NISAR: అమెరికా, భారత్ మధ్య చారిత్రాత్మక సహకారంగా నిలిచిన ‘సింథటిక్ అపర్చర్ రాడార్’ ఉపగ్రహం భూగ్రహ పరిశీలన, భూమిని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానుంది. నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిషన్‌ను నిసార్ (NISAR) అని కూడా పిలుస్తారు. అత్యంత కీలకమైన ఈ ఉపగ్రహాన్ని జులై 30 సాయంత్ర సమయంలో ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. నాసా, ఇస్రో మధ్య సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహం భూమికి సంబంధించిన అతిపెద్ద ఉమ్మడి ఎర్త్ సైన్స్ మిషన్‌గా నిలిచింది.
నిసార్ ప్రత్యేకతల విషయానికి వస్తే, భూమిపై సంభవించే మార్పులను అత్యంత సూక్ష్మంగా, సెంటీమీటర్ స్థాయిలో గుర్తించగలదు. ఈ సామర్థ్యంతో భూకంపాలు, పర్వతపు కొండచరియలు విరిగిపడడాన్ని, అగ్నిపర్వతాల గమనాలు, హిమానీనదుల కదలికలు వంటి ప్రకృతి విపత్తులను నిశితంగా గమనించేందుకు వీలుంటుంది. నగరాల విస్తరణ, వ్యవసాయ అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై మానవ చర్యల ప్రతికూల ప్రభావాలను అత్యంత సూక్ష్మంగా గమనించేందుకు అవకాశం దక్కుతుంది.
భూమి మొత్తం స్కానింగ్
నిసార్ ఉపగ్రహం బరువు 2,392 కేజీలు ఉంటుందని, భూమి మొత్తాన్ని స్కాన్ చేయగలదని ఇస్రో వెల్లడించింది. అన్ని వాతావరణాలు, ప్రతి 12 గంటలకు ఒకసారి రాత్రి-పగలకు సంబంధించిన డేటా అందించనుంది. వివిధ కోణాల్లో ఉపయోగపడేలా వాతావరణ డేటాను అందించనుంది. భూమిపై వృక్షజాతిలో మార్పులు, హిమానీనదాల కదిలికలు వంంటి భూఉపరితల మార్పులను కూడా గమనించగలదు.
అంతేకాదు, సముద్రంలో నౌకలు, మంచు కరుగుదల ప్రభావం, తీర ప్రాంతాల పర్యవేక్షణ, తుఫాన్ల లక్షణాల విశ్లేషణ-అంచనా, నేలలో తేమ గుర్తింపు, ఉపరితల జల వనరుల మ్యాపింగ్, విపత్తులపై స్పందన వంటి ఎన్నో ప్రయోజనాలు ఈ ఉపగ్రహం ద్వారా అందుకోవచ్చని ఇస్రో వివరించింది. డ్యువల్ ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ నిసార్ ఉపగ్రహాన్ని ప్రత్యేకంగా నిలుపుతుందని, ఇది అంతరిక్షంలో తొలిసారిగా అమలు చేస్తున్న అత్యాధునిక విధానమని వివరించింది. నాసా సమకూర్చిన ఎల్-బ్యాండ్ రాడార్ నేలలోకి, వృక్షావరణంలోకి చొచ్చుకుపోయి లోపలి మార్పులను గుర్తించి విశ్లేషించగలదు. ఇక, ఇస్రో అందించిన అందించిన ఎస్-బ్యాండ్ రాడార్ వృక్ష జాతుల ఎదుగుదల, భూప్రదేశ లక్షణాలను (ఎత్తుపల్లాలు) గుర్తించడంలో ప్రత్యేక టెక్నాలజీని కలిగి ఉంది.
Read Also- PM Modi: యూకేతో భారత్ కీలక ఒప్పందం.. మోదీ సంచలన వ్యాఖ్యలు
ఈ రెండు రాడార్లను 12 మీటర్ల మోష్ రిఫ్లెక్టర్ యాంటెన్నాపై శాస్త్రవేత్తలు అమర్చారు. అంటే, ఈ యాంటెన్నా ఒక స్కూల్ బస్సు పరిమాణంతో సమానంగా ఉంటుంది. భూగ్రహంపై ఉన్న భూమి, మంచుతో కప్పి ఉంచిన ఉపరితలం మొత్తాన్ని ప్రతి 12 రోజులకు రెండు సార్లు నిసార్ ఉపగ్రహం స్కాన్ చేయగలదు.
నిసార్ మిషన్ అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారానికి ప్రతీకగా నిలవనుంది. ఈ మిషన్‌కు ఇప్పటివరకు 1.3 బిలియన్ డాలర్లకుపైగా ఖర్చు అయ్యింది. అంటే, భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారుగా రూ.10,816 కోట్లుగా ఉంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో (JPL) నిసార్ సబ్ ప్రాజెక్ట్ మేనేజర్ వ్యవహరిస్తున్న ఎడెల్‌స్టీన్ మాట్లాడుతూ, ఈ మిషన్‌లో నాసా, ఇస్రో మధ్య 50-50 భాగస్వామ్యం ఉందన్నారు. అంతరిక్ష పరిశోధనలో అమెరికా, భారత్‌ల మధ్య ఇదే అతిపెద్ద భాగస్వామ్యమని వివరించారు.
Read Also- Viral News: జర్నలిస్టుల ‘స్క్విడ్ గేమ్’.. వైరల్ వీడియో ఇదిగో!