Starlink internet: దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన స్టార్ లింక్‌కు (Starlink) మార్గం సుగమమైంది. భారత్‌లో కమర్షియల్‌గా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన అనుమతులను ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (IN-SPACe) తాజాగా మంజూరు చేసింది. దీని కాల వ్యవధి ఐదేళ్ల పాటు ఉంటుందని వెల్లడించింది. అయితే 2022 నుంచి కమర్షియల్ లైసెన్స్ పొందేందుకు ఎందురుచూస్తున్న స్టార్ లింక్ సంస్థకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది.
2 నెలల్లో సేవలు
స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ అయిన స్టార్‌లింక్ (Star Link) ఇప్పటికే 100కు పైగా దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను (Internet Services) అందిస్తోంది. ఇది సంప్రదాయ శాటిలైట్ సేవల మాదిరిగా సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడకుండా లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. భూమికి 550 కిలోమీటర్లు ఎత్తులో ఉండే కక్ష్యలో స్టార్‌లింక్‌కు చెందిన 6,000 శాటిలైట్లు తిరుగుతూ ఇంటర్నెట్ అందిస్తాయి. తాజాగా భారత్ లో కమర్షియల్‌గా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు స్టార్ లింక్ కు అనుమతి లభించిన నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో (సెప్టెంబర్ 2025 నాటికి) స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
స్టార్ లింక్ ధరలు, ప్లాన్స్!
భారత్ లో స్టార్ లింక్ ఇంటర్నేట్ సేవలు అందుబాటులోకి వస్తే ధరలు.. ఏ విధంగా ఉండొచ్చని కొన్ని నివేదికలు అంచనా వేశాయి. ముందుగా స్టార్ లింక్ ఇంటర్నెట్ ను పొందేందుకు ఒక సాటిలైట్ డిష్, వై-ఫై రూటర్, స్టాండ్, కేబుల్స్, పవర్ అడాప్టర్‌తో కూడిన స్టార్‌లింక్ కిట్‌ను కొనుగోలు చేయాలి. ఈ కిట్ ధర భారత్ లో రూ. 33,000 (సుమారు 390 డాలర్లు)గా ఉంటుందని అంచనా. వాస్తవానికి ఇతర దేశాల్లో ఈ కిట్ ధర 250-380 డాలర్ల (రూ.21,300-రూ.32,400) మధ్య ఉండటం గమనార్హం. అయితే ఒకసారి ఈ కిట్ కొనుగోలు చేస్తే మళ్లీ కొనాల్సిన అవసరం ఉండదు.
నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర
స్టార్ లింక్ ప్రారంభంలో ప్రమోషనల్ ఆఫర్లు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో నెలవారీ అపరిమిత డేటా ప్లాన్‌లు రూ.840 ($10) కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండవచ్చు. అంతేకాదు ఒకనెల ఉచిత ట్రెయిల్ కూడా అందించే అవకాశమున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. సాధారణ రోజుల్లో నెలవారి ధరలు రూ.3,000 నుండి రూ.4,200 మధ్య ఉంటాయని అంచనా. కొన్ని నివేదికల ప్రకారం ప్రాంతం, ప్లాన్ ఆధారంగా ధరలు రూ.3,000 నుండి రూ.7,000 వరకు ఉండవచ్చు.
స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం
స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం 25 Mbps నుండి 220 Mbps వరకు ఉండనుంది. అప్‌లోడ్ వేగం 5 Mbps నుండి 20 Mbps మధ్య ఉంటుంది. స్టార్ లింక్ తన ఇంటర్నెట్ సేవలకు ఎర్త్ ఆర్బిట్ (LEO) సాటిలైట్‌లను ఉపయోగిస్తుంది. ఇవి సాంప్రదాయ సాటిలైట్‌ల కంటే భూమికి దగ్గరగా ఉంటాయి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం చాలా ఎక్కువగా ఉండనుంది. ఫలితంగా యూజర్లు మెరుగైన వీడియో కాల్స్, ఆన్ లైన్ గేమింగ్, స్ట్రీమింగ్ పొందవచ్చు. ప్రస్తుతం స్టార్ లింక్ 6000 శాటిలైట్లతో ఇంటర్నెట్ సేవలు అందిస్తుండగా.. దీనిని 2027 నాటికి 42,000కి విస్తరించాలని ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ (Space X) లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: BCCI – ACC meeting: పాక్‌కు బీసీసీఐ ఝలక్.. ఏసీసీ సమావేశం బహిష్కరణ.. కారణాలివే!
దేశంలో స్టార్‌లింక్ ప్రయోజనాలు
స్టార్‌లింక్ భారత్‌కు రావడం వల్ల పలు ప్రయోజానాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రిమోట్ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలను అందిచడంలో ఇదొక గేమ్ ఛేంజర్ కానుందని స్పష్టం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ప్రభుత్వ ఆన్లైన్ సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా అందించేందుకు వీలవుతుందని చెబుతున్నారు. అంతేకాదు భారత్ లో పర్వత ప్రాంతాలైన ఈశాన్య రాష్ట్రాల్లో స్టార్ లింక్ తో మెరుగైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఘండ్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర లాంటి అడవులు ఉన్న రాష్ట్రాలతో పాటు మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాజస్థాన్ వంటి వాటికి ఈ స్టార్‌లింక్ సేవలు ప్రయోజకనరంగా ఉంటాయని నిపుణులు వివరించారు.