Suspense Case: దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరఖండ్‌లలో క్యాబ్ డ్రైవర్ల మిస్సింగ్ కేసుల దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆదివారం ఇండియా గేట్‌కు సమీపంలో అనుమానిత సీరియల్ కిల్లర్ అజయ్ లాంబాను అరెస్టు చేశారు. దశాబ్ద కాలంగా అరెస్టు నుంచి అతడు తప్పించుకు తిరుగుతున్నాడు. 24 ఏళ్లకుపైగా నేర చరిత్ర ఉంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్ వ్యాప్తంగా పలువురు క్యాబ్ డ్రైవర్ల దారుణ హత్యల వెనుకవున్న ముఠాకు అజయ్ లాంబా నాయకత్వం వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. లాంబా గత 10 ఏళ్లుగా నేపాల్‌లో దాక్కున్నాడని పోలీసులు తెలిపారు. అతడి అనుచరులలో ఒకడైన ధీరేంద్ర దిలీప్ పాండేను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, ముఠాలోని మరో సభ్యుడు ధీరజ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. దర్యాప్తు జరుగుతోందని, ప్రస్తుతం అజయ్ లాంబాను విచారిస్తున్నట్టు పోలీసు అధికారులు వివరించారు. నాలుగు హత్య కేసులు, పలు దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నాడని వివరించారు.
కస్టమర్లుగా నటిస్తూ..
లాంబా, అతడి ముగ్గురు సహచరులు ప్యాసింజర్లు మాదిరిగా నటిస్తూ టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకునేవారని పోలీసులు వివరించారు. రైడ్‌లు బుక్ చేసుకున్న తర్వాత అనుమానం కలగకుండా సుదూర ప్రాంతాలకు వచ్చే డ్రైవర్లను ఉత్తరాఖండ్ కొండలలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. డ్రైవర్లు స్పృహ కోల్పోయేలా మత్తు ఇచ్చి, గొంతు కోసి చంపేసేవారని వెల్లడించారు. మృతదేహాలను అక్కడే లోతైన లోయలలో పడేసేవారని పోలీసు వర్గాలు తెలిపాయి. కార్లను నేపాల్‌లోకి అక్రమంగా రవాణా చేసి అక్కడ అమ్ముకునేవారని వెల్లడించారు.
Read Also- Viral News: డ్యూటీ చేయకుండానే 12 ఏళ్లుగా కానిస్టేబుల్‌కు శాలరీ
ఒక క్యాబ్ డ్రైవర్ మృతదేహం బయటపడడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి. మరో ముగ్గురు క్యాబ్ డ్రైవర్ల మృతదేహాలు ఇంకా దొరకలేదు. అంతేకాదు, గత కొన్నేళ్లుగా అనేక మంది క్యాబ్ డ్రైవర్ల అదృశ్యం వెనుక ఈ ముఠా హస్తం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడ లాంబాపై క్యాబ్ డ్రైవర్లను హత్య చేయడంతో పాటు పలు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, ఒడిశాలలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలకు పాల్పడిన చరిత్ర ఉంది. 2001 నుంచి అనేక నేర కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడని చెబుతున్నారు.
డీసీపీ ఏమన్నారంటే..
‘‘నిందితుడు లాంబా దొంగ, హంతకుడు. 2001లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని 4 దారుణమైన దోపిడీ-హత్యలకు పాల్గొన్నాడు. తన సహచరులతో కలిసి టాక్సీలను అద్దెకు మాట్లాడుకునేవాడు. మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి డ్రైవర్లను హత్య చేసేవాడు. పర్వత ప్రాంతాలలో మృతదేహాలను పడేసేవాడు’’ అని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదిత్య గౌతమ్ ప్రకటించారు. అజయ్ లాంబా, అతడి ముఠా మరిన్ని హత్యలు చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాంబా ముఠా సభ్యుల్లో ఇద్దరు గతంలోనే అరెస్టయ్యారని వివరించారు. కాగా, లాంబా ప్రస్తుత వయసు 48 ఏళ్లు. ఢిల్లీకి చెందినవాడని, 6వ తరగతి వరకు చదువుకొని మానేశాడని వివరించారు. చదువు మానేశాక ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి వెళ్లి, క్యాబ్ డ్రైవర్ల భయంకర హత్యలు చేసిన ధీరేంద్ర, దిలీప్ నేగి అనే హంతకులతో సంబంధాలు పెట్టుకున్నాడని వివరించారు.
Read Also- F-35B Jet: కేరళలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35బీ విషయంలో కీలక పరిణామం