Udhav, Raj Thakrey
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Uddhav-Raj: ఒక్కటైన థాక్రే బ్రదర్స్.. 20 ఏళ్లక్రితం అసలు ఎందుకు విడిపోయారో తెలుసా?

ddhav-Raj: వారిద్దరూ అన్నదమ్ముళ్ల పిల్లలు. చిన్నప్పటి నుంచి కలిసి మెలసి పెరిగారు. ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ మహారాష్ట్ర’గా పేరొందిన బాల్‌థాక్రే స్థాపించిన శివసేన పార్టీలో ఇరువురూ (ddhav-Raj) రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. చివరిసారిగా 2005లో ఒక వేదికపై కనిపించిన వీరిద్దరూ.. ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు (2025 జులై 5) కలిశారు. వారిద్దరే శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన పార్టీ వ్యవస్థాపకుడు రాజ్ థాక్రే. మహారాష్ట్ర రాజకీయాల్లో శనివారం అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకొచ్చిన త్రిభాషా విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, ఆందోళనల నడుమ ప్రతిపాదిత విధాన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ బీజేపీ సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో ‘అవాజ్‌ మరాథిచా’ పేరిట శివసేన, మహారాష్ట్ర నవ్ నిర్మాణ సేన పార్టీలు శనివారం భారీ వియోజత్సవాన్ని నిర్వహించాయి. మరాఠా ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్ధవ్ థాక్రే, రాజ్‌థాక్రే ఏకంగా 20 ఏళ్ల తర్వాత ‘అవాజ్‌ మరాథిచా’ సభలో చేతులు కలిపారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీంతో, 2005లో విడిపోయిన అన్నదమ్ముళ్లు తిరిగి కలుసుకోవడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Read also- Mohammed Siraj: విమర్శకుల నోళ్లు మూయించాక సిరాజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

ఎందుకు విడిపోయారు?
2003-04 వరకు ఉద్ధవ్, రాజ్ థాక్రేలు కలిసి మెలసి ఉన్నారు. బాల్‌థాక్రే సారధ్యంలోని శివసేన పార్టీలో కలసి పనిచేశారు. అయితే, పార్టీలో రాజకీయ వారసత్వ అంశం వారిద్దరి మధ్య చిచ్చుపెట్టింది. బాల్‌థాక్రే 2003లో ఉద్ధవ్ థాక్రేని శివసేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించి బాధ్యతలు అప్పగించారు. తద్వారా బాల్‌థాక్రే తన రాజకీయ వారసుడిని ప్రకటించినట్టు అయింది. అయితే, అప్పటివరకు రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్న రాజ్‌ థాక్రేకు ఈ పరిణామం రుచించలేదు. ఆయన చాలా నొచ్చుకున్నారు. తనను  పక్కనపెట్టారంటూ అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత రెండేళ్లపాటు పార్టీలో వరుసగా కీలక పరిణామాలు జరిగాయి. రాజ్ థాక్రే అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆయన వర్గం వారు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా తమను పక్కనపెడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. కొన్నాళ్లపాటు పార్టీలో పరిస్థితులను నిశితంగా గమనించిన రాజ్‌థాక్రే చివరకు 2006లో శివసేన నుంచి బయటకొచ్చారు. అదే ఏడాది మార్చి 9న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీని స్థాపించారు. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందినవారు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఈ 20 ఏళ్ల వ్యవధిలో అన్నదమ్ముళ్లు ఇద్దరూ అనేక రాజకీయ వేదికలపై ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ఒక్కసారి కూడా వేదికను పంచుకోలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ పార్టీ పోటీ చేసి 13 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు.

Read also- HMDA: హెచ్‌ఎండీఏ సరికొత్త ప్రణాళికలు.. మూడు ప్రాంతాల్లో లేఅవుట్ల అభివృద్ధి!

బాల్‌ థాక్రే చేయలేనిది.. ఫడ్నవీస్ చేశారు
‘అవాజ్‌ మరాథిచా’ కార్యక్రమంలో రాజ్ థాక్రే మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను, సోదరుడు ఉద్ధవ్ 20 ఏళ్ల తర్వాత కలిశాం. బాలాసాహెబ్ థాక్రే చేయలేనిది, వేలాది మంది చేయలేకపోయినది, దేవేంద్ర ఫడ్నవీస్ చేయగలిగారు’’ అని ఇద్దరి కలయికపై వ్యాఖ్యానించారు. అనూహ్యంగా ఇద్దరినీ ఒకే వేదిక పైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ఐక్యత విషయంలో ఇద్దరమూ ఇకపై ఒక్కటిగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మరాఠాలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. ‘‘హిందీ భాషపై మాకు ఎప్పుడూ వ్యతిరేకత లేదు. కానీ, ఇతరులపై హిందీని బలవంతంగా రుద్దుతామంటే మాత్రం చూస్తూ ఊరుకోబోం. మా పూర్వీకులు మరాఠా సామాజ్రాన్ని చాలా ప్రాంతాలకు విస్తరించారు. కానీ, ఎప్పుడూ అక్కడి జనాలపై మరాఠీని రుద్దలేదు. కానీ, కేంద్రప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాలపై త్రిభాషా విధానాన్ని బలవంతంగా రుద్దాలని చూస్తోంది. ఇప్పటికీ సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులలో అన్ని ఉత్తర్వులు ఇంగ్లిష్‌లోనే ఉంటున్నాయి. ఏ రాష్ట్రంలో లేని త్రిభాషా విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలనుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో కేంద్రం ఇకనైనా తెలుసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో చాలామంది సినీనటులు, రాజకీయ నాయకులు ఇంగ్లీష్‌‌లోనే ఎడ్యుకేషన్ పూర్తి చేసినప్పటికీ, మాతృభాషలైన తెలుగు, తమిళం వంటి భాషల పట్ల ఎంతో గర్వంగా ఉంటారరని రాజ్‌థాక్రే ప్రస్తావించారు. మహారాష్ట్ర నేతలు, ప్రజలకు కూడా మరాఠపై అభిమానం ఉంటుందని ఆయన అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు సరిగ్గా విషయాలు నేర్చుకొనే అవకాశం లేదంటూ మోదీ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు