GHMC Special Officers: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ (GHMC) అందించే అతి ముఖ్యమైన సేవల్లో శానిటేషన్ (పారిశుధ్యం) ప్రధానమైనది. మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజూ పేరుకుపోతున్న చెత్తను వీలైనంత త్వరగా శివారులోని డంపింగ్ యార్డుకు తరలించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో అధికారులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఏళ్ల క్రితం హైదరాబాద్‌ను ‘బిన్ ఫ్రీ సిటీ’ చేయాలన్న ఉద్దేశ్యంతో నగరంలో అక్కడక్కడ ఉన్న డంపర్ బిన్లను తొలగించారు. ఇంటింటి నుంచి నేరుగా చెత్తను సేకరించేందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్లను తీసుకువచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం నగరంలో మొత్తం 22 లక్షల నివాస సముదాయాలున్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ, ప్రజలు ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులకు అందించాలని సూచించింది.
Also Read: GHMC: అడ్డదారిలో కారుణ్య నియామకాలు.. జీహెచ్ఎంసీ ఖజానాకు భారం
నెలకు రూ. 50 చెల్లించాలి
కార్మికుడికి ఒక్కో ఇంటి నుంచి నెలకు రూ. 50 చెల్లించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కొత్తలో పకడ్బందీగా అమలు అయినప్పటికీ, క్రమంగా ఇది విఫలమైంది. ఫలితంగా రోడ్లకిరువైపులా, రోడ్లపై, నాలాలు, చెరువుల్లో చెత్త పడటం మొదలైంది. మరోవైపు చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను స్వీకరించిన రాంకీ సంస్థ సకాలంలో చెత్తను తరలించకపోవడంతో జరిమానాలు విధించినా పరిస్థితులు మారడం లేదు. దీంతో అధికారులు చేసేదేమీ లేక సెంట్రల్ ఛలాన్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తూ జరిమానాలు విధించడం ప్రారంభించారు.
శానిటేషన్‌ను గాడిలో పెట్టేందుకు ఎలాంటి కొత్త మార్గాలు కనిపించకపోవడంతో, ప్రతి రోజు శానిటేషన్ పనులను సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించేందుకు వీలుగా గతంలో మాదిరిగా శానిటేషన్ స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్ హోదా మొదలుకొని వివిధ విభాగాల్లో డిప్యూటీ కమిషనర్ కన్నా పై స్థాయిలో, అదనపు కమిషనర్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్న జాయింట్ కమిషనర్ వంటి హోదాల్లో కొనసాగుతున్న అధికారులను 30 సర్కిళ్లకు 30 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తారు?
ఈ స్పెషల్ ఆఫీసర్లు తాము రొటీన్‌గా నిర్వర్తించాల్సిన విధులతో పాటు స్పెషల్ ఆఫీసర్ విధులను అదనంగా నిర్వర్తించనున్నారు. ఒక్కో స్పెషల్ ఆఫీసర్ తనకు కేటాయించిన సర్కిల్ పరిధిలో ఉదయాన్నే శానిటేషన్ పనులను పర్యవేక్షించి, నేరుగా కమిషనర్‌కు నివేదికలను అందజేయాల్సి ఉంటుందని తెలిసింది. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో ఏళ్లుగా పాతుకుపోయిన పర్మినెంట్, ఔట్‌సోర్స్ కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించడం లేదన్న విషయాన్ని గుర్తించిన కమిషనర్, ఒక సర్కిల్‌కు వేరే సర్కిల్ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది.
స్పెషల్‌గా ఫోకస్
జీహెచ్‌ఎంసీ (GHMC) కమిషనర్ కర్ణన్ ఇటీవలే భారీగా అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించడంతో పాటు విభాగాల వారీగా వారిని బదిలీలు కూడా చేశారు. దీనికి తోడు డిప్యూటీ కమిషనర్లకు కూడా భారీగానే స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్‌లుగా బదిలీ అయిన వారు శానిటేషన్ పనులపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టేందుకు వీలుగా, వారిపై ఇతర సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్, ఆ పై స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తే మంచి ఫలితాలుంటాయని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కమిషనర్ ఇదివరకు జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వర్తించిన ఒక డిప్యూటీ కమిషనర్‌ను మూడు జోన్లకు జాయింట్ కమిషనర్ (శానిటేషన్)గా, మరో డిప్యూటీ కమిషనర్‌ను మరో మూడు జోన్లకు జాయింట్ కమిషనర్ (శానిటేషన్)గా నియమించినట్లు సమాచారం.
Also Read:Hyderabad Land Dispute: నమ్మి మోసపోయామంటున్న బాధితులు.. రూ.2 వేల కోట్లకు పైగా నష్టమంటూ ఆవేదన