Iran Israel: అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ నెలలో ‘ఆపరేషన్ రైసింగ్ లయన్’ పేరిట ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేయడం, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య 12 రోజులపాటు యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇరాన్‌కు చెందిన కీలక అణు శాస్త్రవేత్తలు, సైనిక అధికారులను కూడా ఇజ్రాయెల్ హత్య చేసింది. ఇక, జూన్ 16న ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌కు కూడా హత్య చేసేందుకు ఇజ్రాయెల్ సేనలు ప్రయత్నించాయి. అయితే, ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెజెష్కియన్ కాలికి గాయమయ్యిందని ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుబంధ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ ఆదివారం వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి సమావేశం జరుగుతున్న ఓ భవనంపై దాడి జరిగిందని, ఈ బిల్డింగ్ టెహ్రాన్ పశ్చిమ భాగంలో ఉందని వివరించింది. కీలకమైన ఆ సమావేశంలో స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘలీబాఫ్, న్యాయవ్యవస్థ అధిపతి మొహ్సేని ఎజెయీ, ఇతర ముఖ్య అధికారులు కూడా పాల్గొన్నాని వివరించింది.
నస్రల్లాను చంపేసినట్టుగానే..
అధ్యక్షుడు పెజెష్కియాన్ లక్ష్యంగా జరిగిన దాడి, హెజ్బొల్లా నేత హసన్ నస్రల్లా హత్యను తలపించే విధంగా జరిగిందని ‘ఫార్స్’ కథనం వివరించింది. సమావేశం జరిగిన భవనంలోకి వెళ్లే, బయటకు వచ్చే మార్గాలపై ఆరు మిస్సైళ్లతో దాడి చేశారు. లోపల ఉన్నవారు ఎవరూ బయటకు వెళ్లే అవకాశం లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. అధికారులంతా బిల్డింగ్‌లోని కింది ఫ్లోర్‌లో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. పేలుళ్లతో ఒక్కసారిగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. అయితే, ముందుగానే సిద్ధం చేసిన ఎమర్జెన్సీ భూగర్భ మార్గం ద్వారా అధికారులు బయటకు వెళ్లారు. బయటకు పారిపోతున్న సమయంలో పెజెష్కియన్‌తో పాటు మరికొందరు అధికారులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దాడి కోసం ఉపయోగించిన సమాచారం అత్యంత ఖచ్చితంగా ఉండటంతో అంతర్గత గూఢచారి ఉన్నారా? అనే కోణంలో కూడా ఇరాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also- Viral News: 3 నెలల్లోనే సిటీ వదిలి వెళ్లిన యువకుడు.. అతడు చెబుతున్న కారణాలివే
ముందే చెప్పిన పెజెష్కియాన్
ఇజ్రాయెల్‌పై తనను హత్య చేయాలని ప్రయత్నించిందంటూ ఇదివరకే ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ చెప్పారు. “అవును నిజమే, హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నించారు. కానీ, విఫలమయ్యారు” అని టక్కర్ కార్ల్‌సన్ అనే జర్నలిస్ట్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ఇరాన్ ఇంటర్నేషనల్’ కథనం ప్రకారం జూన్ 16న పశ్చిమ టెహ్రాన్‌లోని షహ్రక్-ఇ-ఘర్బ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. ముందస్తు ఎమర్జెన్సీ ద్వారం ఏర్పాటు చేయడంతో బయటపడ్డారని పేర్కొంది. కాగా, 12 రోజుల యుద్ధ సమయంలో కీలకమైన ఇరాన్ సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ బలగాలు హత్య చేశాయి. ఈ జాబితాలో ఐఆర్‌జీసీ కమాండర్ హొసైన్ సలామీ, ఇరాన్ సాయుధ దళాల చీఫ్ మోహమ్మద్ బాఘెరీ, ఐఆర్‌జీసీ ఎయిర్‌ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ హాజిజాదే, సీనియర్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు కూడా ఉన్నారు. అంతేకాదు, యుద్ధ సమయంలోనే ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీని హత్య చేసేందుకు ప్రయత్నించింది. కానీ, సాధ్యపడకపోవడంతో సైలెంట్ అయ్యింది. ఖమేనీని హత్య చేయవద్దంటూ ఇజ్రాయెల్‌ను అమెరికా కూడా హెచ్చరించింది.
Read Also- Viral News: హెల్మెట్‌కు సీసీ కెమెరా.. ఎందుకు చేస్తున్నాడంటే?