Team India: ఐదు మ్యాచ్‌ల ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆతిథ్య జట్టు 2 మ్యాచ్‌లు, టీమిండియా (Team India) ఒక మ్యాచ్‌లో విజయాలు అందుకున్నాయి. మిగిలివున్న రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ ఒక్క విజయం సాధించినా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అందుకే, ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న మూడవ మ్యాచ్‌కు అత్యంత పకడ్బందీగా బరిలోకి దిగాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని నిర్ణయించుకుంది. అందుకే, కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది.
కాగా, ఇరు జట్ల ఉత్కంఠభరితంగా సాగిన లార్డ్స్ టెస్టులో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. రవీంద్ర జడేజా, నితిష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్‌లో విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు ఒక కీలక సూచన చేశాడు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
Read Also- Nimisha Priya: నిమిషా మరణశిక్షపై మరోసారి స్పందించిన కేంద్రం
మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ, భారత జట్టు గర్వంగా ఉండొచ్చని, ముఖ్యంగా జడేజా ఆత్మగౌరవంతో ఆడవచ్చని పేర్కొన్నాడు. ‘‘నేను అనేకసార్లు చెప్పినట్టుగా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలి. అయితే, అతడికి జట్టులో ఏవిధంగా కల్పిస్తారో తెలియదు. వాషింగ్టన్ సుందర్ చక్కగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో కూడా కొంత సహకారం అందించాడు. జడేజా బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. చివరివరకు జడేజాకు ఎవరో ఒకరు అండగా నిలబడి ఉంటే లార్డ్స్ టెస్టులో గెలిచేవాళ్లే. జడేజాకు ఎలాంటి సహకారం లేకపోవడం చూస్తే జాలివేసింది’’ అని క్లార్క్ పేర్కొన్నాడు. ఈ మేరకు బియెంట్23 (Beyond23) పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.
బుమ్రా ఆడతాడా? లేదా?
మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు కూర్పు ఏవిధంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఈ అంశంపై భారత అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డొషేట్ స్పందిస్తూ.. బుమ్రా ఆడతాడా? లేదా అనేది మాంచెస్టర్‌లోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాడ్లాడారు. ‘‘ఆఖరి రెండు టెస్టుల్లో ఒక్కదాంట్లో బుమ్రా ఆడతాడు. మాంచెస్టర్ మ్యాచ్‌పై సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. కాబట్టి, అతడిని ఆడించడంపై సమాలోచనలు చేస్తున్నాం. అయితే, అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. మ్యాచ్ ఎన్ని రోజులు కొనసాగుతుంది?, విజయానికి బెస్ట్ కాంబినేషన్ ఏంటి?, ‘ది ఓవల్’లో పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతోంది?’’ ఇలా అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Read Also- Viral News: తండ్రి చనిపోయి వర్క్‌ఫ్రమ్ హోం అడిగితే.. మేనేజర్ ఏమన్నాడంటే?
కాగా, ఈ ఏడాది మార్చి నెలలో బుమ్రాకు వెన్ను శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి, బీసీసీఐ మెడికల్ టీమ్ సూచనలతో తయారు చేసిన వర్క్‌లోడ్ ప్లాన్ ప్రకారం బుమ్రా ఆడుతున్నాడు. 5 టెస్టుల్లో కేవలం మూడింట్లో మాత్రమే ఆడాలని సెలెక్టర్లు నిర్ణయించారు. అందుకే, రెండో టెస్టులో విశ్రాంతి ఇచ్చారు. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బుమ్రా 7 వికెట్లు పడగొట్టి ప్రతిభ చాటాడు.