Earth: మన భూగ్రహ భ్రమణంలో అనూహ్య మార్పు సంభవిస్తోంది. భూభ్రమణ వేగం (భూమి తన చుట్టూ తాను తిరగడం) సాధారణ స్థాయి కంటే స్వల్పంగా పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామంతో ఒక రోజుకు ఉండే నిర్దిష్ట సమయాన్ని తగ్గిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మిల్లీసెకన్‌లో కొన్ని వంతుల మేర సమయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం చాలా సూక్ష్మంగానే అనిపించవచ్చు. కానీ, శాస్త్రీయంగా చూస్తే చాలా కీలక పరిణామం. రోజువారీ దైనందిన జీవితాలను ఏమాత్రం ప్రభావితం చేయకపోవచ్చు. కానీ, ప్రపంచ సమయపాలన వ్యవస్థలకు సంక్లిష్టమైన చిక్కులు తెచ్చిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, భూమి సాధారణం కంటే ఎక్కువ వేగంతో తిరిగే ట్రెండ్ 2020లోనే ప్రారంభమైంది. ఇదే ధోరణి కొనసాగితే 2029 నాటికి లీప్ సెకండ్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. రోజు సమయం తగ్గిపోవడమంటే గంటలు లేదా నిమిషాలే అక్కర్లేదు. శాస్త్రవేత్తల దృష్టిలో మిల్లీసెకన్ల సమయం తగ్గుదలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాగా, భూభ్రమణంలో నమోదవుతున్నఈ సూక్ష్మస్థాయి మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో కొలిచేందుకు ‘అటామిక్ క్లాక్స్’ను శాస్త్రవేత్తలు ఉపయోగిస్తుంటారు. 2020 నుంచి భూమి రోజు సమయం (LOD (Length of Day)) క్రమంగా తగ్గిపోవడాన్ని ఈ గడియారాలు రికార్డు చేస్తున్నాయి.
Read Also- Rishab Pant: సెన్సేషనల్ రికార్డ్ సాధించిన పంత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్!
భూభ్రమణంలో పెరిగిన వేగం స్వల్పమే అయినప్పటికీ, కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ను(UTC) సర్దుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చని ఖగోళ నిపుణుల వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రోజువారీ సమయం తగ్గుదల ట్రెండ్ 2020లో మొదలై, 2025 వరకు కొనసాగింది. ఈ ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే, చరిత్రలో మొట్టమొదటిసారి 2029లో భూమి భ్రమణంతో ‘అటామిక్ క్లాక్’ను సమన్వయ పరిచేందుకు ‘లీప్ సెకన్’ను తీసివేయాల్సి రావొచ్చని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. గతంలో సెకన్లు కలుపగా, తొలిసారి తీసివేయాల్సిన పరిస్థితి రావొచ్చని పేర్కొంటున్నారు. భూమ్రణ వేగం పెరగడానికి నిర్ధిష్ట కారణాన్ని శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు. అయితే, భూపొరల్లో మార్పులు, భూద్రవ కేంద్రంలో మార్పులు, భూకోణంలో హెచ్చుతగ్గులు వంటివి కారణాలు కావొచ్చని భావిస్తున్నారు.
మారిపోతున్న రోజు వ్యవధి
భూమిపై ఒక రోజు సమయం 86,400 సెకన్లు లేదా 24 గంటలు ఉంటుంది. అయితే, ఇదే స్థిరత్వం అని మాత్రం చెప్పలేం. మిలియన్ల సంవత్సరాల వ్యవధిలో భూభ్రమణం క్రమంగా నెమ్మదించింది. గురుత్వాకర్షణ పరస్పర చర్యలు, ఇంటర్నల్ కోర్ డైనమిక్స్, చంద్రుడి ఆటుపోట్లు వంటి సహజ ప్రభావాల కారణంగా భూమి భ్రమణం క్రమంగా మందగించింది. ఉదాహరణకు, డైనోసార్ల యుగంలో ఒక రోజు వ్యవధి 23 గంటలుగా ఉండేది. అంతక్రితం రోజుకు 25 గంటలు వరకు ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రస్తుతమున్న 24 గంటల సమయానికి చేరుకోవడానికి సుమారుగా 200 మిలియన్ సంవత్సరాలకు పైగా పట్టి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.
Read Also- Weight Loss: బరువు తగ్గాలనుకునేవారికి కొత్త ట్రిక్.. పొట్ట మటుమాయం!
2024లో అతితక్కువ రోజులివే
‘అటామిక్ క్లాక్’ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించిన దాని ప్రకారం, 2024 జూలై 5న రోజు సమయం అతి తక్కువగా నమోదయింది. ఆ రోజున భూగ్రహం ప్రామాణిక 24 గంటల కంటే 1.66 మిల్లీసెకన్లు వేగంగా సంపూర్ణ భ్రమణాన్ని పూర్తి చేసింది.
2024లో జూలై 9న 1.30 మిల్లీసెకన్లు, జూలై 22న 1.38 మిల్లీసెకన్లు, ఆగస్టు 5న 1.51 మిల్లీసెకన్ల ముందుగానే రోజు పూర్తయింది. 2024లో నమోదయిన పొట్టి రోజు ఇవి. భూభ్రమణ వేగం పెరిగినట్టుగా ఈ ట్రెండ్ స్పష్టం చేస్తోంది. కాబట్టి, 2025లో కూడా ఇదే విధంగా తక్కువ సమయంలోనే పగటి సమయం పూర్తవ్వొచ్చని భావిస్తున్నారు.
కాగా, భూమి క్రమరహిత భ్రమణంతో సమం చేయడానికి ‘అటామిక్ క్లాక్’ నుంచి ఒక సెకన్‌ను సర్దుబాటు చేయడాన్ని లీప్ సెకండ్ అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాంప్రదాయకంగా అయితే, లీప్ సెకన్లను గడియారానికి కలుపుతారు, తొలగించరు. అయితే, భూమి వేగం పెరుగుతోంది కాబట్టి, అందుకు తగ్గట్టుగా ‘అటామిక్ క్లాక్’ను సర్దుబాటు చేసేందుకు తొలిసారి తీసివేయాల్సిన అవసరం రావొచ్చంటున్నారు.