CPI leader Murder: పట్టపగలే సీపీఐ నేత చందూ నాయక్‌ను కాల్చి చంపారు దుండగులు. పక్కాగా రెక్కీ చేసి మార్నింగ్ వాక్ ముగించుకుని పార్కు నుంచి బయటకు వస్తుండగా ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మొదట చందూనాయక్ (Chandu Nayak) ముఖంపై కారం చల్లి ఆ తరువాత ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందూ నాయక్ అక్కడికక్కడే మరణించాడు. సీపీఐ పార్టీకి చెందిన రాజు తన సహచరులతో కలిసి ఈ హత్య చేసినట్టు హతుడి భార్య ఆరోపించింది.
కాగా, కుంట్లూరులోని భూదాన్ భూముల్లో వేసిన గుడిసెల వివాదంలోనే చందూనాయక్ హత్య జరిగినట్టు సమాచారం. (Chandu Nayak) చందూ నాయక్‌ను కాల్చి చంపిన తరువాత రాజుతోపాటు మరో ముగ్గురు పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలిసింది. అయితే, అధికారులు మాత్రం దీనిని ధృవీకరించడం లేదు. నిందితులు ఇంకా దొరకలేదని చెబుతున్న అధికారులు వారిని పట్టుకోవటానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని అంటున్నారు. దిల్‌సుక్‌నగర్‌లో సంచలనం సృష్టించిన హత్య వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrayangutta Crime: చిన్నప్పటి స్నేహితుడిని కత్తితో పొడిచి దారుణ హత్య..
దిల్‌సుక్‌నగర్ (Dilsuknagar) ప్రాంతంలోని శాలివాహన నగర్ నివాసి చందూ నాయక్ (47) సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు. ప్రతీరోజూ ఉదయం భార్య, కొందరు మిత్రులతో కలిసి శాలివాహననగర్‌లోనే ఉన్న పార్కులో వాకింగ్ చేయడం ఆయన అలవాటు. ఎప్పటిలానే మంగళవారం ఉదయం భార్య నారీ బాయితో కలిసి చందూ నాయక్ (Chandu Nayak) వాకింగ్ కోసం పార్కుకు వెళ్లాడు. ఉదయం7:30గంటల సమయంలో వాకింగ్ ముగించుకుని పార్క్ నుంచి బయటకు వచ్చాడు. భార్య ఆయనకన్నా కొద్దిగా ముందు బయటకు వచ్చి ఇంటి వైపు బయల్దేరింది.
కాగా, చందూ నాయక్ పార్కు నుంచి బయటకు రాగానే అప్పటికే కాపు కాసి ఉన్న నలుగురు వ్యక్తులు ముందు ఆయన ముఖంపై కారం చల్లారు. కీడును శంకించిన చందూ నాయక్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే, దాడి చేసిన దుండగులు వెంటనే దుస్తుల్లో నుంచి గన్ బయటకు తీసి ఆయనపై ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంట్లో మూడు బుల్లెట్లు చందూ నాయక్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే రక్తం మడుగులో కుప్పకూలి మరణించాడు.
కళ్ల ముందే జరిగిన ఈ దారుణ హత్యతో భయపడ్డ స్థానికులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ వెంటనే కాల్పులు జరిపిన నలుగురు దుండగులు స్విఫ్ట్ కారులో అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న మలక్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆతరువాత కొద్దిసేపటికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ అక్కడికి వచ్చారు. క్లూస్ టీం సిబ్బందితోపాటు పోలీసు (Police) జాగిలాలను అక్కడికి రప్పించారు. క్లూస్ టీం సిబ్బంది సంఘటనా స్థలం నుంచి రెండు బుల్లెట్ షెల్స్ తోపాటు ఫైర్ అవ్వని మరో రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Medak Crime: కల్లు సీసాతో పొడిచి.. బండ రాయితో దారుణ హత్య
పార్టీ నాయకుడే చంపాడు : హతుడి భార్య
కాగా, సీపీఐ పార్టీకి చెందిన రాజు తన సహచరులైన శివ, సుధాకర్ తోపాటు మరో వ్యక్తితో కలిసి ఈ హత్య చేసినట్టు చందూ నాయక్ భార్య నారీ బాయి ఆరోపించారు. మార్నింగ్ వాక్ ముగించుకుని తామిద్దరం పార్క్ నుంచి బయటకు వస్తుండగా రాజు అతని సహచరులు కనిపించినట్టు తెలిపారు. వారిని చూడగానే తన భర్త కంగారు పడ్డారని చెప్పారు. తనను అక్కడి నుంచి వెళ్లి పోవాలని తొందర పెట్టడంతో తాను ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్లిపోయానన్నారు. రాజు కొంతకాలంపాటు మావోయిస్టు పార్టీలో పని చేశాడని, అతని వద్ద తుపాకులు ఉన్నాయని పలుమార్లు తన భర్త చెప్పినట్టు పేర్కొన్నారు. తన భర్తను ఎలాగైతే చంపారో నిందితులను కూడా అలాగే చంపాలని ఆమె డిమాండ్ చేశారు.
కుంట్లూరు భూముల వివాదంలోనే?
భూ వివాదంలోనే చందూ నాయక్ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. కుంట్లూరులోని భూదాన్ భూముల్లో సీపీఐ నాయకులు నిరుపేదలతో గుడిసెలు వేయించారు. కాగా, అదే పార్టీలో ఉన్న రాజు గుడిసెలు వేసుకున్న వారితో డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలియడంతో అతన్ని మందలించిన చందూ నాయక్ పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు తెలిసింది. దాంతో సీపీఐ రాష్ట్ర నాయకులు రాజును గట్టిగా మందలించినట్టు సమాచారం. దీంతో కక్ష పెంచుకునే రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా భావిస్తున్నారు. చందూ నాయక్ భార్య నారీ బాయి కూడా కుంట్లూరు భూముల వివాదంలోనే రాజు తన భర్తను చంపినట్టుగా ఆరోపించడం గమనార్హం.
పక్కాగా రెక్కీ జరిపి
చందూ నాయక్‌ను కాల్చి చంపిన నలుగురు దీనికి ముందు కొన్ని రోజులపాటు పక్కాగా రెక్కీ జరిపినట్టు తెలిసింది. చందూ నాయక్ (Chandu Nayak) దినచర్య ఎలా ఉంటుందన్న దానిని నిశితంగా గమనించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే చందూ నాయక్ క్రమం తప్పకుండా శాలివాహన నగర్ పార్కులో వాకింగ్ చేస్తాడని తెలుసుకుని పథకం వేసిన నలుగురు మంగళవారం ఆయనను అక్కడే దారుణంగా హత్య చేశారు.
లొంగిపోయిన నిందితులు?
చందూ నాయక్ (Chandu Nayak) ను హత్య చేసిన నలుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా సమాచారం. అయితే, అధికారులు మాత్రం దీనిని నిర్ధారించలేదు. హత్యకు పాల్పడ్డ నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకోవటానికి పది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు. కాగా, హత్యకు పాల్పడ్డ నిందితులు పారిపోవడానికి ఉపయోగించిన స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని దుండగులు అద్దెకు తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. చందు నాయక్ (Chandu Nayak) ఎల్బీనగర్‌లో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నారడి సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్ పేర్కొన్నారు.
Also Read: Medchal District Crime: చాకలి ఐలమ్మ మనవరాలి హత్య.. కన్నతల్లినే చంపిన కూతురు!