Viral News: భారత రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణానికి, ఆస్తికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. ఒకవేళ ఎవరైనా వ్యక్తి తరచూ బెదిరింపులు ఎదుర్కొంటూ, పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోతే అది వ్యవస్థ వైఫల్యంగా భావించాలి. అలాంటి పరిస్థితుల్లో సామాన్యుల ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. సరిగ్గా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితినే ఎదుర్కొంటున్న ఓ సామాన్య వ్యక్తి ఆత్మరక్షణ కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు లేకపోవడంతో, కనీసం తనపై జరిగే దాడికి సాక్ష్యంగానైనా నిలుస్తుందనే ఉద్దేశంతో హెల్మెట్‌కు కెమెరా బిగించుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం గౌరీనగర్ ఏరియాలో కొంచెం వింతగా, తీవ్ర కలవరానికి గురిచేసే ఘటన జరిగింది. ఒక యువకుడు సురక్షిత ప్రయాణానికి ఉపయోగించే హెల్మెట్‌కు సీసీ కెమెరా అమర్చాడు. తన రక్షణ కోసం పోలీసు వ్యవస్థ చేయాల్సిన పనిని స్వయంగా తన భుజాలపైనే వేసుకున్నాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు పొరుగువారితో ప్రాణహాని ఉందని బాధిత వ్యక్తి చెబుతున్నాడు. ఆస్తి వివాదంలో చంపేస్తామంటూ సతీష్ చౌహాన్, బాలిరామ్ చౌహాన్, మున్నా చౌహాన్ అనే వ్యక్తులు నిత్యం బెదిరిస్తున్నాడంటూ వాపోతున్నాడు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని, స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎలాంటి గట్టి చర్యలు తీసుకోలేదని వివరించాడు. “రక్షణ కల్పించాలని వేడుకున్నాం. ఏ చర్యలు తీసుకోకపోవడంతో నేను ఎక్కడికెళ్లినా కెమెరాతో రికార్డ్ చేయాలనుకుంటున్నాను” అని బాధిత వ్యక్తి వివరించాడు.
Read Also- Viral News: గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లలు.. కర్ణాటకలో షాకింగ్ ఘటన
సరదా కోసం కాదుహెల్మెట్-కెమెరా సెటప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు రంగు హెల్మెట్‌లో చిన్న కెమెరా అమర్చి అతను వీధుల్లో నడుస్తున్న, ప్రయాణిస్తున్న వీడియోలు కొందరిని నవ్విస్తున్నాయి. అయితే, మరికొందరు వ్యక్తుల వ్యవస్థల వైఫల్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆ వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం వెనుక అతడిలోని ఆందోళన, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని చాటిచెబుతోంది. నెటిజన్లు ‘హెల్మెట్ మ్యాన్’గా పిలుస్తుండడంపై బాధిత వ్యక్తి స్పందించారు. “ఈ హెల్మెట్ కెమెరా నేను సరదా కోసం పెట్టుకోలేదు. ఇది నా రక్షణ కవచం. నా కుటుంబానికి, లేదా నాకు ఏదైనా జరిగినా, కనీసం వీడియో ఆధారం ద్వారానైనా నిజం బయటకు వస్తుంది కదా” అని ఆవేదనతో చెప్పాడు.
పోలీసులు ఏం చెబుతున్నారు?
హెల్మెట్ మ్యాన్ వ్యవహారంపై పోలీసు అధికారులు స్పందించారు. ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం ఉన్నమాట నిజమేనని, ఇప్పటికే భౌతిక దాడుల వరకు వెళ్లిందని చెప్పారు. మధ్యవర్తిత్వం చేయడానికి తాము ప్రయత్నించామని, ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉందని వెల్లడించారు. కొత్త విషయాలు ఏవైనా వెలుగులోకి వస్తే వాటిని పరిగణనలోకి తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Read also- Warangal MGM hospital: ఎంజీఎం హస్పిటల్‌లో దారుణం.. బతికి ఉన్న వక్తి చనిపోయాడని తెలిపిన సిబ్బంది