Medchal News: మేడ్చల్ పారిశ్రామిక వాడ అక్రమ కెమికల్ గోదాములతో నిండిపోయింది. మున్సిపల్ పరిధిలో అడ్డు అదుపు లేకుండా గోదాములో ప్రమాదకర రసాయానాలను నిల్వ ఉంచుతున్నారు. ఈ రసాయనాలు(Chemicals) ఎలాంటి ప్రాసెసింగ్ చేయకుండానే బయటకు వదలడం వల్ల చుట్టుపక్కల ఉన్న తమ పంట పొలాలు(Crop fields) దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాడి పశువులు మేత మేయడానికి వచ్చి ప్రాణాంతకమైన కలుషిత నీరు తాగి మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలుషితమౌతున్న భూగర్బ జలాలు
మేడ్చల్(Medchal) పారిశ్రామిక వాడలో పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ కెమికల్ దందా వల్ల భూగర్బ జలాలు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మేడ్చల్ పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పరిశ్రమలలో నుంచి వెలువడే వ్యర్ధ జలాలు, కెమికల్స్‌ను చెరువులలో, కాలువలలో వదలడం వల్ల నీరు కలుషితమై వాటిని తాగే చేపలు, పశువులు(Cattle) మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయని రైతులు చెపుతున్నారు. గోదాముల్లోని రసాయననాలు వర్షపు నీటితో కొట్టుకువచ్చి చెరువుల్లో, కాలువల్లో, వాగుల్లో కలిసిపోతున్నాయి. దీనిపై రైతులు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కెమికల్ దందాను అడ్డుకోకుంటే మేడ్చల్(Medchala) పట్టణంలోని భూగర్బ జలాలు పూర్తిగా కలిషితమై మానవ నివాసానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ ప్రేమికులు సైతం హెచ్చరిస్తున్నారు.
Also Read: GHMC RV Karnan: ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్‌లో అక్రమాలకు చెక్!
పట్టించుకొని అధికారులు
అధికారుల కనుసన్నల్లోనే మేడ్చల్ పారిశ్రామిక వాడలో అక్రమ కెమికల్ గోదాముల దందా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా గోదాంలో రసాయనాలను నిల్వ ఉంచడం వెనుక అధికారుల హస్తం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి నామా మాత్రపు చర్యలు తీసుకొని తరువాత మళ్లీ షరామామూలే అవుతోందని విమర్శిస్తున్నారు. ఆ తర్వాత కెమికల్ వ్యాపారాన్ని యథావిధిగా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రాణ నష్టం జరగక ముందే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రసాయనాలు నిల్వ ఉంచితే కఠిన చర్యలు: ఈఈ రాజేందర్
పంట పొలాల్లో రసాయనిక వ్యర్థాలను వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈఈ రాజేందర్ అన్నారు. అక్రమంగా రసాయనాలను గోదాంలో నిల్వ ఉంచితే తమ దృష్టికి తేవాలని రాజేందర్ కోరారు. పర్యావరణాన్ని కలుషితం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read: Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే కొంప కొల్లేరే.. ఇది తెలిశాక జన్మలో జోలికెళ్లరు!