SR Nagar Police Station: ఏదైనా సమస్య ఉంటే పోలీసుల దగ్గరకు వెళ్తాం. కానీ, పోలీసులే సమస్యగా మారితే ఎవరికి చెప్పుకోవాలి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఫిర్యాదుదారులకే అన్యాయం జరుగుతున్నది. బాధితులు ఒక్కొక్కరుగా మీడియాను సంప్రదిస్తుండడంతో బాగోతాలన్నీ బయటకు వస్తున్నాయి.
కార్ల పేరుతో స్కాం.. నిందితుల వైపు ఖాకీలు
బల్కంపేట్ ఎల్లమ్మ (Balkampet Yellamma) తల్లి ఆలయం ఎదుట శ్రీ బాలాజీ కార్స్ పేరుతో కార్లు అమ్ముతుంటారు. అక్టోబర్ నెలలో స్విఫ్ట్ డిజైర్ కారును పూర్తి సొమ్ము 7 లక్షల రూపాయలు చెల్లించి నంద అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. కానీ, నెల రోజులకు ఆ వాహనంపై ఫైనాన్స్ ఉందని, ఈఎంఐ కట్టలేదని ఫైనాన్స్ కంపెనీ తీసుకొని వెళ్లిపోయింది. దీనిపై శ్రీ బాలాజీ కార్స్ యాజమాన్యాన్ని కలిస్తే నిర్లక్ష్యంగ మాట్లాడింది. దీంతో (SR Nagar Police Station) ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసుల నుంచి కనీస స్పందన లేదు. తాను కూడా ఫైనాన్స్ తెచ్చుకొనే ఆ కారు కొనుక్కున్నానని డబ్బులు కట్టలేక, కొన్న కారు తన వద్ద లేక, చాలా ఇబ్బందులు పడుతున్నానని బాధితుడు వాపోతున్నాడు. ఇంకా తనలాగా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు చెబుతున్నాడు. బాధ్యతగా ఉండాల్సిన పోలీసులు, ఈ వ్యవహారంలో సదరు కంపెనీతో కుమ్మక్కు అయినట్టు అనుమానాలున్నాయి.
Also Read:Empower Women:సెర్ప్ ఆధ్వర్యంలో రుణాలు.. మహిళా సంఘాల సభ్యులైతేనే సహకారం!
కన్సల్టెన్సీ మోసం విషయంలోనూ అంతే..
(SR Nagar Police Station) ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో రాకేష్,(Rakesh) సుమంత్ (Sumanth) అనే ఇద్దరు నిరుద్యోగులు ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వీరికి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. జేఏ మాస్టర్స్ అనే సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.30 లక్షలు తీసుకున్నాడు. ఒక కేరళ కంపెనీ పేరుతో ఫేక్ ఆఫర్ లెటర్‌ను ఇచ్చాడు. నెల తరువాత క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా జీతం ఇచ్చారు.
అనుమానంతో తాము ఎంక్వయిరీ చేయగా సదరు కంపెనీ పూర్తి ఫేక్ అని తెలిసిందని, ఇదే విషయమై కన్సల్టెన్సీని సంప్రదించగా రాజీనామా చేస్తే ఖర్చులకు పోను మిగిలిన డబ్బులు ఇస్తానని చెప్పారని, ఇప్పటి వరకు సంవత్సరం అవుతున్నా తమకు డబ్బులు ఇవ్వట్లేదని వాపోయారు. పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే మొదట కంప్లైంట్ తీసుకోలేదని రూ.10 వేలు ఇప్పిస్తాము, మిగతాది వారితో మాట్లాడుకొని తరువాత తీసుకోండి అని ఎస్సై చెప్పారని తెలిపారు. తనలాంటి వారు ఇంకా చాలా మంది ఉద్యోగం కోసం ఆ కన్సల్టెన్సీకి డబ్బులు కట్టి ఇబ్బందులు పడుతున్నారని తమకు న్యాయం చెయ్యాలని రాకేష్, సుమంత్‌లు విజ్ఞప్తి చేశారు.
పీఎస్‌లో ఏం జరుగుతోంది?
ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో ఫిర్యాదుదారుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు, తప్పు చేసిన వారి వైపు నిలబడి లంచాలకు మరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివి కొన్నే. ల్యాండ్ సెటిల్మెంట్ విషయాల్లోనూ కలుగజేసుకుని బాగా సంపాదిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు ఎస్ఆర్ నగర్ పీఎస్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టి తమ పక్షాన నిలబడాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
Also Read: Nipah virus: టెన్షన్ టెన్షన్.. మరో డేంజర్ కేసు నమోదు