Gurugram Case: హర్యానాకు చెందిన స్టేట్ లెవల్ టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. గుర్‌గావ్‌లోని తమ నివాసంలో తుపాకీతో కూతుర్ని ఆయన కాల్చి చంపాడు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో జరిగిన ఈ దారుణంపై హత్య కేసు నమోదు చేసి ప్రశ్నించిన పోలీసులకు నిందితుడు దీపక్ యాదవ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.
అందుకే చంపేశా..
కూతుర్ని తాను హత్య చేసినట్టుగా నిందితుడు దీపక్ యాదవ్ దర్యాప్తులో అంగీకరించాడు. ‘‘సమాజంలో నా చుట్టపక్కల వ్యక్తులు నన్ను అవహేళన చేస్తూ అన్న మాటలు తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. అందుకే హత్య చేశాను. కూతురి సంపాదనపై ఆధారపడి బతుకుతున్నాడంటూ గ్రామస్థులు చెప్పుకుంటున్నారు. రాధిక యాదవ్ కారణంగా ఊరి వాళ్ల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వజీరాబాద్ అనే మా సొంతూరికి వెళ్లినప్పుడు నాపై గ్రామస్థులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలే ఈ హత్యకు కారణం’’ అని దీపక్ అసలు కారణాలను పంచుకున్నాడు. ‘‘నీ కూతురు టెన్నిస్ అకాడమీ నడుపుతోంది. నువ్వేమీ చేయకుండా ఆమె డబ్బుతో బతుకుతున్నావంటూ వాళ్లు చెప్పుకుంటున్నారు’’ అని చెప్పాడు.
Read Also- BCCI – ACC meeting: పాక్‌కు బీసీసీఐ ఝలక్.. ఏసీసీ సమావేశం బహిష్కరణ.. కారణాలివే!
వంటగదిలో ఉన్నప్పుడు కాల్చేశా..
రాధిక వంటగదిలో వంట చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్చానని నిందితుడు దీపక్ యాదవ్ ఒప్పుకున్నాడు. తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకెళ్లి వెనుక నుంచి మూడు సార్లు కాల్చేశానని పోలీసులకు వివరించాడు. ‘‘ భుజం గాయం కారణంగా నా కూతురు కొంతకాలం క్రితమే టెన్నిస్ ఆడడం మానేసింది. ఆ తర్వాత అకాడమీ ప్రారంభించి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తోంది. నేను పాలు తీసుకొని మా గ్రామానికి వెళ్లేవాడిని. అక్కడ వాళ్లంతా నన్ను, కూతురు సంపాదన మీద బతుకుతున్నావ్ అని మాట్లాడేవాళ్లు. కొందరు రాధిక యాదవ్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆరోపణలు కూడా చేసేవారు. ఆ వ్యాఖ్యల పట్ల చాలా కలవరపడ్డాను. నాలో నేను మదనపడ్డాను. దీంతో, టెన్నిస్ అకాడమీ మూసివేయాలంటూ రాధికను కోరాను. కానీ ఆమె వినలేదు. మాట వినకపోవడం నా గౌరవాన్ని దెబ్బతీసింది. మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఈ క్రమంలోనే గురువారం ఉదయం వంట చేస్తున్న రాధికపై తుపాకీతో మూడు రౌండ్లు కాల్చాను’’ అని దీపక్ యాదవ్ అంతా వివరించాడు.
Read Also- Starlink internet: ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్.. నెలకు రూ.840 మాత్రమే!
అకాడమీ ప్రారంభించిందనే కోపం..
రాధికా యాదవ్ దురదృష్టవశాత్తూ భుజం గాయానికి గురవ్వడంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. ఆటకు వీడ్కోలు పలికిన ఆమె చిన్న పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చే ఒక టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది. అయితే, రాధిక టెన్నిస్ అకాడమీని స్థాపించడం ఆమె తండ్రి దీపక్ యాదవ్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయమై ఆమెపై చాలాకాలంగా కోపంగా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
గురువారం ఏం జరిగింది?
ఇంట్లోని మొదటి అంతస్తులో హత్య జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. నిందితుడు దీపక్ యాదవ్‌తో పాటు అతడి భార్య మంజు యాదవ్, రాధిక ఉన్నారు. కొడుకు ధీరజ్ ఒక పని మీద బయటకు వెళ్లాడు. అనారోగ్యంతో ఉన్న రాధిక తల్లి మంజు యాదవ్ వేరొక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే దీపక్ యాదవ్ హత్యకు పాల్పడ్డాడు. తుపాకీ కాల్పుల శబ్దాలు మాత్రమే తాను విన్నానని, తన భర్త ఎందుకు ఈ ఘోరం చేశాడో తనకు తెలియదని మంజు చెప్పారు. రాధిక అన్నయ్య ధీరజ్ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు దీపక్ యాదవ్, అతడి సోదరుడు కుల్దీప్ యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.