Swachh Survekshan: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ(GHMC) అందించే అత్యంత ముఖ్యమైన, అత్యవసరమైన సేవల్లో శానిటేషన్ ప్రధానమైనది. దేశవ్యాప్తంగా స్వచ్ఛతను పెంపొందించేందుకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ర్యాంకులను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో 9వ ర్యాంకుతో సరిపెట్టుకున్న జీహెచ్‌ఎంసీ, ఈసారి కాస్త మెరుగైన 6వ ర్యాంకును సాధించడంతో పాటు ఓడీఎఫ్ ప్లస్ అవార్డును కైవసం చేసుకుంది.
టార్గెట్ టాప్ 3
అయితే, జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరుగుతున్న సమయంలోనే అప్రమత్తమై శానిటేషన్ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, ఈసారి ఎలాగైనా మొదటి మూడు స్థానాల్లో ర్యాంకు సాధించేందుకు వ్యూహం రచించినా, దాని ఫలితం కేవలం 6వ ర్యాంకుకే పరిమితమైంది. దీంతో జీహెచ్‌ఎంసీకి మెరుగైన ర్యాంకు దక్కకపోవడానికి ప్రధాన కారణాలేమిటి, లోపాలు ఏమిటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలన్న విషయంపై పోస్టుమార్టం నిర్వహించారు. ప్రధానంగా రెండు రకాలుగా తలెత్తిన లోపాలు జీహెచ్‌ఎంసీకి టాప్ 3లో ర్యాంకు దక్కకపోవడానికి కారణాలుగా గుర్తించారు. వీటిలో ముఖ్యంగా మహానగరంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటో టిప్పర్లు చెత్త సేకరణకు వెళ్లకపోవడం, వెళ్లినా చెత్తను తడి, పొడిగా వేర్వేరు చేసి సేకరించకపోవడం అన్న విషయాలను గుర్తించిన జీహెచ్‌ఎంసీ(GHMC), వచ్చే సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్ 3వ ర్యాంకులో స్థానం దక్కించుకునేందుకు ఈ రెండు సూత్రాలను పూర్తి స్థాయిలో ఫీల్డు లెవల్‌లో అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం
హైదరాబాద్(Hyderabad) నగరంలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 3 వేల డంపర్ బిన్‌లను తొలగించి, సిటీని బిన్ ఫ్రీ సిటీ(Bin Free City) చేయాలన్న ప్రయత్నంలో భాగంగా ఇంటింటికి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు వీలుగా రెండు బుట్టలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించేందుకు వీలుగా సుమారు 3750 స్వచ్ఛ ఆటో(Auto) టిప్పర్లను కూడా సమకూర్చుకున్నారు. అయితే, ప్రస్తుతం దాదాపు రెండు వేల పైచిలుకు స్వచ్ఛ ఆటో టిప్పర్‌లు మాత్రమే ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నాయని, వీటిలో సగానికి పైగా ఆటోలు తడి(Wet),పొడి(dry) చెత్తను వేర్వేరుగా సేకరించలేకపోతున్నట్లు గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గుర్తించిన నగరంలోని మొత్తం 22 లక్షల నివాస సముదాయాలకు తప్పకుండా స్వచ్ఛ ఆటో టిప్పర్లు వెళ్లేందుకు, వెళ్లిన ఆటో టిప్పర్లు ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను తప్పనిసరిగా సేకరించేందుకు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలన్న విషయంపై జీహెచ్‌ఎంసీ(GHMC) దృష్టి సారించినట్లు సమాచారం.
Also Read: Health: ఎందుకైనా మంచిది.. అరుదైన ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి!
బల్క్ గార్బేజీ సేకరణకు చెక్
హైదరాబాద్ మహానగరాన్ని బిన్ ఫ్రీ సిటీ చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నం విఫలమైన తర్వాత కూడా సిటీలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ ఆటో టిప్పర్లు వెళ్లడం లేదన్న విషయాన్ని గుర్తించారు. స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చుకున్న తొలి రోజుల్లో నగరంలోని మొత్తం 22 లక్షల నివాస సముదాయాలను ఒక్కో ఆటో టిప్పర్‌కు గరిష్టంగా 800, కనిష్టంగా 600 చొప్పున కేటాయించారు. ఒక్కో కుటుంబం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుడికి నెలకు రూ.50 చెల్లించాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ, వీరిలో చాలా మంది ఇప్పటికే తాము జీహెచ్‌ఎంసీ(GHMC)కి పన్ను చెల్లిస్తుండగా, మళ్లీ చెత్త కోసం నెలకు రూ.50 ఎందుకు చెల్లించాలని ప్రశ్నించడం, చాలా బహుళ అంతస్తు భవనాల్లో లిఫ్టులు ఉండకపోవడం, గేటెడ్ కమ్యూనిటీల కుటుంబాలు స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులను కనీసం లోనికి కూడా అనుమతించకపోవడం వంటివి జరిగాయి.
కార్మికులు వసూలు చేసుకోవడం వల్లే
ఈ క్రమంలో కార్మికులంతా రాంకీ సంస్థ సేకరించాల్సిన కమర్షియల్ సంస్థ(Commercial company) లైన హోటల్స్, మెస్, ఇతర ఆహార విక్రయ కేంద్రాల నుంచి బల్క్ గార్బేజీని సేకరిస్తున్నారు. బల్క్ గార్బేజీ సేకరణకు సంబంధించి రాంకీ వసూలు చేయాల్సిన ఛార్జీల కన్నా నామమాత్రపు ఛార్జీలకు కార్మికులు వసూలు చేసుకోవడం వల్లే వారు ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం లేదని అధికారులు గుర్తించారు. దీని ఫలితంగా ఒప్పందం ప్రకారం రాంకీ నష్టపోతున్న ఏటా కోట్లాది రూపాయలను జీహెచ్‌ఎంసీ(GHMC) చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో, మున్ముందు టిప్పర్ కార్మికులు బల్క్ గార్బేజీని సేకరించకుండా, కేవలం ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేలా జీహెచ్‌ఎంసీ(GHMC) ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: Case on Myntra: Myntra ఆన్‌లైన్ పోర్టల్‌పై కేసు నమోదు చేసిన ఈడీ