Shubman Gill: లీడ్స్, బర్మింగ్‌హామ్ టెస్టుల్లో అత్యద్భుతంగా రాణించిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్.. లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో అంతగా రాణించలేకపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ 16 పరుగులు, లక్ష్య చేధనలో కీలకమైన రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే సాధించాడు. లార్డ్స్ టెస్టులో చారిత్రాత్మక ప్రదర్శన చేయలేకపోయినప్పటికీ కెప్టెన్ గిల్ ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 23 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు నెలకొల్పాడు. 2002లో రాహుల్ ద్రావిడ్ చేసిన 602 పరుగుల మైలురాయిని ఈ సిరీస్‌లో గిల్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు టెస్టుల్లో 607 పరుగులు సాధించాడు. దీంతో, ఇంతకాలం ద్రావిడ్ తర్వాతి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ (2016లో 593 పరుగులు) మూడవ స్థానానికి పడిపోయాడు.
Read Also- Health News: రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే మీ పని గోవిందా.. ఎందుకో రండి చెబుతా!
సిరీస్‌లో ఆకట్టుకుంటున్న గిల్
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటివరకు మూడు టెస్టుల్లో బ్యాటింగ్ చేసి 607 పరుగులు సాధించగా, రికార్డు స్థాయిలో 101.17 సగటుతో పరుగులు రాబట్టాడు. మూడు టెస్టుల్లో మూడు శతకాలు సాధించాడు. అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. మరో రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో గిల్ 1,000 పరుగుల మైలురాయిని కూడా అవకాశముంది. రైట్-హ్యాండెడ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయిన శుభ్‌మాన్ గిల్ టెస్ట్ ఫార్మాట్‌లో 2020లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం కెప్టెన్‌గా అవకాశం దక్కడంతో విరాట్ కోహ్లీ తర్వాత భారత టెస్టు బ్యాటింగ్ భారం గిల్ భుజాలపై ఉందని క్రికెట్ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల్లోనూ మంచిగా ఆడాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also- AP-TS Water Disputes: ఢిల్లీకి నీటి పంచాయితీ.. తేల్చుకోనున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు
కాగా, లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా మారింది. ఐదవ రోజు ఆట 71 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు రెండవ ఇన్నింగ్స్‌లో 164/9గా ఉంది. భారత్ విజయానికి మరో 29 పరుగులు అవసరమవ్వగా, క్రీజులో చివరి వికెట్ అయిన రవీంద్ర జడేజా 57 (బ్యాటింగ్), మహ్మద్ సిరాజ్ 2 (బ్యాటింగ్) చేస్తున్నారు.