Bonalu Festival: ఆషాడ మాస బోనాల జాతరలో భాగంగా పాతబస్తీలో సందడి వాతావరణం నెలకొన్నదరి. ఎటు చూసినా సాంప్రదాయ అలంకారణలో నెత్తిన బోనంతో మహిళలు, ఎక్కడ విన్నా అమ్మవారిని స్మరించే జానపద గీతాలు, ఆలయాల వద్ద తొట్టెల ఊరేగింపులు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య పాతబస్తీ బోనాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 14 చారిత్రక దేవాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా ముగించారు.
Also Read: Old City Bonalu: నేడు పాతబస్తీలో బోనాలు.. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
పటిష్ట భద్రత నడుమ..
బోనాల ఉత్సవాలు (Bonala Festival) ఘనంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా అన్ని శాఖలు సమష్టిగా పని చేశాయి. పోలీస్ శాఖ (Police Department) కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. హరిబౌలి అక్కన్న మాదన్న, కోవబేలా శ్రీ బంగారు మైసమ్మ, రాంబక్షిబండ శ్రీ బంగారు మైసమ్మ, బేలా చందూలాల్ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోట మైసమ్మ, సుల్తాన్ షాహీ శ్రీ జంగదాంబ, ఉప్పుగూడ శ్రీ మహంకాళి, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత, హరిజన బస్తీ శ్రీ నల్లపోచమ్మ, చాంద్రయణగుట్ట శ్రీ బంగారు మైసమ్మ, కుమ్మర్ వాడీ శ్రీ కనకదుర్గ, పోచమ్మ బస్తీలోని పోచమ్మ సహిత విజయ కనకదుర్గ దేవాలయంలో బోనాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో ఉదయం 4 గంటలకు అమ్మవారికి బలిగంపను సమర్పించిన తర్వాత పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనార్థం లోనికి అనుమతించారు.
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు
అమ్మవారికి ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, (Komatireddy Venkat Reddy) పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కూడా ఉన్నారు. దాదాపు అన్ని దేవాలయాల వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం 9 గంటల నుంచి బారులు తీరారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయం వద్ద బోనాలు, నైవేద్యాలు, ఒడి బియ్యం, అమ్మవారికి గాజులు వంటివి సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.
హర్యానా గవర్నర్ పూజలు
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, (Bandaru Dattatreya) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి దేవాలయాల వద్ద భక్తుల రద్దీ నెలకొన్నది. దీంతో పోలీసులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులను లోనికి అనుమతించారు. ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి కూడా పాతబస్తీ బోనాలను వీక్షించేందుకు భక్తులు రావడంతో సాయంత్రం పోలీసులు మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
సింహ వాహిని అమ్మవారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకాటి శ్రీహరి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, (Kiran Kumar Reddy) అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, శాసన మండలి సభ్యులు కవిత, ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మేయర్ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పోలీస్ అధికారులు, భక్తులు తదితరులు దర్శించుకున్నారు.
అందరినీ చల్లంగా చూడమ్మా..
లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారిని దర్శించిన అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి చార్మినార్ దగ్గర శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ, తాను ప్రతి సంవత్సరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటానని, అమ్మవారు అందరిని చల్లగా చూడాలని వేడుకున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించాలి
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసి, పంటలు బాగా పండి రైతు అభివృద్ధి చెందాలని, అలాగే రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న డ్రగ్స్ ప్రభావం నుంచి విముక్తి కలిగించాలని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని వేడుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
నేడు రంగం , అంబారీపై అమ్మవారి ఊరేగింపు
బోనాలు సమర్పించిన తదుపరి రోజైన సోమవారం నాడు లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి దేవాలయం ఆవరణలో, మీరాలంలోని శ్రీ మహంకాళి దేవాలయం ఆవరణలో రంగం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సింహవాహిని దేవాలయం వద్ద మాతంగి స్వర్ణలత రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించనున్నారు. అనంతరం అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించి, అడుగడుగుల సాకలు సమర్పించనున్నారు. ఈ ఊరేగింపునకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: Heart health: పరగడుపున ఈ ఆకులను తింటే.. గుండె వ్యాధులకు చెక్ పెట్టొచ్చని తెలుసా?