రకారుడు, రచయిత సురేంద్రనాథ్ బొప్పరాజు ప్రదర్శించిన స్లయిడ్ షో విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ దేవాలయాల్లోని సాంకేతిక, కళా నైపుణ్యాలను ఆనాటి శిల్పుల ప్రజ్ఞను ఇందులో వివరించారు.
సప్తసింధు కార్యక్రమాన్ని నిర్వహించిన AE Foundation డైరక్టర్ సంగీతా మిశ్రా మాట్లాడుతూ తమ సంస్థ విద్యార్థులు, మహిళలు, భారతీయ వారసత్వ సంపద- సంస్కృతి పరిరక్షణ కోసం పనిచేస్తున్నామన్నారు. ఆర్కిటెక్చర్ అంటే వంతెనలు, విమానాశ్రయాలు, భవనాలు వంటివాటిని నిర్మించడం మాత్రమే కాదని, భారతీయ నిర్మాణ రంగానికి వేల ఏళ్ళ చరిత్ర ఉందన్నారు. ఆ వైభవాన్ని ముందుకు తెచ్చేందుకే విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. విద్యార్థులు రూపొందించిన ఈ ఆలయ నమూనాలను 10 రోజుల పాటు టీ-హబ్‌లో ప్రదర్శిస్తారని ఆమె తెలిపారు. సప్తసింధు-2025 నిర్వహణలో తమకు తోడుగా నిలిచిన బృహత్, నెక్స్ వేవ్, వర్మ ఫౌండేషన్ సంస్థలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
Read Also- NISAR: 30న ఇస్రో భారీ ప్రయోగం.. రూ.10,816 కోట్ల ఖర్చు