Viral News: ‘ప్రతి కుక్కకీ ఒక రోజు వస్తుంది’ అనే మాటను ఎలాంటి దీనస్థితిలో ఉన్నవారికైనా జీవితంలో ఒక మంచి రోజు వస్తుందనే సందర్భంలో వాడతారు. అప్రతిష్ట పాలైనవారి జీవితాలు సైతం మారతాయని చెప్పడం ఈ మాట వెనుక ఉద్దేశం. కష్టాల్లో ఉన్న మనుషుల బతుకులు మారతాయో లేదో తెలియదు గానీ, బెంగళూరు మహానగరంలోని వీధి కుక్కల తలరాత మాత్రం మారిపోయింది. మనుషుల విషయంలో వాడే ‘ఆ ఒక రోజు’ వచ్చేసింది. బెంగళూరు వీధి కుక్కలు ఇకపై డైలీ చికెన్ రైస్, ఎగ్ రైస్, కూరగాయలతో కూడిన చక్కటి రుచికరమైన భోజనం చేయబోతున్నాయి. ఈ మేరకు బెంగళూరు నగర పాలక సంస్థ బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) నగరంలోని వీధి కుక్కల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకొని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చికెన్ రైస్, ఎగ్ రైస్, కూరగాయలతో కూడిన భోజనం అందించాలని నిర్ణయించింది.
600 గ్రాముల భోజనం.. ప్యూర్ వాటర్
బీబీఎంపీ ఆహ్వానించిన టెండర్ ప్రకారం, నగరంలోని 100 ప్రదేశాల్లో ప్రతి రోజు సుమారు 4,000 వీధి కుక్కలకు ఒక పూట భోజనం అందించనున్నారు. ఆహార కొరత ఉన్న ప్రాంతాల్లో ఈ స్కీమ్ ప్రత్యేకంగా అమలవుతుంది. టెండర్ నిబంధనల ప్రకారం, 600 గ్రాముల బరువు ఉండేలా వండిన బియ్యం, చికెన్ ముక్కలు, కూరగాయలు, హల్దీ కలిపి భోజనంగా అందిస్తారు. ప్రతి కుక్కకు కనీసం 750 కిలోక్యాలరీలు అందేలా ఈ ఆహారాన్ని సిద్ధం చేస్తారు. అంతేకాదు, భోజనంతో పాటు స్వచ్ఛమైన తాగునీటిని కూడా అందించనున్నారు. వీధి కుక్కల ఆకలి తీర్చడంతో పాటు వాటికి సంక్రమించే రోగాలను అరికట్టడం ఈ ప్రత్యేక పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్న ఈ పథకం, సోషల్ మీడియాలో నవ్వులు కూడా పూయిస్తోంది. వ్యంగ్య మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి.
Read Also- Viral Video: అయ్యోపాపం.. స్కూల్ పిల్లలకు పెద్ద కష్టమొచ్చింది!
కామెడీ పోస్టులు వైరల్
బీబీఎంపీ ప్రకటించిన కార్యక్రమంపై నెటిజన్లు హాస్యంతో కూడిన మీమ్స్ షేర్ చేస్తున్నారు. ట్విటర్‌లో ఓ యూజర్ స్పందిస్తూ, “ఒకప్పుడు బెంగళూరు నగరంలో నైతిక విలువలులేని కొందరు వ్యక్తులు కుక్క మాంసం వండి మనుషులకు వడ్డించేవారు. ఇప్పుడేమో.. కుక్కలకే చికెన్, ఎగ్ భోజనాలు పెడుతున్నారు!. ప్రతి కుక్కకీ ఓ రోజు రావడం అంటే ఇదే కదా!” అని వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి ఒక ఏఐ శునకం ఇమేజ్‌ను షేర్ చేసి, “చికెన్ రైస్, ఎగ్ రైస్ తిన్న తర్వాత జాకుజీలో (హాట్ వాటర్ బాత్) రిలాక్స్ అవుతున్న బెంగళూరు వీధి కుక్క!” అంటూ నవ్వించాడు. ‘‘“ఇంత మంచిగా ఆహారం పెడుతున్నారని వింటే దేశంలోని వీధి కుక్కలన్నీ బెంగళూరుకు వచ్చేస్తాయి. వీటికి భాషపరమైన సమస్యా ఏమీ ఉండదు కదా!” అంటూ మరో నెటిజన్ నవ్వుల పూవులు పూయించాడు. దేశంలోని వీధి కుక్కల్లో సగం ఇప్పటికే బెంగళూరులో ఉన్నాయి కదా! అని ఒక యూజర్ పేర్కొన్నాడు.
Read Also- Operation Baam: బలూచిస్థాన్‌లో ఆపరేషన్ బామ్.. పాక్‌లో అల్లకల్లోలం
ప్రముఖుల అభినందనలు
సోషల్ మీడియాలో మీమ్స్ విషయం పక్కనపెడితే, బీబీఎంపీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లుకురుస్తోంది. జంతు హక్కుల ఉద్యమకారులు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య బాలాల్ జైన్ స్పందిస్తూ, “భారతదేశంలో కనిపించే దేశీ శునకాలు బలమైనవే. వీధుల్లో కాకుండా, ఇళ్లలో ఉండాల్సినవి. బీబీఎంపీ చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా హృదయాన్ని హత్తుకునే విషయం. దేశీ కుక్కలను దత్తత తీసుకోండి” అని వ్యాఖ్యానించారు.
Bengaluru dog relaxing in a Jacuzzi after having tummy full of chicken rice & egg rice 🥳🥳🥳 pic.twitter.com/1gOIfrrK5A
— Chethan Subbaiah (@chethansubbaiah) July 11, 2025