BCCI – ACC meeting: పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కు ఆపరేషన్ సిందూర్ తో భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. అటు ద్వైపాక్షికంగా ఆ దేశంపై కఠిన విధానాలను అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే సిందూ జలాల ఒప్పందం నుంచి తప్పుకొని.. పాక్ కు గట్టి షాక్ ఇచ్చింది భారత్. తాజాగా బీసీసీఐ సైతం పాక్ కు తమదైన శైలిలో ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)ను బహిష్కరించినట్లు బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మెుహ్సిన్ నక్వీ.. ఏసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న నేపథ్యంలో అతడ్ని ఇరుకున పెట్టేలా బీసీసీఐ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏసీసీ ఛైర్మన్‌గా పాక్ మంత్రి
ఆసియా కప్ 2025 నిర్వహణ, మ్యాచ్ ల షెడ్యూల్ ఖరారు వంటి కీలకమైన అంశాలపై చర్చించేందుకు ఈ నెల చివరి వారంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (Asia Cricket Council) సమావేశం కానుంది. ఏసీసీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ .. ఢాకాలో ఏర్పాటు చేయడం బీసీసీఐకి ఏమాత్రం నచ్చలేదు. రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న ఢాకాలో ఏసీసీ భేటి ఏర్పాటు చేయడాన్ని బీసీసీఐ తప్పుబడుతోంది. పైగా ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ.. పాక్ క్రికెట్ బోర్డ్ కు సైతం చీఫ్ గా ఉన్నారు. అంతేకాదు పాక్ ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్న వ్యక్తి.. ఏసీసీ ఛైర్మన్ గా ఉండటం ఏంటని బీసీసీఐ తొలి నుంచి ప్రశ్నిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఏసీసీ భేటిని ఢాకా కాకుండా దుబాయి వంటి తటస్థ వేదికలపై ఏర్పాటు చేయాలని బీసీసీఐతో పాటు శ్రీలంక క్రికెట్ బోర్డ్.. ఏసీసీని కోరింది. కానీ ఇందుకు ఏసీసీ ఒప్పుకోలేదు. ప్రస్తుతం పాక్ – బంగ్లా టీ 20 సిరీస్ ఢాకాలో జరుగుతున్న నేపథ్యంలో భేటీ కూడా అక్కడే ఏసీసీ తెగేసి చెప్పింది.
బీసీసీఐ అధికారి ఏమన్నారంటే?
తమ సూచనను ఏసీసీ బేఖాతరు చేసిన నేపథ్యంలో.. ఢాకాలో జరిగే భేటికి తమ ప్రతినిధులు హాజరుకారని బీసీసీఐ (BCCI) తేల్చి చెప్పింది. ‘ఏసీసీలోని ప్రతి ఒక్కరికి ఉపఖండంలోని భౌగోళిక రాజకీయ పరిస్థితి గురించి తెలుసు. అయినప్పటికీ ఏసీసీ ఇంత ముఖ్యమైన సమావేశాన్ని ఢాకాలో నిర్వహంచడం చాలా అసహ్యకరం’ అంటూ ఓ బీసీసీఐ అధికారి ఉటంకించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఒకవేళ ఢాకా నుంచి తటస్థ ప్రాంతానికి ఏసీసీ సమావేశాన్ని మార్చకపోతే.. బీసీసీఐ టోర్నమెంటు నుంచే వైదొలిగే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆసియా కప్ 2025 ను బీసీసీఐ గనుక బహిష్కరిస్తే టోర్నీ మెుత్తం ఆర్థికంగా దెబ్బతినే అవకాశముందని ఏసీసీకి సైతం తెలుసు. ఈ నేపథ్యంలో ఏసీసీ వేదికను మార్చుకోవాలన్న బీసీసీఐ పంతానికి ఏసీసీ తలొగ్గుతుందో లేదో చూడాలి.
Also Read: Shruti Haasan: రజనీ కాంత్ అలా చేస్తారని అనుకోలేదు.. శృతి హాసన్ స్టన్నింగ్ కామెంట్స్!
ఆతిథ్య హక్కులు భారత్‌వే
కాదా షెడ్యూల్ ప్రకారం ఈసారి ఆసియా కప్ సెప్టెంబర్ లో జరగాలి. ఈ టోర్నీ ఆతిథ్య హక్కులను భారత్ కలిగి ఉంది. ఆసియా కప్ భారత్ నిర్వహించాల్సి వస్తే.. పాక్ ఆటగాళ్లను దేశంలోకి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని తెలుస్తోంది. తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్ నిర్వహించేలా ఏసీసీపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. గతంలో ఛాంపియన్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా భారత్ మాత్రం ఆ దేశానికి వెళ్లి ఆడేందుకు ససేమీరా అన్నది. దీంతో భారత్ ఆడే మ్యాచుల వరకూ దుబాయిలో నిర్వహించారు.