AirIndia Crash: ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కుప్పకూలి 270 మందికిపైగా మృత్యువాతపడిన ఘోర దుర్ఘటన జరిగి శుక్రవారంతో (జులై 11) ఒక నెల పూర్తయింది. విమానం కుప్పకూలడానికి కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు బృందాలు సమగ్ర పరిశీలనలు చేస్తున్నాయి. విమాన ప్రమాదాలపై విచారణకు సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అయితే, ప్రాథమిక విచారణలో కీలక అంశాలను గుర్తించినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. విమానం రెండు ఇంజన్లు ఒకేసారి విఫలమవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చంటూ రెండు వారాలుగా ప్రచారం జరగగా, తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
అత్యంత ముఖ్యమైన విమాన భాగాల్లో ఒకటైన ‘ఫ్యూయల్ స్విచ్’ (ఇంధనాన్ని నియంత్రించే స్విచ్) ఈ ఎయిరిండియా విమాన ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే, ఇద్దరు పైలట్లలో ఒకరు పొరపాటుగా ఫ్యూయల్ స్విచ్‌ను ఆఫ్ చేయడం ఈ ఘోరవిషాదానికి దారితీసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ‘ది ఎయిర్ కరెంట్’ అనే విమానయాన జర్నల్‌లో ఆసక్తికరమైన కథనం ప్రచురితమైంది. ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేయడంతో విమానానికి అవసరమైన ఇంధనం అందలేదని, అందుకే ఈ దుర్ఘటన జరిగినట్టుగా పేర్కొంది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్‌కు ఇంధనం సరఫరా కాకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని దర్యా్ప్తు బృందాలు భావిస్తున్నట్టు పేర్కొంది.
అదే కారణమా?
ఎయిరిండియా క్రాష్‌కు గల కారణాలను గుర్తించేందుకు భారత్, అమెరికా, బోయింగ్ కంపెనీకి చెందిన విమాన నిపుణులు సమగ్ర దర్యాప్తు చేస్తు్న్నారు. విమానం ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫ్యూయల్ స్విచ్‌ను ఏర్పాటు చేసిన పొజిషన్ కారణంగానే ఇంధన సరఫరా ఆగిపోయిందా? అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారని మరో ఇంగ్లిష్ పత్రిక తెలిపింది.
Read Also- Baby Planning: 30 ఏళ్లు దాటాక.. పిల్లలు కష్టమే.. నిపుణుల సలహాలివే!
అసలు ఫ్యూయల్ స్విచ్ అంటే ఏంటి?
ఎక్కువ విమానాల్లో ఫ్యూయల్ సెలెక్టర్ స్విచ్ అనే బటన్ లేదా వాల్డ్ ఉంటుంది. విమాన ఇంధన సరఫరాను నియంత్రించేందుకు పైలట్లు ఈ స్విచ్‌ను ఉపయోగిస్తుంటారు. ఈ స్విచ్‌ను ఉపయోగించి ఇంధన ట్యాంకులను మార్గమధ్యంలోనే మార్చుకోవచ్చు. తద్వారా విమాన బరువు సర్దుబాటు చేసుకోవడంతో పాటు ఇంధనం ఎంత మిగిలివుందో కూడా పరిశీలించుకోవచ్చు. విమానం ప్రయాణించే వివిధ దశల్లో ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఈ స్విచ్‌ను పైలట్లు వాడుతుంటారు. ఇంజిన్‌లో అగ్నిప్రమాదం జరగడం వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఇంధన సరఫరా కూడా ఈ స్విచ్‌తో నిలిపేయవచ్చు.
Read Also- Gurugram Case: కూతుర్ని అందుకే చంపేశా.. సంచలన నిజాలు చెప్పిన రాధిక తండ్రి
అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు సమస్య తలెత్తిన ఇంజిన్‌కి ఇంధనాన్ని నిలిపేయడానికి ఫ్యూయల్ సెలెక్టర్ స్విచ్‌ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేసిన కోణంలో చూస్తే, విమానంలోని రెండు ఇంజిన్లలో ఒకటి చెడిపోయి ఉంటే ఆ పరిస్థితి తలెత్తుతుంది. ఇక, ప్రమాదానికి గురైన విమానంలో ఇంధనం నిండుగా ఉంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందంటే, ఇంజిన్లకు ఇంధనం అందకపోయి ఉండొచ్చని ‘ది ఎయిర్ కరెంట్ జర్నల్’ కథనం పేర్కొంది. తప్పుగా ఫ్యూయల్ ట్యాంక్ సెలెక్ట్ చేయడం, అంటే పనిచేస్తున్న ఇంజిన్‌కు ఇంధనానికి ఇంధనం ఆపివేయడం జరిగి ఉండొచ్చని పేర్కొంది. ఇంధన గేజ్ ఈ విధంగా పైలట్‌ను తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. ఇంధన వాల్వ్ లేదా సంబంధిత లైన్లలో మెకానికల్ లోపం ఏర్పడినప్పుడు కూడా ఇంధన సరఫరా ఆగిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ, నిజంగానే ఫ్యూయల్ స్విచ్‌ను పొరపాటున ఆఫ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేదా అనే విషయం దర్యాప్తులోనే బయటపడాల్సి ఉంది.