Postman: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో విల్లా, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వచ్చినప్పటి నుంచి మనుషులంటే విలువే లేకుండా పోతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తపాలా శాఖ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు పోస్టల్ లో వచ్చే వస్తువులు, ఆర్టికల్స్ అందించేందుకు అడ్రస్ ప్రకారం వస్తున్న పోస్ట్ మ్యాన్(Postan Man) లను కొన్ని విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు కనీసం లోనికి కూడా అనుమతించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి కొన్ని చోట్ల పోస్ట్ లో వచ్చిన ఆర్టికల్స్ బట్వారా చేసేందుకు వచ్చిన పోస్ట్ మ్యాన్, ఇతర సిబ్బంది వాహానాలను పార్కింగ్ చేసేందుకు కూడా విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల సెక్యూరిటీ సిబ్బంది అనుమతించటం లేదని తెలిసింది. కొన్ని సందర్భాల్లో సెక్యూరిటీ సిబ్బందికి పోస్టల్ స్టాఫ్ కు గొడవలు కూడా జరిగినట్లు సమాచారం. పోస్టల్‌లో వచ్చిన ఆర్టికల్స్, పుస్తకాలు(Books), ఇతర డాక్యుమెంట్లను బట్వారా చేసేందుకు వెళ్లిన పోస్ట్ మ్యాన్‌లను విల్లా, గేటెడ్ కమ్యూనిటీల సెక్యూరిటీ గార్డులు కనీసం లోనికి అనుమతించకపోవటం వంటి చేదు అనుభవాలను కొందలు పోస్ట్ మ్యాన్లు ఎదురుకుంటున్నారు.
సెక్యూరిటీ గార్డుల ఓవర్ యాక్షన్
ఇతర సిబ్బంది ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావటంతో తెలంగాణ(Telangana) సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్‌కు లేఖ రాసి, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో పోస్ట్ మ్యాన్‌లు, ఇతర సిబ్బందిని అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్టల్ సిబ్బందియే గాక, తమకు తమ పేర్లపై తన చిరునామాపై రావాల్సిన ఆర్టికల్స్ ఇంకా ఎందుకు అందజేయలేదని కొందరు గ్రహీతలు కూడా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ను ఆశ్రయించటంతో సెక్యూరిటీ గార్డుల ఓవర్ యాక్షన్ బయట పడినట్లు సమాచారం. పోస్ట్ మ్యాన్‌ను లోనికి అనుమతించినా, ఆయన తెచ్చిన వాహానం పార్కింగ్ విషయంలోనూ గొడవలు జరిగిన సందర్భాలున్నట్లు సమాచారం. సెక్యూరిటీ గార్డులకు పలు విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు పోస్ట్ మ్యాన్ ను అనుమతించాలని పలు సార్లు సూచించినా ఫలితం దక్కకపోవటంతో ఈ సమస్యకు జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ద్వారా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులను సమన్వయం చేసుకుని సమస్యకు పరిష్కారం సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: MP Crime: ఇదేం దిక్కుమాలిన కేసు.. ప్రియుడి కోసం అమ్మాయిగా మారిన అబ్బాయి.. చివరికి!
కమిషనర్ సానుకూల స్పందన
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) ఇందుకు సంబంధించి ఓ సర్క్యులర్ ను జారీ చేశారు. విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసముంటున్న వారికి వారి పేర్లు, చిరునామాలపై వచ్చిన పోస్టల్ ఆర్టికల్స్‌ను అందించేలా, స్వీకరించినట్లు గ్రహీత సంతకం స్వీకరించేందుకు పోస్ట్ మ్యాన్‌లను లోనికి రానివ్వాలని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు సూచించారు. ఈ సర్క్యులర్ లో కమిషనర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. పోస్ట్ మ్యాన్ లను వారు తెచ్చిన ఆర్టికల్స్ సంబంధిత వ్యక్తులకు అందించేందుకు వీలుగా లోనికి అనుమతించేలా చూడాలని కమిషనర్ సూచించారు. దీనికి తోడు ఎక్కువ అంతస్తులున్న గేటెడ్ కమ్యూనిటీ భవనాల్లోకి చిరునామాపై ఆర్టికల్స్ అందించేందుకు వీలుగా ప్యాసెంజర్ల లిఫ్టులో పోస్ట్ మ్యాన్‌ను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని వెల్ఫేర్ అసోసియేషన్లకు కమిషనర్ సూచించారు.
పోస్టాఫీసు యాక్టు ప్రకారం
పోస్టాఫీసు యాక్టు ప్రకారం విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోకి ఓ పద్దతి ప్రకారం పోస్ట్ మ్యాన్ లను అనుమతించాలని కూడా కమిషనర్ తన సర్య్యులర్ లో పేర్కొన్నారు. పోస్టాఫీసు యాక్టు-2023 ప్రకారం పోస్ట్ మ్యాన్ ను అనుమతించటంతో పాటు ఆయన వాహానానికి పార్కింగ్ సౌకర్యాన్ని తమ ప్రెమిసెస్ లో కల్పించాలని కమిషనర్ సూచించారు. సర్క్యులర్ లో సూచించిన విషయాల అమలుకు జోనల్ కమిషనర్లు, సర్కిళ్లలోని డిప్యూటీ కమిషనర్లు తప్పకుండా అమలు చేయాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు వరుసగా ఆటంకాలు కల్గిస్తే భారతీయ న్యాయ సహిత చట్టం 2023 సెక్షన్ 221 ప్రకారం కేసు నమోదు చేసి, శిక్షించే ప్రొవిజిన్ కూడా ఉన్నట్లు కమిషనర్ సూచించారు.
Also Read: Hard Time for Farmers: పత్తి రైతుల ఎదురుచూపులు.. నగదు చేరేదెప్పుడు?