IT Park: మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ గేట్ వే ఐటీ(IT Park) పార్కు కోసం గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం ఎంతో హడావుడి చేసింది. అప్పటి సీఎం కేసీఆర్(KCR) పుట్టినరోజును పురస్కరించుకుని అప్పటి ఐటీ శాఖా మంత్రి కేటీఆర్(KTR) హడావుడిగా శంకుస్థాపన చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి స్థలాలను కేటాయిస్తూ కొందరికి పత్రాలను సైతం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎక్కడ గొంగళి అక్కడే అన్నట్లుగా ఐటీ పార్కు పనులకు ఒక్క అడుగు సైతం పడకపోగా ఇక పార్కు ఏర్పాటు అంశం అటకెక్కినట్లేనని ప్రచారం జరుగుతోంది. ఐటీ పార్కు ఇక్కడి నుంచి తరలిపోతున్నదన్న అపోహ సైతం ఈ ప్రాంత ప్రజల్లో నెలకొంది.
పునాది పడని పనులు
హైదరాబాద్(Hyderabad) నగరానికి నలు వైపులా ఐటీ రంగాన్ని విస్తరించడంలో భాగంగా గత బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం మేడ్చల్(Medchal) జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటుకు సంకల్పించింది. ఈ మేరకు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో ఓఆర్‌ఆర్(ORR) పక్కనే ఉన్న సర్వే నెంబర్125లో 12 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్థల కేటాయింపులను సైతం జరిపింది. 2022లో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకు స్థాఫన చేశారు. టెండర్లను సైతం పిలిచారు. కానీ.. పార్కుకు సంబంధించి అంగుళం పని కూడా జరగలేదు.
Also Read: AV Ranganath: మోడల్‌గా మాసబ్ చెరువు కింది నాలా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
నిర్మాణ పనులకు సంబంధించి వివిధ శాఖల నుంచి అనుమతి లభించినప్పటికీ హెచ్‌ఎండీఏ(HMDA) అనుమతి ఇవ్వకపోవడం వల్ల పనుల్లో ఆశించిన మేర కదలిక రాలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వం ఆరంభంలో హడావుడి చేసినప్పటికీ పార్కు పనులకు పునాది కూడా పడలేదు. అప్పట్లో పార్కు నిర్మాణ ప్రాంతంలో ఉన్న గోదాములను కూలగొట్టి భూమిని చదును చేశారు. టీఎస్ఐఐసీ(TSIIC) అధికారులు సైతం భూమి చదును పనులను నిత్యం పరిశీలించి హడావుడి చేశారు. అప్పటి మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) సైతం నిత్యం ఈ ప్రాంతాన్ని సందర్శించి పనులపై ఆరా తీశారు. ఐటీ పార్కు ఏర్పాటవుతుందని ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. చివరకు పార్కు ఏర్పాటు హంగూ ఆర్భాటాలకే పరిమితమైంది.
కలగానే ఐటీ రంగ విస్తరణ
ఐటీ పార్కు ఏర్పాటుతో నగరానకి ఉత్తరాన మేడ్చల్(Medchal) వైపు కూడా ఐటీ విస్తరిస్తుందని అందరూ భావించారు. 200 వరకు ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువుగా ఐటీ పార్కు కోసం డిజైన్‌ను రూపొందించగా.. దాదాపు వంద వరకు కంపెనీలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. ఇది కార్యరూపం దాల్చి ఉంటే వేలాది సంఖ్యలో ఐటీ ఉద్యోగాల కల్పన జరగడంతోపాటు మేడ్చల్ ప్రాంతం మరింత అభివృద్ది చెందే అవకాశం ఉండేది. దీనికితోడు ఈ ప్రాంతంలో వ్యాపారాలు వృద్ది చెంది అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేది. నిర్మాణ పనుల్లో స్తబ్దత నెలకొనడంతో ఐటీ పార్కు ఇక్కడి నుంచి తరలిపోనున్నదన్న ప్రచారం సైతం జరుగుతోంది. ప్రస్తుత కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ఐటీ పార్కు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజానీకం కోరుతోంది.
Also ReadL: BC Reservation: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంబురాలు