Masood Azhar: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ (Masood Azhar) కదలికలను భారత ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని (POK) గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఉన్నట్టు తాజా ఇంటలిజెన్స్ సమాచారం తెలిపింది. తనకు సురక్షితమైన బహావల్‌పూర్ స్థావరానికి 1,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న ‘స్కార్డు’ అనే పట్టణంలో అతడిని గుర్తించినట్లు భారత ఏజెన్సీలు పేర్కొన్నాయి . పట్టణంలోని సద్‌పారా రోడ్‌లో అతడిని గుర్తించినట్టు వివరించాయి. మసూద్ అజర్ కదలికలను గుర్తించిన ఈ ప్రాంతంలో రెండు మసీదులు, వాటికి సంబంధించిన మదర్సాలు, ప్రైవేట్, ప్రభుత్వ అతిథిగృహాలు ఉన్నాయి. సరస్సులు, ప్రకృతి పార్కులతో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో తలదాచుకుంటాడని ఎవరికీ అనుమానం కలగకుండా తెలివిగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.
పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో ఈ మధ్య మాట్లాడుతూ, మసూద్ అజర్ ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్‌లో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అతడు పాక్‌లోనే ఉన్నట్టు గుర్తిస్తే భారత్‌కు అప్పగించేందుకు సిద్ధమని కూడా చెప్పారు. ‘‘మసూద్ పాక్ గడ్డపైనే ఉన్నట్టు భారత్ అధికారిక సమాచారం అందిస్తే మేము అరెస్ట్ చేస్తాం’’ అంటూ అల్‌జజీరా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో చెప్పారు. ఈ నేపథ్యంలో అతడి ఆచూకీ భారత ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించడం గమనార్హం.
ఒకపక్క మసూద్ అజర్‌ను భారత ఇంటలిజెన్స్ సంస్థలు నిశితంగా గమనిస్తుండగా, జైషే మహ్మద్ సంస్థ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో పాత ఆడియోలు మళ్లీ షేర్ చేస్తూ, మసూద్ ఇంకా బహావల్‌పూర్‌లోనే ఉన్నట్టుగా అందరినీ నమ్మించే మోసపూరిత ప్రయత్నాలు చేస్తోంది. కాగా, మసూద్‌కు బహావల్‌పూర్‌లో రెండు స్థావరాలు ఉన్నాయి. జైషే మహ్మద్ ప్రధాన కేంద్రం జామియా సుభాన్ అల్లా, (‘ఆపరేషన్ సిందూర్’లో టార్గెట్ చేసింది), అలాగే జామియా ఉస్మాన్ ఓ అలీ మసీదు. ఈ మసీదు జనసాంద్రత ఎక్కువుగా ఉన్న ప్రాంతంలో ఉంది. ఇదే ఏరియాలో మసూద్‌కు మరో పాత నివాసం కూడా ఉంది. ఇది ఓ హాస్పిటల్‌కు అత్యంత సమీపంలో ఉంది. కాగా, ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జామియా సుభాన్ అల్లా అనే భారత్ జరిపిన దాడిలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read Also- Dukes Ball: శుభ్‌మన్ గిల్ అభ్యంతరం.. స్పందించిన డ్యూక్స్ బాల్ కంపెనీ
భారత్‌లో దాడులకు సూత్రధారి
ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిన మసూద్ అజర్, భారతదేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడి, 2019లో 40 మందికిపైగా జవాన్లు అమరులైన పుల్వామా ఉగ్రదాడి వంటి భారీ దాడుల్లో మసూద్ పాత్ర ఉంది. భారత్, అమెరికా కూడా ఇప్పటికే నిషేధం విధించాయి. 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడికి కూడా బాధ్యుడిగా ఉన్నాడు. కాగా, మసూద్1999లో భారత కస్టడీలో ఉండగా అతడి అనుచరులు విమానాన్ని హైజాక్ చేసి, ప్రయాణికులను విడుదల చేయాలంటే మసూద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అతడు ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ను స్థాపించాడు.
Read Also- Water Rocket: వాటర్ రాకెట్ తయారు చేసిన చైనా విద్యార్థులు.. వీడియో ఇదిగో
కాగా, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మసూద్ అజర్‌ను బహావల్‌పూర్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. 2019 బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత ఇదే విధంగా అతడిని పెషావర్‌లోని ఓ రహస్య స్థావరానికి తరలించారు. మసూద్ అజర్ మాత్రమే కాదు, మరో వాంటెడ్ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కూడా పాకిస్థాన్‌లో సురక్షితంగా తలదాచుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఇస్లామాబాద్‌లోని ఓ విలాసవంతమైన ప్రాంతంలో బస చేస్తున్నాడని, జనాల రద్దీ ఎక్కువగా ఉండే బర్మా టౌన్ అనే ప్రాంతంలో ఒక ఆఫీస్ కూడా ఉన్నట్టు ఇంటలిజెన్స్ వద్ద సమాచారం ఉంది. ఎప్పుడూ గన్‌మెన్‌లతో కనిపిస్తున్నాడని సమాచారం.