Old City Bonalu: ఆషాడ మాసపు బోనాల జాతరలో భాగంగా నేడు పాతబస్తీలో బోనాలు జరగనున్నాయి. అమ్మవారిని స్మరిస్తూ కొనసాగే ఈ బోనాల ఉత్సవాలు ఘనంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా అన్ని శాఖలు సమష్టిగా ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. హరిబౌలి అక్కన్న మాదన్న, కోవబేలా శ్రీ బంగారు మైసమ్మ, రాంబక్షిబండ శ్రీ బంగారు మైసమ్మ, బేలా చందూలాల్ శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, కోటమైసమ్మ, సుల్తాన్ షాహీ శ్రీ జంగదాంబ, ఉప్పుగూడ శ్రీ మహంకాళి, కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ, చార్మినార్ భాగ్యలక్ష్మి మాత, హరిజన బస్తీ శ్రీ నల్లపోచమ్మ, చాంద్రయణగుట్ట శ్రీ బంగారు మైసమ్మ, కుమ్మర్ వాడీ శ్రీ కనకదుర్గ తదితర ప్రధాన ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ముఖ్యంగా సౌత్ జోన్ లోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయగా, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బందోబస్తును నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్సీ జాగృతి కవిత రాక
ఆదివారం బోనాలు, తొట్టేల సమర్పణతో పాటు సోమవారం లాల్ దర్వాజ సింహావాహిని మహాంకాళీ అమ్మవారి దేవాలయం ఆవరణలో రంగం కార్యక్రమం, ఆ తర్వాత అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించుకుని, దర్శించుకునేందుకు తరలి రానున్నందున, పాతబస్తీలోని పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ దారి మళ్లింపు వంటి చర్యలు చేపట్టనున్నారు. సినీ నటి విజయశాంతి, ఎమ్మెల్సీ జాగృతి కవితతో పాటు క్రీడాకారిణి పీవీ సింధు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నట్లు సమాచారం.
Also Read: Gandhi Nursing Students: దయనీయంగా గాంధీ నర్సింగ్ విద్యార్ధుల పరిస్థితి.. స్పందించని ఉన్నతాధికారులు
ఈ లాల్ దర్వాజ సింహావాహిని మహాంకాళీ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఉదయం పది గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉదయం విచ్చేయనున్నందున పోలీసులు ఇప్పటికే పాతబస్తీలోని దేవాయాలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి తోడు చార్మినార్ మినార్‌లో కొలువుదీరిన శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చే అవకాశమున్నందున, దేవాలయం ఆవరణలో పోలీసులు సాయుధ బలగాలతో బందోబస్తును చేపట్టారు. దీనికి తోడు మీరాలం మహాంకాళీ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కూడా బోనాలు, తొట్టెల సమర్పణలతో పాటు సోమవారం రంగం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
అడుగడుగునా సీసీ నిఘా
బోనాలు, తొట్టెల ఊరేగింపులతో పాటు మరుసటి రోజు జరిగే రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసులు పాతబస్తీలోని దాదాపు అన్ని దేవాలయాల వద్ద సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. పాతబస్తీ బోనాల జాతరకు కేవలం జంటనగరాల నుంచే గాక, పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు ఎక్కవగా వచ్చే అవకాశమున్నందున, పోలీసులు ఆకతాయిల చేష్టలకు చెక్ పెట్టేందుకు రంగంలో షీటీమ్స్(She Teams) ను దింపారు. ఎక్కడ ఎలాంటి చిన్న ఘటన జరిగినా, వెంటనే బాధ్యులను గుర్తించేలా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఈ కెమెరాలను బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు తెలిసింది. దీనికి తోడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిటీలోని మొత్తం వైన్ షాపులను మూసివేయాలని నగర పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Congress on KCR KTR: కేటీఆర్ కెసీఆర్ పై సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి ఫైర్