Sleeping Prince: గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్‌వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ (36) శనివారం (2025 జులై 19) తుదిశ్వాస విడిచారు. 2005లో లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, కోమాలోకి వెళ్లిన ఆయన రెండు దశాబ్దాలపాటు నిద్రావస్థలోనే ఉన్నారు. 15 ఏళ్ల వయసున్నప్పుడు ప్రమాదం జరగగా సుదీర్ఘకాలం కోమాలో ఉన్నారు. అందుకే ఆయనను ‘స్లీపింగ్ ప్రిన్స్’ అని పిలుస్తున్నారు. అల్‌వలీద్ మరణంపై గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘యువరాజు అల్‌వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్ మరణం పట్ల… క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌కు, రాజ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’’ అని పేర్కొంది. ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత సుదీర్ఘంగా 20 ఏళ్లు పోరాడి ప్రాణాలు విడిచినట్టు ఇమామ్స్ కౌన్సిల్ తెలిపింది.
తండ్రి భావోద్వేగ ప్రకటన
తన కుమారుడు అల్‌వలీద్ మరణంపై ప్రిన్స్ ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ‘‘అల్లాహ్ ఆజ్ఞ, ఆయన రాసిన రాతను మేము అంగీకరిస్తున్నాం. వర్ణించలేని బాధ, దు:ఖంతో మా ప్రియ రాకుమారుడు అల్‌వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్ చనిపోయినట్టు తెలియజేస్తున్నాను. అల్లాహ్ కరుణతో నా కొడుకు విశ్రాంతి పొందునుగాక’’ అంటూ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కాగా, తన కొడుకు అల్‌వలీద్‌ను బతికించుకునేందుకు ప్రిన్స్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్ చివరి వరకు ప్రయత్నించారు. లైఫ్ సపోర్ట్ తీసేద్దామంటూ వైద్యులు ఎన్నోసార్లు సూచించినా ఆయన అంగీకరించలేదు. ‘‘మనిషి ఎప్పుడు చనిపోవాలో నిర్ణయించేది కేవలం అల్లాహ్ ఒక్కరే’’ అని చెబుతుండేవారు. లైఫ్ సపోర్ట్ తీసేయడానికి నిరాకరించేవారు.
Read Also- ICC CLT: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!
2005లో ఏం జరిగింది?
అల్‌వలీద్ 1990 ఏప్రిల్ నెలలో జన్మించారు. ప్రిన్స్ ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్ కుమారుల్లో పెద్దవారు. బిలియనీర్ బిజినెస్‌మెన్ ప్రిన్స్ అల్‌వలీద్ బిన్ తలాల్‌కు మేనల్లుడు అవుతారు. ప్రిన్స్ అల్‌వలీద్ యూకేలోని ఓ మిలిటరీ కాలేజీలో చదువుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అంతర్గత రక్తస్రావం కూడా సంభవించింది. దీంతో, ఆయన పూర్తిగా కొమాలోకి వెళ్లారు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్‌అజీజ్ మెడికల్ సిటీకి తరలించి, దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయనను మెడికల్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స కొనసాగించారు. అందుకే, అల్‌వలీద్‌ను ‘స్లీపింగ్ ప్రిన్స్’గా (నిద్రలో ఉన్న యువరాజు) అని పిలిస్తుంటారు. సుదీర్ఘ చికిత్సలో కొన్నిసార్లు ఆయన వేళ్లు కదిలించడంలాంటివి మినహా శరీరంలో పెద్ద చలనం కనిపించలేదు. వేళ్లు కదిలినప్పుడు రాజకుటుంబంలో ఆశలు చిగురించేవి. కానీ, ఫలితం ఉండేది కాదు. అమెరికా, స్పాయిన్‌కు చెందిన డాక్టర్లు అత్యంత మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రిన్స్ కోమా నుంచి బయటపడలేదు. రియాద్‌లోని ఇమామ్ తుర్కీ బిన్ అబ్దుల్లా మసీదులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Also- Team India: టీమిండియాకు ఎదురుదెబ్బ.. సీఎస్కే ప్లేయర్‌కు సెలక్టర్ల పిలుపు